మోడీ వ్యూహానికి బాబు సూపర్ ప్లాన్…!

కేంద్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్నతెలుగుదేశం పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకుంటోంది. భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళ్లాలని సైకిల్ పార్టీ భావిస్తోంది. హస్తినలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాలను కూడా తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం చంద్రబాబు పార్లమెంటు సభ్యులను హస్తినలోనే పోరాటానికి సిద్ధం చేస్తున్నారు. హస్తిన వేదికగా పోరాడితేనే జాతీయ స్థాయిలో ప్రచారం దక్కుతుందన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఒక్కొక్క వ్యూహాన్ని చంద్రబాబు అమలుపర్చాలని నిర్ణయించుకున్నారు.

మోడీని టార్గెట్ చేస్తేనే…..

నాలుగేళ్లు మిత్రపక్షంగా ఉన్న బీజేపీని కాదనుకుని తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకన్నా పార్టీ ప్రయోజనాలను ఆశించే చంద్రబాబు తెలివిగా ముందుగానే బీజేపీ బంధం నుంచి బయటపడ్డారు. మోడీపై పెరుగుతున్న వ్యతిరేకతను పసిగట్టడమే కాకుండా, ఏపీలో బీజేపీపై ఉన్న సెగ తనకు తగలకుండా ఉండేందుకు జాగ్రత్తగా వ్యవహరించి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చినప్పటి నుంచి మోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు చంద్రబాబు అండ్ టీం.

హామీలు అమలు చేయాలని…..

అయితే బీజేపీ ఏపీపై కొత్త వ్యూహాన్ని రచించబోతోంది. ఏపీకి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఏపీకి ఇచ్చిన విభజన హామీల్లో 80 శాతం పూర్తి చేశామని, మిగిలిన హామీలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతోంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత స్వయంగా మోడీని కలిసి 12 ప్రధాన అంశాలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఇందుకు మోడీ సానుకూలంగా స్పందించారు. దీంతో ప్రధానమైన కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న వార్తలు వస్తున్నాయి.

జీవో రాకముందే ఆందోళనలు…..

ఈ నేపథ్యంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అలాగే విశాఖ రైల్వే జోన్ కోసం ఇప్పటికే అక్కడి నేతలు దీక్షలు ప్రారంభించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రకటించక ముందే ఆందోళనకు దిగి, ఒకవేళ వాటిని ప్రకటిస్తే తమవల్లనే సాధ్యమయిందని చెప్పుకునేందుకు వీలుగా చంద్రబాబు పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ కన్నా తొలుత కడప స్టీల్ ఫ్యాక్టరీ ముందు ప్రకటిస్తారని తెలియడంతో తెలుగుదేశం నేతలు దీక్షకు దిగాలని నిర్ణయించారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చంద్రబాబు వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 15695 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*