మోదీ….పల్లీలు అమ్ముకుంటే ఎలా?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ బీజేపీ భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌ను మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసే భారీ స్కాం బ‌య‌ట‌ప‌డింది. అది మ‌రెక్క‌డో కాదు.. ఆయ‌న సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్‌లో కావ‌డం గ‌మ‌నార్హం. ఏకంగా గుజ‌రాత్‌లో రూ.4వేల కోట్ల వేరుశ‌న‌గ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డింది. ఇది ఇప్పుడు క‌మ‌ల‌ద‌ళాన్ని షేక్ చేస్తోంది. బీజేపీ నేత‌లు చేసిన ఈ ప‌నికి అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రైతులకు చెందిన రూ. 4వేల కోట్ల విలువైన వేరుశనగ గింజలను అమ్ముకున్న బీజేపీ స్థానిక నేతలు, అధికారులు… వాటి స్థానంలో ఇసుక, మట్టి వేసి తగుల బెట్టేశారు.

అగ్నిప్రమాదం జరిగిందని…..

అయితే, పైకి అగ్నిప్రమాదం జరిగిందని షో చేసి.. రైతులను నిండా ముంచుదామ‌ని ప్లాన్ వేశారు. కానీ విషయం బయటపడింది. ఇప్పటి వరకూ ఈ స్కాంలో 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ అధికారులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా గుజరాత్‌ సౌరాష్ట్రలో రైతులు వేరు శనగను ఎక్కువగా పండిస్తారు. రైతుల వద్ద నుంచి ఈ పంటను నాఫెడ్ , గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేకరిస్తుంది. అక్కడే అందుబాటులో ఉన్న కొన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ గోదాముల్లో నిల్వ చేస్తుంది.

గోదాముల్లో దాచిన……

గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో బీజేపీ నేతల ప్రమేయం ఎక్కువగా క‌నిపిస్తుంది. దాంతో నాఫెడ్ అధికారులు, గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు, బీజేపీ నేతలు కలసి.. గోదాముల్లో దాచిన వేరుశ‌న‌గ‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా మిల్లర్లకు అమ్మేశారు. అయితే ఎవ‌రికీ అనుమానం రాకుండా.. వాటి స్థానంలో ఇసుక, రాళ్లు నింపి… ఆ తర్వాత గోదాముల్లో అగ్నిప్ర‌మాదాలు జ‌రిగేలా ప‌క్కా ప్లాన్ వేశారు. ఆరు నెలల్లోనే నాలుగు అగ్నిప్రమాదాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌మాదాల్లో నాలుగు గోదామ‌ల్లోని సరుకంతా తగలబడిపోయినట్లు అధికారులు హ‌యిగా రాసుకున్నారు.

పదే పదే జరుగడంతో…..

అయితే, ప‌దేప‌దే అగ్నిప్రమాదాలు జ‌ర‌గ‌డంతో అనుమానం రావ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చివ‌ర‌కు రూ. 4వేల కోట్ల విలువైన వేరుశనగనకు అధికారులతో కలిసి బీజేపీ నేతలు అమ్ముకున్నట్లు తేలింది. ఇప్పటి వ‌ర‌కు అరెస్టు అయిన 27మందిలో ఎక్కువ‌గా బీజేపీ నేత‌లే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఈ స్కాం క‌మ‌ల‌ద‌ళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీకి ఏదేదో చేసేశామ‌ని… ఇక్క‌డ అన్ని పార్టీలు అవినీతిలోనే మునిగి తేలుతున్నాయ‌ని మొత్తుకునే బీజేపీ నేత‌లు గుజరాత్ లో రైతుల‌కు చెందిన ప‌ల్లీల‌ను పందికొక్కుల్లా మెక్కిన సొంత‌పార్టీ నేత‌ల‌పై స్పందిస్తే మంచిదేమో.