‘‘ఫిక్స్’’ అయిపోయారుగా…?

narendra-modi-indian-national-congress

దేశవ్యాప్తంగా నలభై మూడు రోజుల పాటు జరిగన ఎన్నికల ఫలితాలు మరికొద్దిసేపట్లో ముంగిటకు రానున్నాయి. మోదీకి మరోసారి అవకాశమిస్తారా? యువనేత రాహుల్ కు ప్రధాని పీఠం దక్కుతుందా? అన్నదే చర్చనీయాంశమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ దాదాపు భారతీయ జనతా పార్టీవైపే మొగ్గు చూపాయి. అయితే దీనిపై ఎలాంటి విశ్వసనీయత లేదంటోంది హస్తం పార్టీ. ఖచ్చితంగా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతోంది. మరోవైపు కమలదళం రెండోసారి వరసగా అధికార పీఠాన్ని ఎక్కడం ఖాయమని ధీమాగా ఉంది.

మోదీ ప్రభంజనం….

మోదీ గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనం వీచినా..ఈ ఎన్నికల్లో ఆ గాలి కనపడలేదన్నది వాస్తవం. ముఖ్యంగా అనేక హిందీ బెల్ట్ లో ఉన్న రాష్ట్రాల్లో మోదీకి ఎదురుగాలి వీచిందన్న సంకేతాలు గతఏడాది నుంచే ఉన్నాయి. ప్రధానంగా జీఎస్టీ, నోట్లరద్దు కారణంగా మోదీ పై వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నా… మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు మోదీ వైపే మొగ్గుచూపారని, జాతీయ వాదం బలంగా పనిచేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీ నాయకత్వానికి సరిపోయే నేత వైరిపక్షంలో లేకపోవడమే ప్లస్ అయిందని కమలదళం భావిస్తోంది.

కొన్ని రాష్ట్రాల్లో వీకయినా….

ఈసారి రాజస్థాన్,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ చేస్తామని కమలనాధులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పటికీ వందరోజుల్లోనే వారి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కన్పించిందంటున్నారు.ఉత్తరప్రదేశ్ లో గతం కంటే సీట్లు తగ్గుతాయని బీజేపీ నేతలేచెబుతున్నారు. అయితే ఆ నష్టాన్ని తాము పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పూడ్చుకుంటామన్న ధీమాతో కమలదళం ఉంది. కర్ణాటకలో సయితం సీట్లు పెరుగుతాయన్న విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎలా లెక్కలు వేసుకున్నా విజయం తమదేనని కమలనాధులు ఫిక్స్ అయిపోయారు.

ప్రభుత్వ వ్యతిరేకతే….

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే మిత్రపక్షాలతో కలసి ఖచ్చితంగా సర్కార్ ను ఏర్పాటు చేస్తామన్న ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ పట్ల సానుకూల అంశాలే తమను అందలం ఎక్కిస్తాయన్న నమ్మకంతో హస్తం పార్టీ ఉంది. దాదాపు 21 పార్టీలు తమకు మద్దతిస్తుండటమే కాకుండా, మోదీని ప్రధాని కాకుండా నిలువరించడమే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా తమకే ఉంటుందని భావిస్తున్నారు. తాము ప్రకటించిన న్యాయ్ పథకం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద రెండు పార్టీలూ తమదే అధికారమన్న నమ్మకంతో ఉన్నాయి.మరికొద్దిసేపట్లో ఎర్రకోటపై జెండా ఎగురవేసేదెవరో? తేలనుంది.

Ravi Batchali
About Ravi Batchali 18771 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*