మోడీ మొగ్గు చూపంది అందుకే….!

అయిదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామా, ఆమోదంపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎవరికి తోచిన కోణంలో వారు ఈ అంశంపై విశ్లేషించారు. వైఎస్ అవినాష్ రెడ్డి (కడప) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి), మిధున్ రెడ్డి (రాజంపేట) లు ప్రత్యేక హోదా కోసం తమ పదవులను త్యాగం చేశారు. బడ్జెట్ సమావేశాల అనంతరం వారు రాజీనామా చేయగా దాదాపు 50 రోజుల తర్వాత మే 29న వారితో స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడారు. వారి రాజీనామాలను ధృవీకరించుకున్న అనంతరం చివరికి జూన్ 20వ తేదీన ఆమోదించారు. దీంతో ఎట్టకేలకు ఒక అధ్యాయానికి తెరపడింది. ఒక ఘట్టానికి ముగింపు లభించింది.

త్యాగాలుగా వారు…డ్రామాలుగా వీరు….

సహజంగా వైసీపీ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను పెద్ద త్యాగంగా కీర్తించారు. రాష్ట్ర ప్రయోజనాల ముందు పదవులు పెద్ద లెక్కలోనివి కావని ప్రకటనలు గుప్పించారు. అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం భిన్నంగా స్పందించింది. రాజీనామాలు వట్టి డ్రామాలని, ఉప ఎన్నిలకు రాకుండా చిరి రోజుల్లో రాజీనామా చేశారని ఘాటు విమర్శలు విమర్శించింది. రాజీనామాలను ఆమోదింప చేసుకోవడంలో కావాలని తాత్సారం చేశారని తూర్పారపట్టింది. చివరి రోజుల్లో రాజీనామా, ఆమోదంలో జాప్యం కారణంగా ఉపఎన్నికలను తప్పించుకోవాలన్నది వైసీపీ అసలు లక్ష్యమని దాడి చేసింది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే ఉప ఎన్నికల విషయంలో చట్టం ఏమి చెబుతుందో ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరమూ ఉంది.

ఉప ఎన్నికలు ఎప్పుడంటే….

ఏ కారణం చేతనైనా చట్టసభల్లో ఖాళీలు ఏర్పడితే 1951 ప్రజాస్వామ్య ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 147, 149, 150, 151 మేరకు ఆరు నెలల్లో ఎన్నికలు జరపాలని చెబుతున్నాయి. అయితే ప్రస్తుత లోక్ సభ కాలపరిమితి ఏడాది లోపు ముగిసేలా ఉన్నా, కేంద్ర ఎన్నికల సంఘం, కే్ంద్ర ప్రభుత్వంతో కలసి ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చినా…. ఈ నిబంధనలు వర్తించవు. ఏడాదిలోపు కాలపరిమితిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. 16వ లోక్ సభ ఏర్పడిన తేదీని (అంటే మార్చి 18)ని పరిగణనలోకి తీసుకోవాలన్నది ఒక వాదన. కాదు కొత్త సభ కొలువుతీరిన తేదిని (జూన్ 4) ప్రామాణికంగా తీసుకోవాలన్నది మరో వాదన. ఏ వాదన ఎలా ఉన్నప్పటికీ తుది న్యాయం మాత్రం ఎన్నికల కమిషన్ దే. ప్రస్తుత అంచనాల ప్రకారం అయిదు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవు.

కమలం వ్యూహమేనా?

ఉఫ ఎన్నికలను తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ ఎంపీలు కావాలనే ఆలస్యంగా రాజీనామాలు చేశారని, వాటి ఆమోదంలో సైతం ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేశారన్న విమర్శలు తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వాదనలో ఒకింత వాస్తవం ఉందన్న అభిప్రాయం కలగక మానదు. కానీ లోతుగా విశ్లేషిస్తే రాజీనామాల ఆమోదానికి జాప్యంలో భారతీయ జనతా పార్టీ నాయకురాలైన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉద్దేశ్యపూర్వకంగా జాప్యంచేశారు. పార్టీ నాయకత్వం ఈ మేరకు ఆమెపై వత్తిడి తెచ్చిందన్న అభిప్రాయం కలగక మానదు. ఎందుకంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన అయిదు స్థానాల్లో రెండు చోట్ల బీజేపీ గత ఎన్నికల్లో పోటీ చేసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజంపేట, తిరుపతి స్థానాలను తెలుగుదేశంపార్టీ బీజేపీకి కేటాయించింది. రెండు చోట్లా బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. రేపు ఉప ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా రాకుంటే పార్టీ మరింత భ్రష్టుపడుతుంది. వైసీపీ కన్నా కమలం పార్టీపైనే తెలుగుదేశం ఎక్కువగా దృష్టి పెడుతుంది. ప్రత్యేక హోదా ఇవ్వన, ఏపీ పట్ల వివక్ష చూపుతున్న కమలన్నా ఓడించాలని అన్ని పార్టీలూ పిలుపునిస్తాయి. ఒక్క వైసీపీ తప్ప సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలూ టీడీపీకి మద్దతు ప్రకటిస్తాయి. లోపల ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కమలం పార్టీతో ముందుకు నడిచే సాహసం ఫ్యాన్ పార్టీ చేయనే చేయదు. ఎటు చూసి ఎటువచ్చినా అంతిమంగా ఉప ఎన్నికల వల్ల కమలం పార్టీకి కష్టాలు తప్పవు. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం తెరవెనక చక్రం తిప్పి ఎన్నికలకు అడ్డుపడిందన్న విశ్లేషణలు జోరుగా విన్పిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని గమనించలేని పార్టీలు అనవసరంగా వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే బీజేపీ వ్యూహం తెలిసినప్పటికీ తేలుకుట్టిన దొంగల్లా వైసీపీ వ్యవహరిస్తోంది. అనధికార మిత్రపక్షం కాబట్టి ఆ పాటి అవగాహన ఉండటంలో తప్పులేదు.

గత ఎన్నికల్లో ఓట్ల శాతం….

గత ఎన్నికల్లో రాజంపేట బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దగ్గుబాటి పురంద్రీశ్వరికి టీడీపీ మద్దతు ప్రకటించింది. నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మిధున్ రెడ్డిచేతిలో 1,74,762 ఓట్ల భారీ మెజారిటీతో పురంద్రీశ్వరి ఓడిపోయారు. మిధున్ రెడ్డికి6,01,751 (51.95 శాతం) ఓట్లు రాగా, పురంద్రీశ్వరికి 4,26,990 (36.86శాతం) ఓట్లు వచ్చాయి. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి వరప్రసాద్ పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరామ్ 37 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. వరప్రసాద్ కు 5,80,376 (47.84శాతం), జయరామ్ కు 5,42,951 (44.75 శాతం) ఓట్లు వచ్చాయి. వైసీపీ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయి. ఒక్క కడపలోనే ఆ పార్టీ ఐదు లక్షలకు పైగా మెజారిటీ లభించింది. ఒంగోలులో పదిహేను వేలు, నెల్లూరులో 54 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచింది. అప్పటి సానుకూల పరిస్థితుల్లోనే ఓ మోస్తరు మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు ఉప ఎన్నికలకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానం దానికి లేకపోలేదు. అందువల్లే ఉప ఎన్నికలకు పెద్దగా పట్టుబట్ట లేదు. ‘‘రోగి పాలు కోరుకున్నాడు…వైద్యుడు మందుగా పాలే తాగమన్నాడు’’ అన్న పాత సామెత గుర్తకు రాక మానదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*