పథకాలు పంక్చర్ అయ్యాయా..?

narachandrababunaidu-schemes-in-andhra-pradesh-elections

ముక్కు సూటిగా వ్యవహరించే నేత జేసీ దివాకరరెడ్డి ఫీల్డ్ రిపోర్టు బయటపెట్టేశారు. 35 ఏళ్లుగా చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న జేసీ పైసలతోనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని మొఖం మీద కొట్టి చెప్పేశారు. పార్టీలు బయటికి చెప్పకపోయినా ఒక్కో అభ్యర్థి 25 కోట్లు ఖర్చు చేశాడని నిజం బట్టబయలు చేశారు. ఓటర్లు సంక్షేమ పథకాలు చూడటం లేదు. ఓటుకెంతిస్తావని అడుగుతున్నారంటూ నిష్టూరమాడారు. చంద్రబాబు చెప్పే సంతృప్తస్థాయి, ప్రవేశపెట్టిన 120 పథకాలు ఓట్లు రాల్చలేదంటూ కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షాలు సైతం తోసిపుచ్చలేని జేసీ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించడమే కాదు. రాజకీయనేతలు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. సొంతపార్టీని కూడా ఆయన వదిలిపెట్టకపోవడమే విశేషం. ప్రభుత్వ పథకాల రూపంలో ఖర్చు చేస్తున్న వ్యయం కూడా ఓటర్లపై ప్రభావం చూపడం లేదనేది ఆయన అంచనా. మహిళలకు, వృద్ధులకు ఇస్తున్న పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుదల మాత్రమే పనికొచ్చాయన్నారు. అభివృద్ది, మౌలిక వసతులు, ఉద్యోగ కల్పన వంటి లెక్కలు ఏమీ పనిచేయలేదని అనుభవంతో తేల్చిన ఆయన మాటల్లోని వాస్తవాలను పార్టీలు, ప్రభుత్వాలు అసెస్ చేసుకోవాల్సిన తరుణమిది. టీడీపీ సమీక్షల్లో అభ్యర్థుల నివేదికలు, జేసీ వ్యాఖ్యలు అదే విషయాన్ని ధృవపరుస్తున్నాయి.

యువనేస్తం ఉసూరు…

నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం దేశంలో ఎక్కడా అమలు కానంత పెద్ద సంఖ్యలో పథకాలను రూపకల్పన చేసింది. చాలా స్కీముల ఆనుపానులు పార్టీ కార్యకర్తలకు కూడా తెలియదు. ఎన్టీయార్, చంద్రబాబు నాయుడుల పేరుతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పాత ప్రభుత్వాల పథకాల పేర్లు మార్చేశారు. గతానికి ఇప్పటికీ తేడా ఒకటే. గతంలో కేవలం ఎన్టీయార్ కి మాత్రమే పరిమితమైన పేరులు చంద్రబాబుకూ విస్తరించారు. అయినప్పటికీ వాటి ఫలితాలు పార్టీకి లభించలేదనేది పార్టీ అంతర్గత అంచనా. ప్రతిష్ఠాత్మకంగా భావించిన నిరుద్యోగ భృతి యువనేస్తం పెద్దగా ఫలించలేదని సమీక్షల్లో వెల్లడైంది. యువకుల్లో ఎక్కువమంది వైసీపీ, జనసేన ల వైపు మొగ్గు చూపినట్లుగా ఎమ్మెల్యేలే వెల్లడించడం విశేషం. 120 వరకూ పథకాలు పెట్టినా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లి మారుమోగేలా చేయడంలో విఫలమయ్యామనేది పార్టీ నేతల అభిప్రాయం. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తల బలం చెక్కుచెదరలేదనేది నాయకుల స్థూల విశ్లేషణ. అదే పార్టీ ని రక్షించిందని, ఏదో రకంగా గట్టెక్కుతున్నామని నాయకులు చెబుతున్నారు. అన్న కాంటీన్లు, ఎన్టీయార్ వైద్యసేవ, తల్లీబిడ్డల ఎక్స్ ప్రెస్ వంటి కొన్ని పథకాల నుంచి మాత్రం కొంతమేరకు లబ్ధిదారుల ఓట్లు లభించాయని అంచనా. స్కీములు ప్రచారం పెద్ద ఎత్తునే చేపట్టినా సీరియస్ నెస్ తగ్గిపోయిందని నాయకులు పేర్కొంటున్నారు.

