ఆ సీట్లిస్తే చాలు బాబూ….??

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు కొంత ఆశలు చిగురించాయనే చెప్పాలి. ఇక్కడ ఓటు బ్యాంకును మొత్తం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి శ్వాస తీసుకోవడమూ కష్టమేననుకున్న తరుణంలో చంద్రబాబు ఆ పార్టీకి ఆపద్భాంధవుడిలా వచ్చారు. కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ తో కలసి ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీ రాజకీయాలపై ఎటువంటి చర్చలు ఇప్పుడే జరపమని చెబుతున్నకాంగ్రెస్ నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే గెలవగలిగే స్థానాలను గుర్తించాలని అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశం మేరకు ఏపీ కాంగ్రెస్ నేతలు పొత్తులో కోరనున్న స్థానాలను గుర్తించే పనిలో పడ్డారు.

ఏడు ఎంపీ స్థానాలు…..

అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎక్కవగా ఎంపీ స్థానాలను కోరనున్నట్లు తెలిసింది. మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏడు పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశముంది. ఇందులో కొందరు సిట్టింగ్ టీడీపీ పార్లమెంటు సభ్యులున్నవి ఉండటం గమనార్హం. ముఖ్యంగా శ్రీకాకుళం, కర్నూలు, రాజంపేట, విశాఖపట్నం, అరకు, తిరుపతి,కాకినాడ స్థానాలపై కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశముంది. వీటిలో కొందరు టీడీపీ సిట్టింగ్ ఎంపీలు ఉండగా, మరికొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అయినా చంద్రబాబు పొత్తు కోసం తమ ప్రతిపాదనను అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు.

ఈ రెండు స్థానాల్లో….

తొలుత తిరుపతి పార్లమెంటు సీటు కాంగ్రెస్ కు ఇవ్వడంలో ఎటువంటి సమస్యలూ లేవు. అక్కడ వైసీపీ ఎంపీగా గత ఎన్నికల్లోగెలిచిన వరప్రసాద్ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చింతామోహన్ పేరు దాదాపు ఖరారయినట్లే చెప్పుకోవాలి. రాజంపేటకూడా సేమ్ టు సేమ్. గత ఎన్నికలలో ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఈసారి దానిని కాంగ్రెస్ కు ఇవ్వడంలో బాబుకు ఎటువంటి ఇబ్బందిలేదు. ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు.

అభ్యర్థులు రెడీగా…..

ఇక కాకినాడ విషయానికొస్తే అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎంపీ తోట నరసింహం ఉన్నారు. ఆయన ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకిదిగాలనుకుంటున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు బరిలోకి దిగుతారు. మరోవైపు కర్నూలు సీటు విషయంలో మాత్రం బాబుకు ఇరకాటం తప్పదు. ఇక్కడ వైసీపీ గుర్తు మీద గెలిచిన బుట్టా రేణుక ఇటీవలే పార్టీలో చేరారు. ఆమెకు ఖచ్చితంగా టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలమైన నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉండటంతో కాంగ్రెస్ ఖచ్చితంగా కర్నూలు సీటును కోరితే బాబు ఏంచేస్తారన్నది ఆసక్తిగా మారింది. అరకు, విశాఖపట్నం విషయంలో బాబుకు ప్రాబ్లం లేదు. అక్కడ సిట్టింగ్ ఎంపీలు ఎవరూ తమ పార్టీకి చెందిన వారు లేకపోవడంతో అరకులో కిశోర్ చంద్రదేవ్, విశాఖ నుంచి సుబ్బరామిరెడ్డి పోటీచేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని మాత్రం బాబు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. అక్కడ కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. దీనికి బదులు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ నేతలు ఏడు ఎంపీ స్థానాలు గెలిపించుకుని రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారు. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకున్నా, పొత్తు ప్రస్తావన బహిరంగంగా బయటకు రాకున్నా ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంపీ సీట్లపై కసరత్తులు చేస్తుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*