బాబు మాట విని రిస్క్ చేస్తున్న‌ నారాయ‌ణ

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ ఈసారి ఎలాగైనా ఎన్నిక‌ల బరిలోకి దిగాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఎమ్మెల్సీగా కేబినెట్‌లోకి వ‌చ్చేసిన ఆయ‌న ఈసారి సొంత‌ జిల్లా నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మైపోతున్నారు. మ‌రి ఇంత హ‌ఠాత్తుగా ఆయ‌న ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారు అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే వినిపించ‌క మాన‌దు. మ‌రి దీనంత‌టికీ ఒకే ఒక్క కార‌ణం.. పార్టీ అధినేత చంద్ర‌బాబేన‌ట‌. ఆయ‌న అన్న ఒకే ఒక్క మాటతో నారాయ‌ణ ఇప్పుడు పోటీలో నిల‌వాల‌ని భీష్మించుకున్నార‌ట‌. మ‌రీ ముఖ్యంగా నెల్లూరు ప‌ట్ట‌ణం నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇక్క‌డ టికెట్ ఆశిస్తున్న అభ్య‌ర్థి.. నారాయ‌ణ‌కు టికెట్‌ వ‌దిలేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పైకి క‌నిపిస్తున్నా.. ఇత‌ర పార్టీల నేత‌ల‌తో మంత‌నాలు జరుపుతున్నార‌ట‌. ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ కోసం నారాయ‌ణ శిష్యుడు బ‌రిలో ఉన్నార‌ట‌. దీంతో ఇప్పుడు నెల్లూరు సిటీ రాజ‌కీయాలు హీటెక్కాయి.

తెలుగుదేశం పార్టీకి ముందునుంచీ…

నెల్లూరు సిటీ నియోజకవర్గంపై తొలి నుంచి తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని అశ్రద్ధ చేస్తూనే ఉంది. జిల్లా కేంద్రంపై పట్టులేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ పాయింట్‌. ఇంకా చెప్పాలంటే గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా టీడీపీ ఈ జిల్లాలోనే పాతాళానికి ప‌డిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో మూడు సీట్లు గెలిచినా అవ‌న్నీ అత్తెస‌రు మెజార్టీతో భ‌య‌ట‌ప‌డ్డ‌వే. ఇక సిటీ సీటు గురించి చెపితే ప‌రిస్థితి మ‌రీ దారుణం. 1983లో ఆనం రామనారాయణరెడ్డి, 1994లో తాళ్లపాక రమేశ్‌రెడ్డి మాత్రమే టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. 1994 తర్వాత టీడీపీకి ఇప్పటివరకూ ఇక్కడ విజయమే దక్కలేదంటే అర్థం చేసుకోవ‌చ్చు. టీడీపీపై స్థానికుల్లో వ్య‌తిరేకత ఉందా అంటే అదీలేదు. కేవలం ఆ పార్టీ ఈ స్థానంపై మొదటి నుంచి అశ్రద్ధ వహించడం వల్లే స్వపక్షంలోనే వెన్నుపోటుదారులు తయారయ్యారు. దీంతో ఇక్కడ ప్రత్యర్ధులకి విజయం సులభమైంది. మ‌రి ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి నారాయ‌ణ పోటీకి సై అంటున్నారు. అందుకే న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టి ప్ర‌జ‌ల‌కు చేరువ‌వుతున్నారు.

మొదట తిరుపతి అనుకున్నా…

`ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచి వస్తే తెలుస్తుంది రాజకీయం అంటే ఏంటో? ఎమ్మెల్సీలు తీసుకుంటే ఏమి తెలుస్తుంది?` అని గ‌తంలో చంద్ర‌బాబు అన్న మాట నారాయణ గుర్తుపెట్టుకున్నార‌ట‌. అందుకే ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాలని నిర్ణ‌యించుకున్నార‌ట‌. వాస్త‌వానికి నారాయ‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ముందుగా ఆయ‌న సామాజిక‌వ‌ర్గం అయిన బ‌లిజ ఓట‌ర్లు ఎక్కువుగా ఉన్న తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం మీద కూడా కాన్‌సంట్రేష‌న్ చేశారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ స్థానిక లీడ‌ర్ల‌కు ఆయ‌న ఎన్ని సాయాలు చేసినా ఓట‌ర్ల నుంచి నాన్‌లోక‌ల్ అన్న వ్య‌తిరేక‌త క‌నిపించే ప్ర‌మాదాన్ని ముందే ఊహించిన ఆయ‌న చివ‌ర‌కు త‌న సొంత జిల్లా కేంద్ర‌మైన నెల్లూరు సిటీ మీదే దృష్టి పెట్టారు. ఇక్క‌డ సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి చూస్తే నారాయ‌ణ గెలుపు అంత సులువు కాదు.

సిటీ నుంచి పోటీకి శిష్యుడి ఆరాటం…

నెల్లూరు రెడ్ల‌తో పోటీప‌డ‌డం అంటే మామూలు విష‌యం కాదు. నారాయ‌ణ ఇక్క‌డ నుంచి పోటీపై గ్రీన్‌సిగ్న‌ల్స్ వ‌ద‌ల‌డంతో ఇక్కడి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి కూడా మార్పుకి అంగీకారం తెలిపారట. పైకి ఇలా అంటున్నప్పటకీ, జనసేన అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట‌. ఇక మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా సిటీ లేదా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. అజీజ్‌కి నారాయణ గురువు. సిటీలో నలభై వేలకి పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయనీ.. తనకు టిక్కెట్‌ ఇస్తే కచ్చితంగా గెలుపొందుతాననీ ఆయన అంచనా వేస్తున్నారు.

వెన్నుపోటుదారలతోనే అసలు రిస్క్…

ఒకవేళ సిటీ నుంచి నారాయణ పోటీకి దిగితే.. రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయట. ఈ తరుణంలో రూరల్ టిక్కెట్టు అయినా దక్కించుకోవాలని మేయర్‌ అజీజ్‌ ఆలోచిస్తున్నారట. నెల్లూరు సిటీ నుంచి నారాయణ బరిలోకి దిగుతారన్న సంకేతాలు రావడంతో స్థానిక టీడీపీలో రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిటీలో వెన్నుపోటుదారులు కాచుకుని ఉండే ప్రమాద ముందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ ఇక్కడినుంచి పోటీచేసి గెలుపొందితే వచ్చే రోజుల్లో తమ ఉనికికి ప్రమాదం అన్న భావనతో కొందరు వెన్నుపోట్లకి దగవచ్చునన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కూడా ఇప్పుడు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. మ‌రి ఇన్ని ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య నారాయ‌ణ పోటీ అంటే రిస్క్ చేస్తున్న‌ట్లే క‌దా!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*