అబ్బో ..హత్యా రాజకీయాలు…!

ప్రధానిపై హత్యాయత్నానికి కుట్ర. పెద్ద వార్తే. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కే సంచలనం. అంతకుమించి జాతి మొత్తం ఆందోళన చెందాల్సిన అంశం. నిఘా, నేరపరిశోధక, దర్యాప్తు సంస్థలు అట్టుడికిపోవాల్సిన ఐటెం. కానీ మనదేశం సంగతే వేరు. రాజకీయం అలుముకుంది. రగడ మొదలైంది. సీరియస్ నెస్ తగ్గిపోయింది. చీప్ పాలిటిక్స్ చుట్టూ పక్కా డ్రామా సాగుతోంది. హత్యాయత్నం బోగస్. ప్రధాని ఇమేజ్ బిల్డప్ చేసే ఎత్తుగడ అంటున్నాయి విపక్షాలు. మోడీ వంటి దుర్నిరీక్ష్య నాయకుడిని తప్పించకపోతే అస్తిత్వమే ఉండదని మావోలే కుట్ర పన్నారంటోంది కేంద్రం. దానికి వత్తాసు ఇస్తోంది బీజేపీ. ఏతావాతా తేలుతున్నదేమిటంటే ఇంతటి చవకబారు రాజకీయాలు మరే దేశంలోనూ ఉండకపోవచ్చు. లోతుల్లోకి వెళ్లి నిజానిజాలను నిర్దరించే బదులు పొగతో చలికాచుకోవాలన్న ఎత్తుగడలే ఎక్కువైపోయాయి.

ప్రత్యేక సంస్థలు పడకేశాయా?

దేశంలో అత్యంత భద్రతావలయంలో ఉండే వ్యక్తి ప్రధాని. ఇంటిలిజెన్స్ బ్యూరో, రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్, ఎన్ఐఏ వంటి కేంద్ర ఇంటిలిజెన్సు సంస్థలన్నీ ఆయనకు సంబంధించిన కీలకమైన రక్షణ కు సంబంధించి నిరంతరం సమాచారం సేకరిస్తూ ఉంటాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రధాని భద్రత వ్యవహారాలపై ఎటువంటి అనుమానాలు తలెత్తినా కూపీ లాగుతాయి. లోతైన దర్యాప్తునకు దిగుతాయి. చాలావరకూ స్థానిక పోలీసులకు సమాచారం సైతం ఇవ్వకుండా నేరుగా రంగంలోకి దిగుతుంటాయి. ఒకవేళ స్థానిక పోలీసుల సహకారం తప్పనిసరి అయినప్పటికీ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. విషయాన్ని గోప్యంగా ఉంచి సబ్జెక్టును మార్చి సమాచారం సేకరిస్తారు. ప్రధాని భద్రతను పకడ్బందీగా పర్యవేక్షించడమే కాదు, ఆయనకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాలను సైతం బయటికి రానీయరు. ఇటువంటి ప్రయత్నాలు జరిగే సందర్భాల్లో సూత్రధారులు తప్పించుకోకుండా క్లూ లను కాపాడుకుంటారు. లోతుల్లోకి వెళ్లి మూలాలను పట్టుకుంటారు. ఫీల్డు లెవెల్ లో ద్రోహుల తరఫున పనిచేస్తున్నవారి వివరాలు బయటపెడితే కుట్రమూలాలు వెలికి తీయలేరు. తాత్కాలికంగా నిరోధించినా మూలంలో ఉన్న వ్యక్తులు మరోసారి కుట్రకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. దీనిని వేళ్లతో సహా పెకలించాలంటే కలుగులో ఉన్న కుట్ర సూత్రధారులను పట్టుకోవాల్సిందే. క్లూ అందిన వెంటనే ప్రచారానికి పాల్పడరు. ప్రధాని పై హత్యాయత్నం కుట్ర కోణంలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రధాన లోపం అదే. ప్రశ్నలు రేకెత్తిస్తున్న అంశమూ అదే.

పక్కదారి ఎత్తుగడలా..?..

