మోడీకి మరో మిత్రుడు….?

మోడీకి మరో మిత్రుడు దూరమవుతున్నారా? సంకేతాలు అలాగే కన్పిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా మిత్రులు దూరమవుతుండటంతో కమలం పార్టీ కలవర పడుతోంది. మిగిలిన మిత్రులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే శివసేన, జేడీయూ, అకాలీదళ్ వంటి పార్టీలను సముదాయించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అయితే శివసేన ససేమిరా అంటుంది. జేడీయూ కూడా కాలు దువ్వుతున్నట్లే కన్పిస్తోంది. కష్టాల్లో ఉన్న కమలం పార్టీకి ఈ రెండు పార్టీలూ షరతులు విధిస్తుండటం గమనార్హం. ఇక్కడ శివసేన అసెంబ్లీ స్థానాలను వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా కోరుతుంది. లోక్ సభ ఎన్నికల్లో మద్దతివ్వాలంటే తమకు అత్యధిక స్థానాలివ్వాలంటూ మెలిక పెడుతోంది.

మోడీకి షాకిచ్చేలా….

ఇక తాజాగా బీహార్ లోని మరో మిత్రపక్షమైన జనతాదళ్ యు కూడా మోడీకి షాకిచ్చేటట్లే కన్పిస్తోంది. భారతీయ జనతా పార్టీకి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీహార్లో తక్కువ స్థానాలను కేటాయించాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో జేడీయూ అభ్యర్థులే పోటీ చేస్తారని ఆయన అంతర్గత సమావేశంలో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, భారతీయజనతా పార్టీపై అసంతృప్తిగా ఉన్న నితీష్ కుమార్ ఎలాగోలా కూటమి నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్లే కన్పిస్తోంది. అందుకోసమే ఆయన ఇటీవల నోట్ల రద్దు పై చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇబ్బంది పెట్టాయి.

ఎలాగైనా బయటపడాలని…..

బీజేపీని ఇరుకునపెట్టాలని భావిస్తున్న నితీష్ తాజాగా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తెరమీదకు తెచ్చారు. బీహార్ అన్నింటికంటే వెనుకబడిన రాష్ట్రమని ప్రత్యేక హోదా తోనే బీహార్ అభివృద్ధి సాధ్యమవుతుందని నితీష్ ప్రతి సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. బీహార్ లో మద్యనిషేధం పెట్టిన తర్వాత మహిళలు నితీష్ సర్కార్ పై సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లో క్రైం రేటు కూడా గణనీయంగా తగ్గినట్లు పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరిస్తున్నారు. నితీష్ సర్కార్ కు కొంత సానుకూలతలు ఏర్పడుతుండటంతో మోడీపై వ్యతిరేకత తనపై ప్రభావం పడకూడదని, అందుకే వీలయినంత త్వరగా బయటకు వచ్చేయాలని నితీష్ భావిస్తున్నట్లు జేడీయూ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

సీట్ల కేటాయింపును…..

అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో జేడీయూకు ఎక్కువ పార్లమెంటు స్థానాలివ్వాలని పట్టుబట్టే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం 40 లోక్ సభ స్థానాలున్న బీహార్ లో ఈసారి దాదాపు 25 సీట్ల వరకూ పోటీ చేయాలని నితీష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే 2015 అసెంబ్లీ ఎన్నికల ప్రాతిపదికన సీట్లు కేటాయింపులు జరపాలంటూ నితీష్ మెలిక పెట్టారు. ఇందుకు బీజేపీ ఎటూ ససేమిరా అంటుందని నితీష్ కు తెలుసు. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలలోనూ జేడీయూ పోటీ చేస్తుందన్న ప్రకటన కూడా అందుకేనంటున్నారు. అప్పుడే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అవసరమైతే లోక్ సభతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు వెళ్లాలన్నది నితీష్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తం మీద నితీష్ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లేది….వాస్తవం. కాని సమయం మాత్రం చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*