సహజీవనమే బెటర్ …?

ఈయన అడగటమే పాపం ఆయన చేసెయ్యడమే. ఇద్దరికి మంచిగా వున్న అవగాహన అన్ని పనులు చేయిస్తుంది. వారిద్దరి మధ్య పొత్తు లేదు పొట్ల కాయలేదు. కానీ అనుకున్నవి, అడిగినవి, అడగనివి అన్ని చక చకా అయిపోతూనే వున్నాయి. క్లిష్టమైన తెలంగాణ జోన్ల సమస్యకు మోడీ తల్చుకుని క్షణాల్లో చేసి పడేశారు. అలాగే ముందస్తుకు పోతామంటే పోయిరమ్మని దీవించారు. ఇదంతా నరేంద్ర మోడీ, కెసిఆర్ నడుమ వున్న అండర్ స్టాండింగ్ కి అడ్డం పడుతుంది.

ఫెయిల్యూర్ లవ్ స్టోరీ …

ఎపి విషయంలో కేంద్రం భిన్నంగా ప్రవర్తించింది. గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు పెట్టుకుని ఇద్దరు లాభపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టిడిపి బిజెపి కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రెండు ప్రభుత్వాల్లో మంత్రులుగా రెండు పార్టీల వారు కొలువు తీరారు. నాలుగేళ్ళు సుమారు గా కాపురం చేసి ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటూ దూరం అయ్యారు. కేంద్రం చేసి చచ్చింది ఏమి లేదని బాబు అంటే, ఏపీలో జరిగిన అవినీతి దేశంలో ఎక్కడా లేదంటూ బిజెపి ఒంటికాలిపై ఒకరు కొకరు లేస్తున్నారు. ప్రియుడి చేతిలో మోసపోయిన ప్రియురాలిలా నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడు చంద్రబాబు మోడీ నన్ను మోసం చేశారంటూ ప్రజల్లో ప్రచారం మొదలెట్టారు.

డీల్ అంటే అది లెక్కని చెప్పిన కెసిఆర్…

పొత్తు కన్నా అవగాహనే ఎక్కువ లాభమని కెసిఆర్ నిరూపించారు. కలిసి సంసారం చేసి నష్టపోయామని చంద్రబాబు నిరూపించారు. తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరు భిన్నమైన దారిలో మోడీతో కలిశారు. ఒకరు విజయవంతం అయితే మరొకరు విఫలం అయ్యారు. అందుకే ఈసారి బాబు తెలంగాణా చంద్రుడి రూట్ లోనే వెళ్ళాలని భావిస్తున్నారంటున్నారు రాజకీయవిశ్లేషకులు. కేంద్రంలో ఏ సర్కార్ వచ్చినా వారితో పొత్తుకాకుండా అవగాహనతోనే రాజకీయ, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నట్లు పసుపు దళంలో చర్చ సాగుతుంది. మరి భవిష్యత్తు రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*