మోడీ ఆలోచన ప్రకారమే రాహుల్…..?

అదే జరిగితే ముందస్తు ఎన్నికలు ఖాయంగానే కన్పిస్తున్నాయి. రాఫెల్ కుంభకోణంతో భారతీయ జనతా పార్టీ సర్కార్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాఫెల్ కుంభకోణంపై గత కొంతకాలంగా రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ అంశంపై తన కళ్లల్లో కళ్లుపెట్టి చూసే ధైర్యం లేదని రాహుల్ గాంధీ పలు సమావేశాల్లోనూ, సభల్లోనూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిన్ హోలాండ్ చేసిన ప్రకటనతో కమలం పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీన్నుంచి బయటపడేందుకు కమలం పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

మాటల యుద్ధం……..

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా పార్లమెంటు వేదికగానూ, సోషల్ మీడియాలోనూ మోదీ సర్కార్ కు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. ఇటు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ను, ఆర్థిక మంత్రి అరుణ‌ జైట్లీని టార్గెట్ చేసింది. అయితే రక్షణ ఒప్పందాల విషయాన్ని బయటపెట్టబోమని భారతీయ జనతా పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారు. గతంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేశామని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని, డసో సంస్థకు, రిలయన్స్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందమేనంటూ బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

చేయకుంటే రాజీనామాలే…….

కాంగ్రెస్ పార్టీ మాత్రం రఫెల్ ఒప్పందాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకుంటే కాంగ్రెస్ పెద్దయెత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. తొలుత ఆందోళనలను ఉధృతం చేసి, అప్పటికీ మోదీ సర్కార్ దిగిరాకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వడమే కాకుండా మోదీ ఇమేజ్ మరింత డ్యామేజీ అయి తమకు లబ్ది చేకూరుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.

బీజేపీ అనుకున్నట్లుగానే…….

అయితే ఇదే జరిగితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్న కమలనాధులకు దారులు తెరచినట్లే నన్న వార్తలు ఢిల్లీలో హల్ చల్ చేస్తున్నాయి. ఎందుకంటే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో కమలనాధులు ఉన్నారు. దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారు. విపక్ష పార్టీల ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలకు దిగితే పార్లమెంటును రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతామంటున్నారు కమలనాధులు. మొత్తం మీద రాఫెల్ కుంభకోణం ముందస్తు ఎన్నికలను తెచ్చిపెడుతుందన్న వార్తలు జోరుగా విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*