మోదీ మహా బలవంతుడట..!!!

Telugu News Telangana News narendra modi bjp internal survey

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరేంద్ర మోదీ బలవంతుడా? బీజేపీ వ్యతిరేక కూటమి బలమైనదా? ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా తలెత్తుతోంది. వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలు అవుతుండటం ఆపార్టీకి మింగుడు పడటం లేదు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లలేదా? ఎక్కడ లోపం ఉంది.? లోక్ సభ ఎన్నికలలో ఎలాంటి వ్యూహం చేయాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వానికి పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అంతర్గత సర్వేను నిర్వహించిందని చెబుతున్నారు. మోదీ పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? మరోమారు మోదీకి భారత ప్రజలు పట్టం కడతారా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కునేందుకు ఆ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో ఒక సర్వేను నిర్వహించినట్లు చెబుతుంది. ఈ సర్వే వివరాలు ఇప్పుడు బయటకు రావడంతో ఆసక్తికరంగా మారింది.

అంతర్గత సర్వేలో…..

అయితే ఈ సర్వేల ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఢిల్లీలోని ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించినట్లు చెబుతున్నారు. మొత్తం 35 వేల మంది వరకూ బీజేపీ సంప్రదాయ ఓటర్ల అభిప్రాయాలనే సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్వేలో మోదీ బలం ఏమాత్రం తగ్గలేదని చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వం పట్ల మాత్రం కొంత వ్యతిరేకత కన్పిస్తోందని ఈ సర్వేలో తేలింది. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలున్నాయి. వీటిలో చాందినీ చౌక్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, న్యూఢిల్లీ, చాందినీ చౌక్, సౌత్, వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల్లో జరిపిన ఈ సర్వేలో మోదీ తిరిగి ప్రధాని కావాలని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు.

మోదీయే మళ్లీ ప్రధాని కావాలంటూ….

దేశ రాజధానిలో నిర్వహించిన ఈ సర్వేలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కేవలం పదిహేను శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ కు ఇరవై అయిదు శాతం మంది మద్దతుగా నిలిచారు. ఇక ప్రధాని మోదీకి యాభై శాతం మార్కులు పడగా, భారతీయ జనతా పార్టీకి 37 శాతం మంది మాత్రమే ఓకే చెప్పడం విశేషం. నిజానికి ప్రధాని మోదీ పై వ్యతిరేకత పెరిగిందన్నది దేశవ్యాప్తంగా అందరూ అభిప్రాయపడుతున్న విషయం. నోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ కుంభకోణం వంటి అంశాలతో ఆయన ప్రభ మసకబారిందని భావించారు. కానీ ఈ సర్వేలో మాత్రం మోదీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని చెప్పకనేచెబుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల బీజేపీకి అదనంగా పెరిగిన బలం కూడా ఏమీ లేదని తేల్చారు.

ప్రత్యర్థి బలహీనంగా ఉండటంతో….

2014ఎన్నికలలో మోదీని ప్రధాని అభ్యర్థిగా కేవలం 59 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. అయితే ఇప్పడు 60 శాతం మంది బలపర్చడం మోదీ బలం పెరిగిందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు. ఈ సర్వేను ఈ ఏడాది జులై నుంచి అక్టోబరు మధ్యలో నిర్వహించారని తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాలతో బలహీనంగా ఉన్న ప్రత్యర్థి రాహుల్ ను ఢీకొనడం ఏమాత్రం అసాధ్యం కాదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ కాషాయజెండాను ఢిల్లీలో ఎగురవేస్తామని ధీమాగా చెబుతున్నాయి. అయితే ఐదు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ మార్పులు చోటు చేసుకోవచ్చన్న ఆందోళన కమలనాధుల్లో లేకపోలేదు. మొత్తం మీద అందరూ చెబుతున్నట్లుగా మోదీ ప్రభ ఏమాత్రం తగ్గలేదని, 2014 కంటే ఇప్పుడు పెరిగిందన్న ధీమా కమలం పార్టీలో వ్యక్తమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*