టీడీపీకి తేడా కొట్టే స్థానాలివే…. బాబు గుర్తించారా.. !

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగులంద‌రికీ చంద్రబాబు టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరా..? ప‌లువురు ఎమ్మెల్యేల ప‌నితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..? ప‌నితీరు మార్చుకోని నేత‌ల‌కు ఈసారి చెక్ పెట్టేందుకు సిద్ధమ‌వుతున్నారా..? ఈ టికెట్లు ద‌క్కని జాబితాలో సుమారు 26 నుంచి 30మంది ఉన్నారా..? అంటే మాత్రం పార్టీవ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి. ఇటీవల పార్టీ నేత‌ల‌తో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయిలో స‌మావేశంలో ఆయ‌న చెప్పిన ప‌లు విష‌యాలు ప‌లువురు నేత‌ల‌కు తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలామందికి టికెట్లు ద‌క్కవ‌ని ప్రచారం జోరందుకుంది.

అక్కడ అస్సలు బాగాలేదని…..

ప‌నితీరు బాగాలేని నేత‌లెవ‌రో చంద్రబాబు చెప్పడంతో వారు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నట్లు తెలుస్తోంది. ప‌నితీరు మార్చుకుని అధినేత మెప్పుపొందాల‌ని తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట‌. అయితే.. ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరుపై చంద్రబాబు ఎప్పటిక‌ప్పుడు స‌ర్వేలు చేయిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన స‌మావేశంలో ఆ స‌ర్వే వివ‌రాలు, పార్టీ ప‌రిస్థితి, ఏయే స్థానాల్లో పార్టీ బ‌లంగా ఉంది..? ఎక్కడ బ‌ల‌హీనంగా ఉంది..? దీనికి గ‌ల కార‌ణాలు ఏమిటి..? ప‌నితీరు మార్చుకోని నేత‌లు ఎవ‌రు..? అన్న విష‌యాలపై చంద్రబాబు సూటిగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ 130 చోట్ల పార్టీ ప‌రిస్థితి కొంత బావుందని, మ‌రో 26 చోట్ల పార్టీ ప‌రిస్థితి బాగోలేద‌ని ఆయ‌న స్పష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.

వచ్చి చేరిన వారి నియోజకవర్గాల్లో……

ఇందుకు నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయం లోపించ‌డ‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పడం పార్టీవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఇందులో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని చంద్రబాబు చెప్పిన‌ట్లు స‌మాచారం. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ 102 స్థానాల్లో విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సుమారు 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అయితే ఈ స్థానాల్లోనూ పార్టీ ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగా మారింద‌ని స్వయంగా చంద్రబాబు చెప్పడంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నేత‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నట్లు స‌మాచారం. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రధానంగా టీడీపీ మొద‌టి క్యాడ‌ర్‌కు, వైసీపీ నుంచి నేత‌ల అనుచ‌రుల‌కు మ‌ధ్య స‌మ‌న్వయం లేద‌ని ఆయ‌న చెప్పడం పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది.

బీజేపీకి కేటాయించిన స్థానాల్లోనూ……

ఇక గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 15 సీట్లు కేటాయించారు. ఈ సీట్లలో ఆ పార్టీ కేవ‌లం 4 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే విజ‌యం సాధించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ప‌రిస్థితి అంత ఆశాజ‌న‌కంగా లేదు. ఇక ముఖ్యంగా టీడీపీ ప‌రిస్థితి రిజ‌ర్వ్‌డ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు వైసీపీ నుంచి వ‌చ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా సంక్లిష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పటికైనా ప‌నితీరు మార్చుకుని అంద‌రూ స‌మ‌న్వయంతో ప‌ని చేసి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపున‌కు కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అయితే.. చంద్రబాబు వ్యాఖ్యల నేప‌థ్యంలో సుమారు 26 నుంచి 30మంది సిట్టింగ్‌ల మార్పు ఖాయ‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.