బాబు మైండ్ సెట్ చేస్తుంది ఎందుకంటే..??

కాంగ్రెస్ తో జట్టు కట్టిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? పొత్తు లేకుండా బరిలోకి దిగినా ఎవరూ నమ్మరు. అందుకే ఆయన కాంగ్రెస్ తో ఖచ్చితంగా కలసి నడుస్తారన్నది పొలిటికల్ వర్గాల టాక్. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే… మాత్రం టీడీపీ ఆశావహుల ఆశల మీద నీళ్లు చల్లినట్లే. ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధానంగా చెప్పుకోదగ్గిన నేతలను వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అందులో రఘవీరారెడ్డి, శైలజానాధ్, కిల్లి కృపారాణి, కిషోర్ చంద్రదేవ్,కనుమూరి బాపిరాజు, ద్రోణం రాజు శ్రీనివాస్, పనబాక లక్ష్మి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వంటి వారున్నారు.పొత్తుతో ముందుకు వెళితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలనే ఇవ్వాల్సి వస్తుంది. బీజేపీతో పొత్తులాగా కాంగ్రెస్ ఉండదు. ఇక్కడ హేమాహేమీలు ఉండటంతో ఖచ్చితగా ఆ సీట్లకోసం పట్టుబట్టడం ఖాయం.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలను….

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యలను తన పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు అక్కడి టీడీపీ ఇన్ ఛార్జులతోనే వేగలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన వారికే టిక్కెట్లు ఇవ్వడం కష్టమని చెబుతున్నారు. 23 మందిలో దాదాపు పదహారు మంది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు సర్వేల్లో వెల్లడయింది. దీంతో వీరిలో కొందరిని నియోజకవర్గాలను మార్చాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కోరే స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశముంటుంది.

కొందరి సీట్లు గల్లంతే….

కర్నూలు పార్లమెంటు స్థానాన్ని తీసుకుంటే అక్కడ వైసీపీ గుర్తుమీద గెలిచిన బుట్టా రేణుక టీడీపీలో చేరారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అది కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు బుట్టారేణుక పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న అనుమానాలు. అలాగే కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, కిశోర్ చంద్రదేవ్ లాంటి నేతల స్థానాలను కూడా టీడీపీ వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు మానసికంగా సిద్ధపడాలనే చంద్రబాబు ముందునుంచే క్యాడర్ కు కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందో ఉద్భోదిస్తున్నారు.

ఎక్కువగా ఎంపీ స్థానాలనే…..

అయితే చంద్రబాబు స్ట్రాటజీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఎమ్మెల్యే స్థానాలకన్నా, ఎక్కువ పార్లమెంటు స్థానాలను కేటాయించవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇరవైకి మించి లేకపోవడం చంద్రబాబుకు కలసి వచ్చే అదృష్టం. ఎక్కువ ఎంపీ స్థానాలను కేటాయిస్తే రాహుల్ గాంధీ తో పలు సభలను ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఇస్తామని మరోసారి ప్రజలను ఆకట్టుకోవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ అభ్యర్థులు కూడా ఎక్కువ మంది గెలచే అవకాశాలు లేవని కూడా సర్వేలు స్పష్టం చేస్తుండటంతో కాంగ్రెస్ కు ఎక్కువ ఎంపీ స్థానాలిచ్చి, ఆ పార్టీకి ఉన్న ఓట్ల శాతంతో మరోసారి గెలుపు గుర్రం ఎక్కాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది. మరి కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ నేతలు సహకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*