మోడీకి దెబ్బ మీద దెబ్బేనా…?

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎలాగోలా నెట్టుకొచ్చేస్తూ మ్యాజిక్ ఫిగ‌ర్ రాక‌పోయినా మిత్ర ప‌క్షాల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న క‌మ‌ల‌నాథుల‌కు.. ఆయా రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దేశ‌వ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తున్నా.. వివిధ రాష్ట్రాల్లో ఇత‌ర పార్టీల సాయంతో అధికార పీఠం ద‌క్కించుకుంటోంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నో హామీలు, ఆశ‌లు క‌ల్పించినా అవేమీ అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌ధాని మోడీపై వ్య‌తిరేక‌త ఉవ్వెత్తున ఎగ‌సింది. గుజ‌రాత్ ఎన్నిల త‌ర్వాత ఇది మరింత ఎక్కువైంది.

ఉప ఎన్నికల్లో మాత్రం…..

ఇదెలా ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల త‌ర్వాత ఎంపీలుగా ఉన్న వ్య‌క్తుల‌ను సీఎం పీఠంపై కూర్చోపెడుతున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోనూ ఇదే ప‌రిస్థితి ఎదుర‌వ‌బోతోందా అనే ప్ర‌శ్నమొద‌లైంది. గుజ‌రాత్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించింది. గుజ‌రాత్‌లో గెలిచేందుకు ఆప‌సోపాలు ప‌డింది. చివ‌ర‌కు చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా.. గెలిపొందింది. సొంత రాష్ట్రంలో గెలిచేందుకు ప్ర‌ధాని మోడీ.. చేసిన ప్ర‌చారం ఆయన స్థాయిని మ‌రింత దిగ‌జార్చింది.

ఉత్తరప్రదేశ్ లోనూ…..

త‌న‌ను ఓడించేందుకు పాకిస్థాన్ నుంచి సుపారీ కాంగ్రెస్‌ తీసుకుంద‌ని, అట్ట‌డుగు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినంటూ తన స్థాయి మ‌రిచి సెంటిమెంట్ ఒలికించారు. అంత‌కు ముందు జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా ప్రచారం చేశారు. అయితే ఈ రెండు చోట్ల కాషాయ జెండా రెప‌రెప‌లాడినా.. అంత‌కు మించిన స్థాయిలో వ్య‌తిరేక‌త కూడా బ‌య‌ట‌ప‌డింది. యూపీలో గోర‌ఖ్‌పూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆదిత్యానాథ్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. త‌ర్వాత అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోయింది. డిప్యూటీ సీఎంగా ఉన్న‌ కేశవ్ ప్ర‌సాద్ మౌర్య ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పుల్పూర్ లోనూ ఇదే ఫ‌లితం వచ్చింది. ఇక్క‌డ ఘోర ఓట‌మితో ప‌రువు పోగొట్టుకున్నా బీజేపీ పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు.

ఎంపీలుగా రాజీనామా చేసి…..

ఉత్త‌ర‌ప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ స్థానాల‌ను బీఎస్పీ-ఎస్పీ నేతృత్వంలోని కూట‌మి సొంతం చేసుకుంది. ఇది మోడీకి పెద్ద దెబ్బ‌గా మిగిలిపోయింది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోనూ ఇదే త‌ర‌హా ఫ‌లితం వ‌స్తుందేమోన‌నే ఆందోళ‌న బీజేపీ నేత‌ల్లో మొద‌లైంది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన య‌డ్యూరప్ప‌, బీజేపీ ఎమ్మెల్యే శ్రీ‌రాములు.. త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. ఇప్పటివరకూ శ్రీరాములు బళ్లారి, యడ్యూరప్ప షిమోగా ఎంపీలుగా కొనసాగారు. కర్ణాటక ఎన్నికల్లో షికారిపుర నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప, మొళకాల్మూరు నియోజకవర్గం నుంచి శ్రీరాములు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాల‌ను లోక్‌స‌భ స్పీక‌ర్ ఆమోదించారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రాబోతున్నాయి.

ఈ ఎన్నికలు పరీక్షే……

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో బీజేపీకి స్ప‌ష్ట‌మైన ఆధిక్యం రాలేదు. అంతేగాక కేవ‌లం 36.2 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. కాంగ్రెస్‌కు బీజేపీ కంటే ఎక్కువుగా 38 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీకి ఈ ఎన్నిక‌లు క‌ఠిన ప‌రీక్ష‌గా నిల‌వ‌బోతున్నాయి.ఇప్ప‌టికే కాంగ్రెస్‌-జేడీఎస్‌కు ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు యూపీ త‌ర‌హాలోనే క‌ర్ణాట‌క‌లో జేడీఎస్, కాంగ్రెస్ క‌లిస్తే ఈ రెండు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌ష్ట‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఏర్పాటుచేసేందుకు ఈ కూట‌మి సిద్ధంగా ఉంది. బీజేపీపై వ్య‌తిరేక‌త ఉంద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలిసిన త‌రుణంలో.. క‌న్న‌డ నాట ఈ రెండు ఎంపీ స్థానాల్లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌రోసారి తీవ్రంగా శ్ర‌మించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈ నెల 25న యూపీలోని కైరైనా లోక్‌స‌భ సీటుకు కూడా ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ ఇప్ప‌టికే ఎస్సీ + బీఎస్పీ క‌లిసి ఆర్ఎల్డీకి స‌పోర్ట్ చేస్తుండ‌డంతో అక్క‌డ కూడా గెలిచేందుకు బీజేపీ చెమ‌టోడుస్తోంది. ఏదేమైనా ఈ ఫ‌లితాలు దేశ‌వ్యాప్తంగా బీజేపీ వ్య‌తిరేక శ‌క్తులు ఒకే తాటిమీద‌కు వ‌స్తే మోడీని ఓడించ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*