ఎంపిలను బెదిరించారా …?

పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక హోదా పోరాట సమయంలో ఎంపిలను బిజెపి సర్కార్ బెదిరించిందా..? అవుననే రీతిలో మహానాడులో నేతల నడుమ చర్చ నడిచింది. ఎంపీల ఆస్తులపై ఇన్ కం టాక్స్, ఈడీ దాడులు సిబిఐ కేసులు పెడతామని బెదిరింపులకు మోడీ టీం దిగిందన్న సమాచారంతో టిడిపి శిబిరంలో ఆందోళన రేపింది. అయితే ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని అధినేత చంద్రబాబు వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. బిజెపికి వ్యతిరేకంగా పార్లమెంట్లో గళం విప్పితే తోలు తీస్తామనే రీతిలో బెదిరింపులకు పాల్పడిన తీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కేంద్రానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు టిడిపికి అండగా నిలవాలని కోరాలని బాబు దిశా నిర్దేశం చేశారు అని తమ్ముళ్ళు చెబుతున్నారు.

అంతా వ్యాపారులు కావడం వల్లేనా….?

రాజకీయమే పెద్ద వ్యాపారంగా ప్రస్తుతం మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎంపీలు ఎమ్యెల్యేలు అయ్యేవారు అంతా బడాబాబులు వుంటున్నారు. తాము చేసే అన్ని వ్యాపారాలకన్నా రాజకీయమే లాభాల పంట పండిస్తుందనే అంశాన్ని అంతా గమనించారు. దాంతో కోట్లు ఖర్చు చేసి టికెట్ పొందడం మరికొన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలవడం ఆ తరువాత ఐదేళ్ళలో అంతకు పదిరెట్లు సంపాదించడం నేటి రాజకీయాల్లో అన్ని పార్టీల్లో ట్రెండ్. తెలుగుదేశం పార్టీలోని ప్రస్తుత ఎంపీల్లో మెజారిటీ నేతలకు అనేక వ్యాపారాలు వున్నాయి. ఆయా వ్యాపారాల్లో లొసుగులన్నీ ఇప్పటికే కేంద్రం ఫైల్ సిద్ధం చేసేసింది. ఈ ఫైల్స్ పై వివిధరకాల దర్యాప్తులకు కేంద్రం సిద్ధమౌతోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తరువాత బిజెపి టిడిపి నేతలను ఒక్కొక్కరిని టార్గెట్ చేసి జనంలో వారి నిజాయితీని కడిగేయాలి అనే వ్యూహాన్ని అమలు చేయాలని కమలం ఆలోచన చేస్తుందన్న అనుమానం బలంగా ప్రచారం సాగుతుంది. తద్వారా టిడిపి ఆర్ధిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టేయడం ఖాయమని తెలుగుదేశం మహానాడు లో వేదిక వెనుక ఆఫ్ ది రికార్డ్ లో గుస గుస.

బాబు విరుగుడు వ్యూహం …

బిజెపి చేయబోయే దాడులను ముందుగానే ప్రజల్లో ప్రచారం చేసి ఆ పార్టీని నైతికంగా దెబ్బ తీసే వ్యూహాన్ని తెలుగుదేశం అధినేత సిద్ధం చేసేసారు. ప్రతి వేదికపై బిజెపి దాడులు చేస్తుంది చేస్తుంది కేసులు పెడుతుంది పెడుతుంది, అదిగో సిబిఐ, ఇదిగో ఈడీ అంటూ గోల చేసి ఆ విధమైన అడుగులు కమలం వేయకుండా ముందర కాళ్ళకు బంధం వేయాలన్నది టిడిపి ఆలోచన అంటున్నారు. ఇలా ప్రచారం సాగిస్తే బిజెపి ఒక వేళ కేసులు పెట్టినా తాము ముందే హెచ్చరించినట్లే జరిగిందని చెప్పుకోవొచ్చని అంటున్నారు. మహానాడు వేదికపై జరిగే తీర్మానాలు ఎలా వున్నా పార్టీ భవితకు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకోవడానికి అంతర్గత వ్యూహాలు పార్టీ మేధో వర్గం రచిస్తూ నేతలకు కౌన్సిలింగ్ మొదలు పెట్టింది. మరి ఈ వ్యూహాలు వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*