నో..ప్రాబ్లమ్ …అంటూనే….!

అందరిదీ తలోదారి. విపక్షాలన్నీ కలసి ఐక్యంగా బీజేపీని ఎదుర్కొంటాయా? ఎన్నికలకు ముందే పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడం ఐక్యతకు భంగం వాటిల్లదా? ఇదే ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీని, కమలం పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనడం అంత సులువు కాదు. ఈ విషయం అన్ని పార్టీలకూ తెలుసు. కాని విపక్షాలు ప్రధాని అభ్యర్థిపైనే రాద్ధాంతం చేస్తుండటం పరిశీలకులకు సయితం ఆశ్చర్యం కల్గిస్తోంది. మమత బెనర్జీకి మద్దతుగా కొందరు, రాహుల్ గాంధీకే అవకాశమివ్వాలని మరికొందరు ఇలా పొత్తులు కుదరకముందే పోట్లాటకు దిగుతున్నారు. ఇలాగైతే అందరూ ఒక్కటయ్యే మాట అటుంచి, మోదీకి బంగారు పళ్లెంలో పెట్టి అధికారాన్ని అప్పగిస్తారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

మమతకు మద్దతుగా…..

ఒకవైపు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుండగానే మమత అభ్యర్థిత్వాన్ని దేవెగౌడ సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య లుకలుకలు ప్రారంభమయ్యాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూడా తేడాలొచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవెగౌడ వ్యాఖ్యలు ఒకింత కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా మాయావతి అయినా మమత అయినా సరే ఓకేనన్నారు ఈ మాజీ ప్రధాని. ఇప్పటి వరకూ ఇందిరాగాంధీ తర్వాత పురుషులు మాత్రమే ప్రధాని పదవి చేపట్టారని, వీరిద్దరూ ఎందుకు చేపట్టకూడదని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటకలో పరిస్థితిని బట్టే….

దేవెగౌడ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలాన్ని సృష్టించాయి. అయితే దేవెగౌడ మాత్రం దూరదృష్టితోనే వ్యవహరించారంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకం దగ్గర నుంచి, ఒకవేళ విజయం సాధిస్తే తన కుమారుడి పదవికి ఎటువంటి ముప్పు ఉండదని దేవెగౌడ ఆలోచించే ఈ విధంగా వ్యాఖ్యానించారంటున్నారు. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గద్దెనెక్కడం కష్టం. ఇది గ్రహించే ప్రధాని అభ్యర్థిని ఎన్నికల తర్వాత నిర్ణయించుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. కాని విపక్షాల్లో కొన్ని పార్టీలు మాత్రం కాంగ్రెస్ తో సంబంధం లేకుండా ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి సంకటంగా మారింది.

పవార్ మొగ్గు రాహుల్ వైపే…..

ఇక సీనియర్ నేత, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతు పలకడం విశేషం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన ఒక జాతీయ ఛానల్ లో వ్యాఖ్యానించడం గమనార్హం. అన్ని పార్టీలూ ఆయనవైపే మొగ్గు చూపుతాయని శరద్ పవార్ అన్నారు. అంతేకాదు తాను, సోనియాగాంధీ, దేవెగౌడలు కలసి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి విపక్షాలను కూడగడతామన్నారు. ఎక్కడికక్కడ ప్రాంతీయ కూటములను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ టూర్ ఉంటుందని చెప్పారు. మొత్తం మీద విపక్షాల అనైక్యత ఎన్నికలకు ముందే కన్పిస్తోంది. మరి దీనిని కాంగ్రెస్ అధినేత ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*