పోలింగ్ కు ముందు మూడు రోజుల్లోనే సీన్ మారిందట…!!

narachandrababunaidu-telugudesamparty

‘‘వైసీపీ అభ్యర్థులు ఈసారి బాగా ఖర్చుచేశారు. ఊహించని విధంగా రెండు విషయాల్లో వైసీపీ అభ్యర్థులు పైచేయి సాధించారు. ఒకటి మనీ మేనేజ్ మెంట్. రెండు పోల్ మేనేజ్ మెంట్.’’ ఇది తెలుగుదేశం పార్టీలో పోల్ పోస్ట్ మార్టంపై టీడీపీ అభ్యర్థులు చెబుతున్న విషయాలు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడంతో తాము డబ్బులు పంచలేకపోయామని కొందరు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమచారం. ఎక్కువ దాడులు తమపైనే జరిగాయని, పోలీసుల నిఘా కూడా టీడీపీ అభ్యర్థులపైనే పెట్టిందని అనేకమంది అభ్యర్థులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈవీఎంలపైనే అందరూ…

ఉండవల్లిలోని ప్రజా వేదికలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు 25 పార్లమెంటు స్థానానికి చెందిన అభ్యర్థులతో చంద్రబాబునాయుడు ఈరోజు సమావేశమయ్యారు. అయితే ఎక్కువ మంది ఈవీఎంలు మొరాయించాయని, సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఓటర్లు తిరిగి వెళ్లారని ఎక్కువ మంది అభ్యర్థులు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తాము తొలినుంచి ప్రచారంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ బలంగా ఉన్నప్పటికీ పోలింగ్ కు రెండు, మూడురోజుల ముందు వైసీపీ నేతలు బాగా ఖర్చు చేసినట్లు గుంటూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారట.

పోలీసులు సహకరించ లేదంటూ….

తాను చేసిన ఖర్చుకు రెట్టింపు ఖర్చును వైసీపీ అభ్యర్థి చేశారని అదే జిల్లాకు చెందిన మరోనేత చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ముందస్తు వ్యూహాన్ని బాగా అనుసరించిందని కొందరు పేర్కొన్నారు. అయితే మీరు ఎందుకు ఫెయిలయ్యారన్న ప్రశ్నకు అధికారులు, పోలీసులు సహకరించలేదని వివరణ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. తాను మంత్రిని అయినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని కర్నూలు జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. దీంతో చంద్రబాబు కూడా ఇతర నియోజకవర్గాల్లో అధికారులు, పోలీసుల సహాయ నిరాకరణపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

పవన్ ఎఫెక్ట్….

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ తమపార్టీపై పడుతుందని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆందోళన చెందగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం జనసేన వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని కొందరు తమ అభిప్రాయాన్ని చెప్పారట. ఇక రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు సక్రమంగా మేనేజ్ మెంట్ చేయలేదని చంద్రబాబు సయితం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రిజర్వ్ డ్ నియోజకవర్గాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లుగా ప్రత్యేక దృష్టి పెట్టిందని కొందరు చెప్పారని తెలిసింది. మొత్తం మీద ఉండవల్లి ప్రజావేదికలో ఎక్కువమంది టీడీపీ అభ్యర్థులు ఎన్నికల కమిషన్, అధికారులపై నెపంనెట్టారని తెలిసింది.

Ravi Batchali
About Ravi Batchali 17100 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*