అన్నదాతా.. హంబగ్…

అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా రైతులను సంతృప్తి పరచాలని భావించిన పార్టీ యత్నాలు పాక్షికంగా మాత్రమే ఫలించాయి. 2014 ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన రైతు రుణమాఫీ ఇంతవరకూ పూర్తిగా అమలు కాలేదు. ఇంకా వాయిదాలు చెల్లిస్తూనే ఉన్నారు. మరోవైపు పక్కనున్న తెలంగాణతో రైతులు పోల్చుకోవడం ఎక్కువగా కనిపించిందని సమీక్షల్లో నేతలు అధిష్ఠానానికి నివేదించినట్లు సమాచారం. తెలంగాణలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైంది. మరోవైపు ఎకరాకు పదివేల రూపాయల వరకూ రైతుబంధు పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తున్నారు. దాంతో తమకున్న పొలం విస్తీర్ణాన్ని బట్టి పెద్దమొత్తంలోనే రైతులకు పెట్టుబడి లభిస్తోంది. పొలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతు కుటుంబానికి పదిహేనువేల రూపాయలు ఇవ్వాలనేది ఏపీ పథకం. అందులోనూ నాలుగువేల రూపాయల వరకూ మాత్రమే చెల్లించారు. రైతులు దీనిని పెద్ద మొత్తంగా భావించడం లేదు. దీంతో అన్నదాతా సుఖీభవ స్కీమ్ ఫలితాలపైనా నేతలు పెదవి విరిచారు. అందుకే ఇప్పుడు జేసీ వ్యాఖ్యల్లోని వాస్తవాలను నాయకులు అంగీకరిస్తున్నారు. వివిధ వర్గాలు పలు కారణాలతో పార్టీకి దూరమయ్యాయి. అందుకే చివరిలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమైన పసుపు కుంకుమ, పెంచిన వ్రుద్ధాప్య పింఛన్లే కాపాడుతాయన్న నమ్మకాన్ని నాయకులు సైతం విశ్వసిస్తున్నారు.

పసుపు కుంకుమే పక్కా…

చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా చివరలో ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ లేకుంటే భగవంతుడే దిక్కయ్యేవారని జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యానించడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. చంద్రబాబు కష్టాన్ని పట్టించుకున్నవారు లేరు. 120 పథకాలలో ఒక్కదానికీ ప్రశంసలేదనీ ఆయన నిష్ఠూరంగా చెప్పారు. అదృష్టం బాగుండి ఎన్నిక తొందరగా వచ్చిందని వ్యాఖ్యానించారు. డబ్బులు ఇచ్చిన వెంటనే ఎలక్షన్ జరగడం కలిసొచ్చిందన్నారు. నెల ఆలస్యమైతే ఓటర్లు మర్చిపోయేవారన్నారు. నిజానికి తెలుగుదేశం ఎన్నికలను తొలివిడతలోనే పెట్టడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు తగినంత సమయం ఇవ్వకుండా ఎన్నికల తంతు ముగించేయాలనే కుట్ర దీనిలో దాగి ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే తొలివిడతలోనే ఎన్నిక పెట్టడం టీడీపీకి కలిసి వచ్చిందనేది సమీక్షల అనంతరం నాయకత్వం నిర్ధారించుకొంది. ఏప్రిల్ 3న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశారు. ఏప్రిల్ 1న పెంచిన పింఛన్ల మొత్తం వృద్ధులకు అందింది. ఏప్రిల్ 8న పసుపు..కుంకుమ బ్యాంకుల్లోజమ అయ్యింది. ఏప్రిల్ 9 న నాలుగోవిడత రుణమాఫీ నిధులు జమ అయ్యాయి. ఇవన్నీ ఎంతోకొంత కలిసివచ్చాయనేది నాయకుల విశ్వాసం. అయితే అందరూ అంగీకరించే ఏకాభిప్రాయం మాత్రం పసుపు కుంకుమే కాపాడిందనేది. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 20 నుంచి 25 వేల వరకూ పసుపు కుంకుమ ఓట్లు టీడీపీకి పడి ఉంటాయని అంచనా వేసుకుంటున్నారు. ఇది గెలుపు పరుగులో ట్రంప్ కార్డుగా మారిందని ఫలితాలపై టీడీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 17096 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*