ఎవరికి వారే బాసులు…..ఇలాగైతే…?

జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ మోడీని ఎదుర్కోవడం కాంగ్రెస్ కు అంత తేలిక కాదు అని పిస్తోంది. ప్రధాని మోడీకి అంతా కలసి వచ్చేటట్లే కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. కాని విపక్షాల్లో మాత్రం ఐక్యత లేదు. విపక్షాలన్నీ కలసిస్తే బలమైన కమలదళాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ స్పష్టమైంది. అయితే ఉప ఎన్నికల తర్వాత కొద్దిరోజులు ఐక్యత మాటలు మాట్లాడిన వివిధ పార్టీల నేతలు ఇప్పుడు ఎవరికి వారే తామే బలవంతులుగా భావిస్తున్నారు. సీట్ల కేటాయింపు దగ్గర నుంచి ప్రధాని పదవి వరకూ అంతా కన్ఫూజనే. ఎవరికి వారే బాసులు. తమదే ఫైనల్ అంటున్న నేతలు. ఈ పరిస్థితుల్లో మోడీకి ఢీకొట్టడం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

కాంప్రమైజ్ అవ్వాలనుకున్నా……

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విపక్షాలన్నీ కలసి బీజేపీని మట్టి కరిపించాయి. ఈ స్ఫూర్తితో వచ్చే లోక్ సభ ఎన్నికలకు మహాకూటమిగా ముందుకెళ్లాలని బీజేపీయేతర పార్టీలన్నీ భావిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీ, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మోడీని ఓడించడానికి అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పగ్గాలను తన తల్లి సోనియాగాంధీ నుంచి తీసుకున్న రాహుల్ గాంధీ తమతో కలసి వచ్చే పార్టీలు పెట్టే ఎలాంటి ప్రతిపాదనకైనా ఓకే అని చెబుతున్నారు. కాంప్రమైజ్ అవ్వాలన్నది రాహుల్ అభిప్రాయం. ఈ దశలో విపక్షాల మధ్య అనైక్యత తలెత్తితే మోడీ బలం పుంజుకుంటారని, మరోసారి అధికారంలోకి కమలం పార్టీ వస్తే భవిష్యత్ ఉండదన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లోనూ స్పష్టంగా కన్పిస్తోంది.

బెంగాల్ బెబ్బులి చూపు…..

మోడీకి ధీటైన ప్రధాని అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాల్సి ఉంటుంది. రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించవచ్చు. ఇప్పటికే రాహుల్ కాంగ్రెస్ గెలిస్తే తానే ప్రధానినవుతానని ప్రకటించారు కూడా. అయితే రాహుల్ వయసు, రాజకీయ అనుభవం రీత్యా మోడీని తట్టుకోలేరన్నది, పోటీ ఇవ్వలేరన్నది ఇతర పక్షాల అభిప్రాయం. ఇందులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముందున్నారు. త్వరలోనే కోల్ కత్తాలో ఫెడరల్ ఫ్రంట్ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ బెంగాల్ బెబ్బులి. మమత చూపంతా ప్రధాని కుర్చీవైపే ఉందంటున్నారు. అందుకోసమే ఆమె విపక్షాలన్నింటినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను ప్రారంభించారు. ఇక బీహార్ ఆర్జేడీ నేత తేజస్వి సయితం వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రేసులో రాహుల్ ఒక్కరే లేరని, విపక్షాల నుంచి చాలామంది ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మాయావతి కన్ను…..

మరోవైపు మరో ఐరన్ లేడీ మాయావతి చూపు కూడా ప్రధాని కుర్చీ వైపే ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు. రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మాయావతి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు కుదిరితే ప్రధాని కుర్చీ ఎక్కేయాలని కూడా మాయావతి తహతహలాడుతున్నారు. ఇందుకు సమాజ్ వాదీ పార్టీ నుంచి కూడా పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆమె గట్టి షాకిచ్చే వార్త చెప్పారు. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో తమకు తగినన్ని సీట్లు ఇస్తేనే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని సిగ్నల్స్ పంపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ పొత్తుతో వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. బలంగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఒంటరిగా పోటీ చేయాలని అక్కడి కాంగ్రెస్ నేతలు గట్టిగా కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో విపక్షాల మధ్య ఐక్యత కుదిరేనా? మోడీని ఢీకొట్టడానికి అన్ని చేతులు కలుస్తాయా? అన్నది అనుమానమే. రాహుల్ మాత్రం తనకు ప్రధాని పదవి అక్కరలేదని, విపక్షాల్లో ఎవరైనా సరైన అభ్యర్థి ఉంటే ప్రధాని పదవి తీసుకోవడానికి అంగీకరిస్తామని సంకేతాలు కాంగ్రెస్ పార్టీ పంపుతుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*