మోడీ ట్రాక్‌లో కేసీఆర్‌…..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక రాజ‌కీయ కార‌ణాలు ప్రత్యర్థుల‌ను కూడా ఊహించ‌లేరు. ప్రస్తుతం ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యంలోనూ ఆయ‌న స్పష్టమైన స్ట్రాట‌జీతో ముందుకు వెళుతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఏపీ సీఎం చంద్రబాబు వెన‌క‌డుగు వేస్తుంటే..కేసీఆర్ మాత్రం సై అంటున్నారు. రాజ‌కీయ వ్యూహాల్లో త‌న‌ను మించిన వాడు లేడ‌ని నిరూపించేందుకు ఆయ‌న సిద్ధమ‌వుతున్నారు. ముందుస్తు ఎన్నిక‌ల‌పై అనేక కోణాల్లో ఆలోచించి చివ‌ర‌కు ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. ఒక‌ప‌క్క ప్రధాని మోడీపై క‌త్తులు దూస్తూనే.. మ‌రోప‌క్క ఆయ‌న ఆలోచ‌న‌ల‌ను కూడా ఆచ‌ర‌ణ‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

టార్గెట్ ఒక్కటేనా?

ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యంలో మోడీ, కేసీఆర్ టార్గెట్ ఒక్కటే అని తేలిపోయింది. అటు తెలంగాణ‌లో కేసీఆర్‌, ఇటు దేశంలో మోడీ.. కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ ముంద‌స్తుకు రెడీ అవుతున్నారు. రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య జ‌రిగే కొన్ని విష‌యాలు అత్యంత ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఒక్కోసారి క‌త్తులు దూసుకునే నేత‌లు కూడా ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు. వీరి మ‌ధ్య వైరం ఉన్నా.. టార్గెట్ మాత్రం ఒక్కటే! ప్రస్తుతం మోడీ-కేసీఆర్ మ‌ధ్య ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లే జ‌రుగుతున్నాయి. మోడీకి వ్యతిరేకంగా థ‌ర్డ్ ఫ్రంట్ అంటూ మోడీ వ్యతిరేక కూట‌మిని సిద్ధం చేస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు మోడీ ట్రాక్‌లోనే వెళుతున్నార‌నే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. మోడీ ముందు నుంచి జ‌మిలీ ఎన్నిక‌ల వైపే ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే బాట‌లో వెళుతున్నారు.

ఏడాది ముందుగానే…..

లోక్ సభకు అసలు ముందస్తు ఎన్నికలు ఉంటాయా? ఉంటే ఎన్ని రాష్ట్రాలకు వాటితో పాటు ఎన్నికలు వస్తాయి?. ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలకు తెలంగాణ సర్కారు సిద్ధమైపోతోంది. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వచ్చినా ఓకే లేదంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ దిశగానే ఆయన వేగంగా కదుపుతున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, కేసీఆర్ మధ్య ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అసెంబ్లీని రద్దు చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఎన్నికలకు పోవాలంటే ఓ రకంగా కేంద్ర సహకారం కూడా అవసరం. ఈ అంశాలపై ఇద్దరూ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

సిద్ధం కాకముందే…..

డిసెంబర్ లేదా జనవరిలోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందనే సమాచారం కీలక మంత్రులకు కూడా చేరింది. ముఖ్యంగా కెసీఆర్ ముందస్తు ఎన్నికల వైపు మొగ్గుచూపటానికి పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్ కు రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్. ఇంకా పూర్తిస్థాయిలో ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధం కాలేదు. దీనికి తోడు నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కూడా అదే స్ధాయిలో ఉన్నాయి. కాంగ్రెస్ లో కీలకమైన పదవుల పంపకం పూర్తి అయి..విభేదాలు భ‌గ్గుమంటే త‌మ‌కు లాభం ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

బ్రేక్ వేయాలనే…..

అందుకే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సిద్ధం కాకముందే తాను అంతా రంగం సిద్ధం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చేలా ప్లాన్స్ వేసుకుంటు న్నారు కేసీఆర్‌. ఇక మోడీ టార్గెట్ కూడా కాంగ్రెసే! మోడీ వ్య‌తిరేక కూట‌మి దిశ‌గా ఇప్పుడిప్పుడే అడుగులు ప‌డుతున్న నేప‌థ్యంలో ఆదిలోనే వీటికి బ్రేక్ వేయాల‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. మ‌రోప‌క్క త‌నపై వ్య‌తిరేక‌త పెరుగుతూ ఉండ‌టం కూడా వీటివైపు మొగ్గుచూపేలా చేస్తోంది. మ‌రి ఈ నేత‌ల ముందస్తు ప్లాన్స్ ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*