మోడీ ఒక అడుగు వెనక్కేశారు…!

ఆ పదవి ఇప్పట్లో భర్తీ చేయరు. తగిన బలం లేకపోవడం…విపక్షాలు ఐక్యం కావడం…మిత్రపక్షాలు సహకరించకపోవడంతో ముఖ్యమైన పదవిని ప్రధాని నరేంద్ర మోదీ పెండింగ్ లో పెట్టాలని నిర్ణయించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎన్నిక ఈ వర్షాకాల సమావేశంలో జరగాల్సి ఉంది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడారు. అయితే బీజేపీ అధిష్టానం ఈ ఎన్నికను కొద్దిరోజులు పెండింగ్ లో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతుంది. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో బీజేపీ ఈ ఎన్నికపై వెనక్కు తగ్గినట్లు కన్పిస్తోంది.

బలం లేకనే……

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న పీజే కురియన్ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సి ఉంది. రాజ్యసభ ఛైర్మన్ ను వదిలేస్తే మొత్తం 244 మందికి ఓటు హక్కు ఉంటుంది. 123 మంది మద్దతు లభిస్తే డిప్యూటీ ఛైర్మన్ పదవి దక్కుతుంది. కానీ బీజేపీకి ప్రస్తుతం ఆ బలం లేదు. కొన్ని పక్షాలను సంప్రదించినా ఫలితం కానరావడం లేదు. శివసేన, అకాళీదళ్ అభ్యర్థులను ఈ పదవికి పోటీలో నిలపాలని భావించినప్పటికీ వారికి మిగిలిన పక్షాలు సహకరిస్తాయన్న నమ్మకం లేదు. అందుకే కొద్దిరోజులు వెయిట్ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

అందరూ దూరమయి….

బీజేపీకి ప్రస్తుతం శివసేన దూరమయినట్లే కన్పిస్తోంది. తమ అభ్యర్థిని పోటీకి దింపితే తప్ప శివసేన మద్దతిచ్చే ప్రసక్తిలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆంద్రప్రదేశ్ కు చెందిన మరో పార్టీ అయిన వైసీపీ కూడా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో బీజేపీకి గాని, అది బలపర్చే అభ్యర్థికి గాని మద్దతివ్వబోమని స్పష్టంగా చెప్పింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయని కారణంగా తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వైసీపీ బీజేపీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.

సరైన సమయం కాదని…..

దీంతో బలం లేని సమయంలో గోదాలోకి దిగడం మంచిది కాదని భావించిన బీజేపీ కొద్దిరోజులు ఈ ఎన్నికను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మామూలుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ పదవి ఎన్నికను వాయిదా వేసిన సందర్భాలున్నాయని చెబుతున్నారు. బలం సమకూరిందని నమ్మకం కుదిరాకే ఎన్నిక నిర్వహించే యోచనలో బీజేపీ ఉంది. మోదీ వెనక్కు తగ్గింది బలంలేకనేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*