కేసీఆర్ స్పీచ్…..జగన్ ట్వీట్…!!!

chandrababunaidu operation akarsh

నోరుందని నోరు పారేసుకుంటే పద్ధతి గా ఉండదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనను డర్టీయస్ట్ పొలిటిషియన్ అని, కాంగ్రెస్ ను ఇడియట్స్ అని మాట్లాడటాన్ని ఆయన అభ్యంతరం చెప్పారు. విధానాలను ఎవరైనా విమర్శించవచ్చు గాని, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. తనను దద్దమ్మ అనడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వాడిన భాష అసభ్యంగా ఉందన్నారు. ప్రచారంలోనూ తాను వ్యక్తిగత విమర్శలకు దిగలేదన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాల కోసం ప్రయత్నించానన్నారు. హుందాతనాన్ని ఎప్పుడూ తాను కోల్పోలేదన్నారు. అదే సమయంలో ఇష‌్యూ పైన రాజీ పడలేదన్నారు.

కేసీఆర్ కు రాజకీయ జన్మ ఇచ్చింది….

కేసీఆర్ ఎక్కడ నుంచి ఊడిపడ్డాడని ప్రశ్నించారు. కేసీఆర్ కు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం కాదా? తన దగ్గర మంత్రిగా పనిచేయలేదా? అని నిలదీశారు. ఉద్యమం పెట్టి కాంగ్రెస్ తో ఎందుకు కలిశావన్నారు. ఢిల్లీ కి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని చెప్పి మాట మార్చలేదా? అని అన్నారు. పద్ధతి లేకుండా మాట్లాడకూడదన్నారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీచేయాలని, ముసుగులు తొలిగించాలని చంద్రబాబు కోరారు. తాను ఎప్పుుడూ క్లియర్ గానే ఉంటానని, విభజనను వ్యతిరేకించానని, మోదీ నమ్మించి మోసం చేయబట్టే వదిలేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పబట్టే దానితో జతకట్టామని చంద్రబాబు వివరించారు.

నెత్తిన పెట్టుకుని మోయి…..

నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి ఉన్నప్పుడు ఐటీ ఉందని చెప్పి తప్పుదోవపట్టిస్తున్నారు. రాజీవ్ గాంధీ హయాంలో ఐటీ వచ్చిన మాట వాస్తవమే గాని, తన హయాంలోనే ఐటీ అభివృద్ధి జరిగిందని కేసీఆర్ ఎన్ని సార్లు పొగడలేదన్నారు. హైకోర్టు పట్ల ఇప్పటికీ తాను అన్నమాటకు కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీసం తమకు సమయం ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నించారు. నరేంద్రమోదీని కావాలంటే నెత్తిన పెట్టుకుని కేసీఆర్ మోసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ నుంచి తాను పార్టీలోకి లాక్కున్నప్పుడు నువ్వెక్కడున్నావని, నీవు మంత్రిగా అప్పుడు లేదా? అని అన్నారు. తాను అవకాశవాద రాజకీయాలను చేస్తున్నాననడం కేసీఆర్ అవివేకానికి నిదర్శమన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఏనాడైనా సహకరించావా? అని ప్రశ్నించారు.

నీ ఇంటికి మాత్రం 300కోట్లు….

సచివాలయాన్ని రైతులు ఇచ్చిన భూమితోనే కడుతున్నామన్నారు. కేవలం తనపై ఉన్న విశ్వాసంతోనే రైతులు భూములు ఇచ్చారన్నారు. కేసీఆర్ ఇంటికి మూడు వందల కోట్లు కావాలి కాని, సెక్రటేరియట్ కు 1500 కోట్లు సరిపోతాయా? అని ప్రశ్నించారు. సచివాలయం ఆత్మగౌరవం పెంచే విధంగా ఉండాలి. కేసీఆర్ మెచ్యూరిటీ అంటే మోసం చేయడమేనన్నారు. కేసీఆర్, మోదీ ఇష్టపడి బయటకు తిట్టుకుంటున్నారని, లోపల మాత్రం లాలూచీ రాజకీయాలన్నారు. హేళనగా మాట్లాడటం కేసీఆర్ కు తగదన్నారు. మీ పథకాలు కాపీ కొట్టే ఖర్మ పట్టలేదన్నారు. నీ నమూనాలను తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. తనకు భాష రాదని అనడమేంటన్నారు. అమరావతి రియాలిటీ అవుతుందని అసూయ అని అన్నారు. మోదీ వెనకుండి కేసీఆర్ చేత తనను తిట్టిస్తున్నారన్నారు. ఎందుకు తిట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ స్పీచ్ ఇస్తారు.. జగన్ ట్వీట్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత మోదీ ఫోన్ చేస్తారని చమత్కరించారు. కేసీఆర్ ఆక్స్ ఫర్డ్ లో చదివారా? అని ప్రశ్నించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*