ఆ ఐదు…కీలకమే….!

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఈ ఏడాది నవంబరు నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలకు జరగాల్సి ఉంది. అయితే కొత్తగా తెలంగాణ ప్రభుత్వం రద్దు కావడంతో దానికి కూడా వీటితో పాటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో భారతీయ జనతాపార్టీ కేంద్ర నాయకత్వం ఈ ఐదు రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. వీటితో పాటు లోక్ సభ ఎన్నికలపైన కూడా భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ పరిస్థితి, విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బాధ్యులతో వీరు చర్చించనున్నారు.

సర్వేలతో అలర్ట్…..

ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో పార్టీ వెనకబడి పోయిందన్నది కాదనలేని వాస్తవం. మధ్యప్రదేశ్ లో మూడు దఫాలుగా బీజేపీ ప్రభుత్వం ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం పనితీరు, ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ తగ్గిపోయిందన్న వార్తలతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుందన్నది వివిధ సర్వేల సారాంశం. ఈ ఐదు రాష్ట్రాల్లో ఫలితాలను బట్టే వచ్చే లోక్ సభఎన్నికల్లో సీట్లు తమ చేతికి వచ్చే అవకాశముందని భావించిన కమలదళం అందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. మధ్యప్రదేశ్ లో ముఖ్యంగా అభ్యర్థులను మార్చడం, కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి చర్యలను తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై కొంత సానుకూలత ఉన్నా….ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడయింది.

వసుంధరను మారుస్తారా?

ఇక మరో ముఖ్య రాష్ట్రం రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి. రాజస్థాన్ లో పార్టీ మరీ వీక్ గా ఉందని కేంద్ర నాయకత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి వసుంధర రాజే చేస్తున్న గౌరవ్ యాత్రలకు కూడా పెద్దగా స్పందన కన్పించడం లేదన్న రిపోర్ట్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ విషయంలో కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వసుంధరరాజేను నాయకత్వ బాధ్యతల నుంచి ఎన్నికలకు ముందు తప్పిస్తారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. మరి వసుంధరను తప్పించడం ఎంతవరకూ సాద్యమనేది చెప్పలేకున్నా….ఆ దిశగా కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు పక్కాగా తెలుస్తోంది. వసుంధర నాయకత్వంలో ఎన్నికలకు వెళితే ముప్పు తప్పదని గ్రహించిన కమలదళపతులు రాజస్థాన్ విషయంలో ఈ రెండురోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ రెండు చోట్ల కూడా……

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కమలం పార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది. అక్కడ కాంగ్రెస్ కొంత పుంజుకుంటున్నట్లు కన్పిస్తున్నప్పటికీ, నాయకత్వలేమి ఆపార్టీని అధికారంలోకి తీసుకురాలేవన్న నమ్మకంతో కమలనాధులు ఉన్నారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పై కూడా ప్రజల్లో సానుకూలత కన్పిస్తుండటం బీజేపీ గ్యారంటీగా గెలుస్తుందని చెబుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు అమిత్ షా. ఈ నెల 15వతేదీన తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వచ్చే ఓట్లను బట్టే వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లను కేటాయిస్తామని అమిత్ షా ఇప్పటికే పార్టీ నేతలకు చెప్పేశారు. ఇందుకు ఒక్క బండారు దత్తాత్రేయకే మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో కూడా వీలయినన్ని ఎక్కువ సీట్లు సాధించి లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. ఈ రెండురోజుల సమావేశాల్లో ఈ ఐదు రాష్ట్రాల విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*