నేను రెడీ.. మీరు రండి…!!

narachandrababunaidu-war-start

ఎన్నియో యుద్ధముల ఆరితేరిన రాజకీయ యోధుడు చంద్రబాబు నాయుడు. 2019 కి ఒక్కటొక్కటిగా అస్త్రాలు సమకూర్చుకుంటున్నారు. ప్రజలకు ప్రభుత్వం పట్ల సంత్రుప్తస్థాయి నూటికి 80 శాతం మేరకు ఉందంటూ పైకి ఎన్ని విధాలుగా చెప్పినా వాస్తవం చంద్రబాబుకు తెలుసు. నాలుగున్నరేళ్ల తర్వాత కచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుంది. అంతంతమాత్రం ఆర్థిక పరిస్థితితో ఎదురీదుతున్న రాష్ట్రంలో ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదు. అప్పులు దూసి తెచ్చిన నిధులతో సంక్షేమ పథకాల అమలు సాగుతోంది. కానీ అవి ప్రజలు హక్కుగా భావిస్తున్నారే తప్పితే ప్రభుత్వం తమపై కనబరిచే ప్రేమగా అనుకోవడం లేదు. రాజకీయ అవసరంగానే గుర్తిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈమాత్రం సంక్షేమం ఇస్తుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటున్నారు. ప్రత్యేకించి తెలంగాణతో కంపారిజన్ బాగా కనిపిస్తోంది. దీంతో సంక్షేమ పథకాల వల్ల సర్కారుకు ఓట్ల పంట పండుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటు బ్యాంకు లాయల్టీనే నమ్ముకోవాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షానికి, అధికారపార్టీకి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం తక్కువ కావడంతో నిజానికి పోటాపోటీ వాతావరణం తప్పదని స్పష్టమవుతోంది. పైపెచ్చు గడచిన ఏడాదికాలంగా ప్రతిపక్షనాయకుడు పాదయాత్ర పేరుతో పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు. వీటన్నిటినీ ఎదుర్కొనే అస్త్రాలపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారు.

అంది వచ్చిన హైకోర్టు…

హైకోర్టు తరలింపు సైతం టీడీపీ అధినేత చేతిలో రాజకీయ అస్త్రంగా మారుతోంది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం, శాసనవ్యవస్థ వేరు అయినప్పటికీ న్యాయవ్యవస్థ వేరు కాలేదు. ఉమ్మడి హైకోర్టు కొనసాగుతోంది. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం తొలి నుంచీ గొడవ చేస్తోంది. టీడీపీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నంతకాలం హైకోర్టు విభజన విషయంపై కేంద్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. టీడీపీ, బీజేపీ సంబంధాలు దెబ్బతిన్నతర్వాతనే టీఆర్ఎస్ వాదనను ఆలకించడం ప్రారంభించింది. విభజనకు చర్యలు తీసుకుంది. సుప్రీం కోర్టులో దీనిపై దాఖలైన వ్యాజ్యానికి అనుకూలంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం కూడా మేము సిద్ధంగానే ఉన్నామంటూ అఫిడవిట్ ఇచ్చేసింది. నిజానికి అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనం పూర్తి చేసుకుని, వసతులు సమకూర్చుకోవడానికి మరో నాలుగైదు నెలలు సమయం పడుతుంది. హఠాత్తుగా జనవరి ఒకటిన అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేసుకోమని రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చేశారు. కేంద్రం కావాలనే ఏపీని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేసిందంటూ చంద్రబాబు రాజకీయాన్ని బయటికి తీశారు. ఇందులో జగన్ కేసుల ను జాప్యం చేద్దామనే ఉద్దేశమూ దాగి ఉందని కొత్త కోణాన్ని జోడించారు. రాజకీయ అవసరాలకు న్యాయవ్యవస్థ సైతం చక్కగా సందర్భోచితంగా వినియోగితమవుతుందని నిరూపించారు.

