దేశం నా వెనకే ఉంది….!

ఎర్రకోటలో ఐదోసారి జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశానికి సేవలందిస్తోన్న ప్రతి ఒక్కరికీ వందనాలు అని అన్నారు. మన వీరులెందరో జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరంపై ఎగుర వేవారన్నారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ నేతృత్వంలో ఎందరో త్యాగాలు చేశారన్నారు. అణగారిన వర్గాల వారి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశవీరుల బలిదానానికి జలియన్ వాలాబాగ్ ఉదంతం నిదర్శనమని చెప్పారు. సైనికులు దేశ సంరక్షణలో నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. త్రివర్ణ పతాకం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. దిగువ, ఎగువ, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి ప్రేరణ ఇస్తుందన్నారు.

సుబ్రమణ్య భారతి కవితను ప్రస్తావిస్తూ…..

అన్ని వర్గాలను ఉన్నత స్థాయికి తేవడమే తన లక్ష్యమని మోదీ తెలిపారు. దేశంలో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించాలన్న లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ప్రతి పల్లెలో వెలుగులు ప్రసరించాలన్న తమ ఆలోచన కార్యరూపం దాల్చిందన్నారు. ప్రతి పేద మహిళకు పొగబారిన పడకుండా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యం దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. ఫైబర్ నెట్ వర్క్ విషయంలో పురోగతి సాధించామన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు కవి సుబ్రమణ్య భారతి రచించిన కవితను మోదీ ప్రస్తావించారు. అన్ని బంధనాల నుంచి ముక్తికి భారత దేశం దారిని చూపుతుందన్న సుబ్రమణ్య భారతి కవితను చదివి విన్పించారు. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భారతదేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుందన్నారు.

డిజిటల్ ఇండియా దిశగా…..

డిజిటల్ ఇండియా దిశగా అభివృద్ధి సాగుతుందన్నారు. పార్లమెంటు సమావేశాలు ఫలప్రదమయ్యాయన్నారు. అన్ని వర్గాలను సమున్నత స్థాయికి తేవడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. 2013 నాటి లెక్కలతో పోలిస్తే ఈ నాలుగేళ్లలో దేశప్రగతి అనూహ్యమని తెలిపారు. దేశ అభివృద్ధి కాన్వాస్ చాలా పెద్దదన్నారు. జీఎనిస్టీ తెచ్చే ధైర్యం ఎవరూ చేయలేదన్నారు. తమ ప్రభుత్వం జీఎస్టీ తెచ్చి వ్యాపారవర్గాల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడికి భారత్ ఆకర్షణగా నిలిచిందన్నారు. దేశ బ్యాకింగ్ రంగాన్ని పటిష్టం చేసేందుకు కొత్త చట్టాలను తెచ్చామని, 2014 లో దేశంలో ప్రభుత్వం మారలేదని, దేశంలో మార్పు వచ్చిందని మోదీ అన్నారు. క్లిష్ట సమయాల్లో దేశం తనవెంటే నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దూరం చెరిపేశాం…..

ఈశాన్య భారతదేశం ఢిల్లీకి దూరమన్న భావనను చెరిపేశామన్నారు. దేశంలోని యువకులు బీపీవోలు ప్రారంభిస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానంతో యువత ముందుకు వెళుతుందన్నారు. దేశ యువత ప్రగతికి సరికొత్త అర్థాన్ని చెబుతున్నారన్నారు. మూడు లక్షలకు పైగా గ్రామాల్లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. దేశ యువత దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రగతి వైపునకు తీసుకువెళుతుందన్నారు. ఒకేసారి వంద ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత మన శాస్త్రవేత్తలదన్నారు. మంగళ్ యాన్ ను ప్రయోగించి ప్రపంచదేశాల్లో మన శాస్త్రవేత్తలు ఖ్యాతిని గడించారన్నారు. లక్ష్య తీరాలకు చేరే దిశగా ఆటంకాలను అధిగమిస్తానని మోదీ చెప్పారు.

ఆయుష్మాన్ భారత్…..

ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్యఅభియాన్ ను ప్రవేశపెట్టనున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద దేశంలో పది కోట్ల కుటుంబాలకు ఈ పథకం కింద లబ్దిపొందుతారన్నారు. ఏ ఆసుపత్రిలోనైనా ఐదు లక్షల వరకూ ఆరోగ్య బీమాను పొందవచ్చన్నారు. అనారోగ్యం వస్తే వ్యక్తే కుటుంబమే ఇబ్బందులు పడుతుందన్నారు. చికిత్స కోసం పేదలు అప్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీన్ దయాళ్ జయంతి నాటికి ఈ పథకం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందని మోదీ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ సామాన్యమైన పథకం కాదన్నారు. ఆరోగ్య భారత్ ను రూపొందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో మహిళకు గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుప్రీంకోర్టులో నేడు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం గర్వంగా ఉందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*