బీమా కోరేగావ్ లో దళితుల ఆత్మగౌరవం పేరిట ఏటా జనవరిలో సంస్మరణ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో అగ్రవర్ణ పేష్వాలకు వ్యతిరేకంగా పోరాడిన మెహర్ల స్మారకార్థం అంబేద్కర్ ప్రారంభించిన ఆనవాయితీ ఇది. ఈ ఏడాది పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. హింస ప్రజ్వరిల్లింది. దాంతో అక్కడికి చేరినవారిపైకేసుల తంతు నడుస్తోంది. కేసులను ఎదుర్కొంటున్నవారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దళితవర్గాలకు చెందినవారు కావడంతో దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో స్థానిక బీజేపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అరెస్టు చేసిన వ్యక్తుల్లో కొందరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారేమోననే అనుమానాలను ప్రజాసంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. తాము అరెస్టు చేసిన వ్యక్తులు సంఘవిద్రోహులన్న ముద్ర వేయాలన్న ఎత్తుగడ అనే భావన ఉంది. ప్రధానిపైనే హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ పోలీసులు సులభంగా తమ అత్యాచారాలను కప్పిపుచ్చుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నారనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రధానిపై కుట్ర లేఖ బయటికి రాగానే పోలీసులు కేంద్ర నిఘా సంస్థలకు ఈ వివరాలు అందించి గోప్యంగా దర్యాప్తు జరిగేలా సహకరించాలి. తామే బయటపెట్టేయడంతో రాజకీయ టర్న్ తీసుకుంది. అల్లరిచిల్లరి వ్యవహారంగా మారిపోయింది. పోలీసు దమనకాండనుంచి ప్రజలను తప్పుదారి పట్టించే వ్యూహంగా మావోయిస్టు సానుభూతిపరులు పేర్కొనేందుకు ఆస్కారం ఏర్పడింది.

ఫక్తు పాలిటిక్స్..

కుట్ర జరిగిందో లేదో తెలియదు. దాని వెనక పూర్వాపరాలు పట్టవు. అయినప్పటికీ పడిపోతున్న ఇమేజ్ ను పున:ప్రతిష్టించుకునేందుకు నరేంద్రమోడీనే ఈ వ్యూహాన్ని రచించారని ప్రచారం మొదలు పెట్టాయి ప్రతిపక్షాలు. నిజానికి ప్రధాని స్థాయిలో ఇలాంటి వ్యూహరచన నమ్మశక్యంకాని అతిశయోక్తి. పైపెచ్చు ఒకవేళ సాధికారికంగా ఒక కల్పనను సృష్టించాలనుకుంటే అందుకు తగిన సాధనసంపత్తి ఉన్న సంస్థల ద్వారా ప్రచారంలోకి తెస్తారు. రా, కేంద్ర నిఘా విభాగాలు ఇటువంటి అంశాలను లోతుగా తరచి చూస్తాయి. వాటి ద్వారానే విషయాన్ని పబ్లిక్ లోకి తెస్తే మరింత సాధికారత వస్తుంది. లోకల్ పోలీసుల ద్వారా ప్రచారం చేయించుకోవాల్సిన అగత్యం ఉండదు. నిజానికి ప్రధానిపై కుట్రకు ఎప్పుడూ ఆస్కారం ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లోని సంఘవిద్రోహ శక్తులు అలజడి సృష్టించాలంటే వీవీఐపీలపై ఎప్పుడూ దృష్టి పెట్టి ఉంటాయి. అంతకుపదిరెట్లు అప్రమత్తతతో నిఘాసంస్థలు కాపు కాచి ఉంటాయి. ఇది సహజమైన పరిణామం. ప్రధానిని కాచుకోవడమే భద్రతా సంస్థల బాధ్యత. దీనిని రాజకీయ కోణంలో చూడటం ప్రతిపక్షాలను పలచన చేస్తుంది. బీజేపీకి కూడా దీనివల్ల కలిసొచ్చేదేమీ ఉండదు. దేశ ప్రధానిపైనే కుట్ర వ్యూహాలు అమలవుతున్నాయంటే అంతర్గత భద్రత పై సందేహాలు తలెత్తుతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*