శ్వేతాయుధం…

భారతీయ జనతాపార్టీ కొత్త సంవత్సరంలో భారీ ఎత్తున గుంటూరులో బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. నరేంద్రమోడీని రప్పించి టీడీపీపై దాడి చేయించాలనేది లక్ష్యం. దాదాపు నెలరోజులుగా ఇందుకు సంబంధించి రాష్ట్రనాయకుల జిల్లాల పర్యటనలు, ఏర్పాట్లకు సంబంధించి నిధుల సమీకరణ సాగింది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు శ్వేతపత్రాల విడుదలను మొదలుపెట్టారు. మొత్తం ఈ వైట్ పేపర్ల లక్ష్యం ఒకటే. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం, తమ ప్రభుత్వం ఎంతమేరకు కష్టపడుతుందో తెలపడమే ఉద్దేశంగా వీటిని రూపొందించారు. రెండు ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అభివృద్ధికి పట్టం గడుతోందని గణాంకాల సహా వివరించడమూ వైట్ పేపర్లలో కనిపిస్తుంది. అదే సమయంలో సందర్భం దొరికినప్పుడల్లా కేంద్రం వైపు వేలెత్తి చూపడమూ జరుగుతోంది. నరేంద్రమోడీ పర్యటనకు ముందే ఏపీ ప్రజల్లో బలమైన సెంటిమెంటు రేకెత్తించాలనేది అంతర్గత లక్ష్యం. దీనివల్ల యాంటీ బీజేపీ సెంటిమెంటు తో టీడీపీకి రాజకీయప్రయోజనం సమకూరుతుంది. ప్రధాని పర్యటనకు ఆశించినంత స్పందన లభించకుండా చూడవచ్చని ఆశించారు. ఈవిషయంలో ముందస్తుగానే చంద్రబాబు విజయం సాధించారని చెప్పవచ్చు. మోడీ పర్యటనను రద్దు చేసుకున్నారు. కారణాలు వేరుగా చెప్పినప్పటికీ వ్యక్తిగతంగా ప్రధానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారంపై ఇంటిలిజెన్సు సమాచారాన్ని కేంద్రం సేకరించింది. మోడీ పర్యటనను వ్యతిరేకించమంటూ ముఖ్యమంత్రి సైతం పిలుపునిచ్చిన అంశాన్నీ తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటన వృథా ప్రయాసగా గుర్తించారు.

కేసీఆర్ కోసం…

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైసీపీకి రానున్న ఎన్నికల్లో సహకరిస్తారని టీడీపీ భావిస్తోంది. అయితే ఈ సహకారం పరోక్షంగా ఉంటుందా? ప్రత్యక్షంగా ఉంటుందో తేల్చుకోలేకపోతోంది. కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తే సెంటిమెంటును రెచ్చగొట్టవచ్చని భావిస్తోంది. దానివల్ల టీడీపీకి పొలిటికల్ మైలేజీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రజాకూటమి తరఫున ప్రచారం చేశారు. దీనిని టీఆర్ఎస్ అందిపుచ్చుకుని నానాయాగీ చేసింది. సెంటిమెంటుతో ఓటింగును సైతం ప్రభావితం చేసుకోగలిగింది. అదే అస్త్రాన్ని ఇప్పుడు తాము వాడుకోవాలని టీడీపీ యోచిస్తోంది. కేసీఆర్ తో ఎవరు చేతులు కలిపినా యాంటీ ఏపీ ముద్ర వేయవచ్చని ఎదురుచూస్తోంది. అయితే కేసీఆర్ చాలా తెలివైన రాజకీయవేత్త. అంత సులువుగా టీడీపీకి చిక్కరు. ఆయుధం ధరించకుండా పరోక్ష మార్గాల ద్వారానే టీడీపీ పై సమరం సాగించే చాన్సులున్నాయనేది పరిశీలకుల అంచనా. చంద్రబాబు నాయుడిని సొంత రాష్ట్రంలో ఓడించగలిగితే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్న తనకు మార్గం సుగమం అవుతుందనేది కేసీఆర్ యోచన. ఏపీలో సైతం తనకు సానుకూలమైన సర్కారు ఏర్పడితే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం కూడా సాకారమవుతుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*