దీనికోసం ఇద్దరూ దిగాలు….!

ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వీరిద్దరికీ సవాల్ గా మారనుంది. రాజ్యసభలో తగిన బలం లేకపోవడం, మిత్రపక్షాలు గత కొద్దిరోజులుగా తమతో వైరాన్ని కొనసాగిస్తుండటంతో ఈ పదవిని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న వ్యూహాలను ఇప్పటి నుంచే రచిస్తున్నారు.మిత్రపక్షాల సహకారంతోనే డిప్యూటీ ఛైర్మన్ ను దక్కించుకునే వీలుంది. అయితే అవి ఎంత మేరకు సహకరిస్తాయన్నది చెప్పలేని పరిస్థితి. వచ్చే నెలలోనే ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదవీ విరమణ చేయనున్నారు.

బలం లేకపోవడంతో…..

రాజ్యసభలో ప్రస్తుతం 241 మంది సభ్యులున్నారు. ఇందులో బీజేపీ కూటమి బలం 87 మంది మాత్రమే. అలాగని విపక్షాలు కూడా పెద్దగా బలంగా లేవు. యూపీఏకు రాజ్యసభలో కేవలం 58 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో ఇతరుల సహకారంతోనే ఈ పదవిని చేజిక్కించుకునే వీలుంటుంది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ పదవిపై కూడా చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. విపక్షాల నుంచి ఒక అభ్యర్థిని పోటీకి దింపితే ఎలాగుంటుందన్న ఆలోచన కూడా వీరు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకూ క్లారిటీ లేకున్నా విపక్షాలు ఈ పదవిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం ఉంది.

శివసేనకు ఇవ్వాలని….

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని ఎలాగైనా తాము దక్కించుకోవాలన్న భావనతో ఉన్న బీజేపీ మిత్రపక్షాలకు గాలం వేయడం ప్రారంభించినట్లు సమాచారం. తమతో దీర్ఘకాలం స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న శివసేనకు ఈ పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన ఇప్పటికే బీజేపీకి బాగా దూరమయింది. వివిధ అంశాల్లో ప్రధానిమోడీని, బీజేపీని విభేదిస్తూ వస్తోంది. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సయితం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి వెళ్లి మరీ కలసి వచ్చారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని శివసేనకు ఇస్తే అన్ని సమస్యలూ తొలిగిపోతాయని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు.

అంగీకరిస్తుందా?

కాని ఈ ప్రతిపాదనకు శివసేన అంగీకరిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. అమిత్ షా చర్చల తర్వాత కొంత తగ్గినట్లు కన్పిస్తున్నా తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనకు శివసేన మద్దతు ప్రకటించింది. అంటే మోడీ, అమిత్ షాలపై శివసేన ఆగ్రహం ఇంకా చల్లారనట్లే. దీంతో తాజాగా బీజేపీ చేస్తున్న ఈ ప్రతిపాదనకు ఉద్ధవ్ ఠాక్రే అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి. మొత్తం మీద డిప్యూటీ ఛైర్మన్ పదవి పై మోడీ, అమిత్ షాలు ఇద్దరూ బాగానే దిగులు పెట్టుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*