మళ్లీ మోదీ ప్రధాని కాకతప్పదా?

అదే జరిగితే భారతీయ జనతా పార్టీ కలలు నెరవేరినట్లే. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గద్దెనెక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విపక్షాల ఐక్యత లేదు. కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు ఏ పార్టీకూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో కూటమి ఏర్పాటుకు గండి పడింది. సార్వత్రిక ఎన్నికల సమయానికి అంతా సర్దుకుంటుందని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కన్పించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఐదు రాష్ట్రాల్లో……

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో అన్ని పార్టీలూ కలసి వెళతాయని తొలుత భావించారు. పొత్తుల కోసం చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ముందుగానే కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చి వెళ్లిపోయారు. ఛత్తీస్ ఘడ్ లో అజిత్ జోగి పార్టీతో బరిలోకి దిగుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నారు. తెలంగాణలో మాత్రమే మహాకూటమి ఏర్పాటవుతుంది.

ఎస్పీకూడా హ్యాండిచ్చి……

ఇక పెద్దగా బలంలేకపోయినా సమాజ్ వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ తో జతకట్టేందుకు ఇష్టపడటం లేదు. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తోచర్చలు విసుగుపుట్టిస్తున్నాయని, ఎటూ తేల్చకుండా ఉన్నందున తాము కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చారు. ఇక సీపీఎం కూడా ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో జతకట్టబోమని స్పష్టం చేసింది. ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో మూడో కూటమికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పడుతుండటంతో హస్తం పార్టీలో కలవరం ప్రారంభమయింది.

మమతపైనే ఆశలు……

కాని ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరిణామాలు వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడటం ఖచ్చితమని భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎస్సీ, బీఎస్పీ కాంగ్రెస్ పార్టీతో కలవకపోతే ఆ పార్టీకి కొంత ఇబ్బందులు తప్పవు. పరోక్షంగా భారతీయ జనతా పార్టీ లాభపడటం ఖాయం. మూడో ప్రత్యామ్నాయానికి ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం, లోక్ దళ్, ఆర్ఎల్డీ, వంటి పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే కాంగ్రెస్ లో చిరు ఆశ ఒకటుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీలు తమ వైపు చూస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే వచ్చే జనవరిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసే విపక్షాల ర్యాలీ కూడా కూటమి ఏర్పాటుకు పునాదులు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఏర్పాటు ఫెయిలయితే మరోసారి మోదీ ప్రధాని కావడం గ్యారంటీ అన్నది విశ్లేషకుల అంచనా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*