ముహూర్తం ఎప్పుడు బాబూ….?

గత నెల 27వ తేదీనే మంత్రివర్గ విస్తరణ అన్నారు…కానీ జరగలేదు…. దసరా అన్నారు… ఇదీ సాధ్యమయ్యేలా లేదు. ఏదో ఒక ఆటంకం మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తోంది. మంత్రి వర్గ విస్తరణ ఉందంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రకటించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరో ఏడు నెలలు మాత్రమే ప్రభుత్వానికి సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఐదు నెలలకు మంత్రివర్గ విస్తరణ ఎందుకన్నది కొందరి సీనియర్ల వాదన. అయితే మంత్రివర్గంలో మైనార్టీలకు, ఎస్టీలకు స్థానం కల్పించాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం.

అంతవరకే పరిమితమా….?

అయితే మైనారిటీ, ఎస్టీల కోసం మంత్రి వర్గ విస్తరణ జరిగితే పార్టీలో అసంతృప్తులు తలెత్తే అవకాశముందని కూడా చంద్రబాబుకు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , గౌతు శ్యాం సుందర శివాజీ, తొలిసారి గెలిచిన బోండా ఉమామహేశ్వరరావు లాంటి నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే మైనారిటీ, గిరిజనుల నుంచి మాత్రమే కేబినెట్ లో తీసుకుని విస్తరణ ముగించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

కిడారి కుమారుడికి……

తాజాగా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. కిడారి శ్రావణ్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో గిరిజనులు ప్రాబల్యం ఉన్న పాడేరు, అరకుతో పాటు రంపచోడవరం అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకోవచ్చన్నది బాబు వ్యూహంగా ఉంది. గత ఎన్నికల్లో ఈ సీట్లన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినప్పటికీ వారి గెలుపు అంతంత మాత్రంగానే ఉండటంతో కిడారి కుటుంబం నుంచి శ్రావణ్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆపద సమయంలో అండగా నిలిచానన్న సంకేతాలను గిరిజనుల్లోకి పంపవచ్చని బాబు ఆలోచిస్తున్నారు.

ఈ నెలాఖరుకు……

అలాగే మైనారిటీ నుంచి ఒకరిని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఎమ్మెల్సీ షరీఫ్ కాని ఎన్ఎండీ ఫరూక్ కు కాని ఖరారయ్యే అవకాశాలున్నాయి. అయితే దసరా సమయానికే అనుకున్నప్పటికీ మధ్యలో తిత్లీ తుఫాను కారణంగా చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణను మరోసారి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను సహాయక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తిరిగి మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. మరి ముహూర్తం ఎప్పుడన్నది ఇంకా తేలకున్నా…. ఈనెల చివర అన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*