మోడీతో అమితుమీకి రెడీ

చాలా రోజుల తర్వాత మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీన జరిగే ఈ బేటీకి చంద్రబాబు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, విభజన హామీల అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రస్తావించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

విడిపోయాక తొలిసారి……

దాదాపు రెండు నెలల నుంచి ప్రధాని మోడీ పైనా, కేంద్ర ప్రభుత్వంపైనా చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిని తూర్పారపడుతూ చంద్రబాబు వివిధ జిల్లాల్లో దీక్షలు నిర్వహిస్తున్నారు. మోడీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఈ సమావేశంలో ఎలా గళమెత్తుతారన్నది ఆసక్తిగా మారింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ సమావేశంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రులు గళమెత్తే……

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, 1971 జనాభా లెక్కల ప్రకారమే నిధుల పంపిణీ జరగాలని ఎక్కువ రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇటీవల రెండు సార్లు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 16వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ సర్కార్ ను నిలదీసే అవకాశముందంటున్నారు. అయితే అదే రోజు రంజాన్ కావడంతో సమావేశం వాయిదా పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. మొత్తం మీద చాలా రోజుల తర్వాత మోడీ, చంద్రబాబు ఒకే సమావేశంలో కలవడం ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*