మోదీ అడుగు అటువైపే ఎందుకు….??

narendramodi-puri-constiuency

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేయనున్నారా? ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిని వదిలేయనున్నారా? ఒడిశాలోని పూరీ నుంచి పోటీ చేయనున్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. బీజేపీ జతీయ, ఒడిశా రాష్ట్ర శ్రేణులు కూడా ఈ విషయాన్ని తోసిపుచ్చడం లేదు. మోదీని పోటీ చేయమని పార్టీ రాష్ట్ర నేతలు పలువురు కోరుతున్నారు. విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ పోటీ చేయడం వల్ల ప్రత్యేకంగా కలిగే ప్రయోజనాలేమిటి? అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్న మవుతాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మోదీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే, వెనకబడిన రాష్ట్రం నుంచి పోటీ చేసిన రెండో ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు. గతంలో 1996 లోక్ సభ ఎన్నికల్లో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు, ఇదే రాష్ట్రంలోని బరంపురం నుంచి గెలుపొందారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన బరంపురంలో తెలుగువారు ఎక్కువ. దీంతో పాటు నాటి ముఖ్యమంత్రి జె.బి.పట్నాయక్ పీవీకి సన్నిహిత సహచరుడు. దీంతో ఒడిశాలో పోటీకి పీవీ ఆసక్తి చూపారు. అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ తొలుత 1991లో నంద్యాల నుంచి ఎన్నికయ్యారు. 1996లో నంద్యాలతో పాటు బరంపురంనుంచి ఎన్నికయ్యారు. తర్వాత నంద్యాల స్థానాన్ని వదులుకుని బరంపురం నుంచి కొనసాగారు. ఇప్పుడు మోదీ పోటీ చేస్తారన్న ప్రచారంతో ఒడిశా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రాజకీయ వర్గాల దృష్టి దానిపై మళ్లింది.

అనేక కారణాలు…..

మోదీ దృష్టి ఒడిశాపై మళ్లడానికి కారణాలున్నాయి. ఒడిశా అసెంబ్లీకి లోక్ సభతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. గతంలో రాష్ట్రంలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉండేవి. వాజ్ పేయి మంత్రివర్గంలో ప్రస్తుత సీఎం నవీన్ పట్నాయక్ పనిచేశారు. అదే విధంగా తర్వాత పట్నాయక్ ఆధ్వర్యంలోని బీజేడీ మంత్రివర్గంలో బీజేపీ పనిచేసింది. ఇటీవల కాలంలో నవీన్ పట్నాయక్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం విపక్ష నేతలతో సంప్రదింపులు జరపడం, రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కేంద్రంపై విమర్వలు సంధించడంతో రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ కుదేలవ్వడంతో గట్టిగా పోరాడి కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నది కమలనాధుల వ్యూహం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147 స్థానాలకు గాను బీజేడీ 117, కాంగ్రెస్ 16, బీజేపీ 10 స్థానాలను గెలుచుకున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 21 గాను కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 20 స్థానాలను బీజేడీ గెలుచుకోగా ఒక్క స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది.

గత ఎన్నికల్లో……

సుందర్ ఘర్ (ఎస్.టి) నియోజకవర్గం నుంచి ఏకైక ఎంపీ జ్యుయల్ ఓరం కేంద్రమంత్రిగా ఉన్నారు. ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ఇటీవల ఏబీపీ -సీ ఓటరు సర్వేలో తేలింది. మొత్తం 21 స్థానాలనకు గాను 15 నియోజకవర్గాలను గెలుచుకుంటుందన్న సర్వే నేపథ్యంలో ఈ తూర్పు రాష్ట్రంపై కమలం కన్నేసింది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని దీనిని సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీకి మంచి ఊపు లభిస్తుందని అంచనా వేస్తోంది. మోదీ పోటీ చేయడం వల్ల దాని ప్రభావం ఇతర నియోజకవర్గాలపై పడుతుందని, తద్వారా మరిన్ని సీట్లను గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతుంది. హిందుత్వ భావాలు గల మోదీ 2014లో సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని వడోదరతో పాటు ఆథ్మాత్మిక నగరమైన వారణాసిలో పోటీ చేయడం పార్టీకి లాభించింది. నాటి ఎన్నికల్లో యూపీలో మొత్తం 80 స్థానాల్లో 71 స్థానాలను గెలుచుకుని తిరుగులేని ఆధిక్యం సాధించింది. హిందువులకు వారణాసి ఎంత పవిత్రమైందో…? పూరీ కూడా అంత పవిత్రమైందే. ఏటా జరిగే పూరీ జగన్నాధ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆది శంకరాచార్య స్థాపించిన గోవర్థన మఠం ఈ తీర ప్రాంత నగరమైన పూరీలోనే ఉండటం విశేషం. ఇక్కడ పోటీ చేయడం వల్ల హిందువుల ఓట్లు కొల్లగొట్టవచ్చన్నది కమలనాధుల ఆలోచన.

బీజేడీ కంచుకోటలో…..

అయితే గణాంకాలును బట్టి చూస్తే పూరీ లోక్ సభ స్థానం బీజేడీకి కంచుకోట. గత 20 ఏళ్ల నుంచి ఆ పార్టీ ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తోంది. 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. ప్రస్తుత పూరీ బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా గత ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్లను సాధించారు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతికి రెండున్నర లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. 2009లో కూడా బీజేడీ అభ్యర్థి మిశ్రా రెండు లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 1998, 1999, 2004 ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థి బ్రజా కిషోర్ త్రిపాఠీ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో పూరీతో పాటు బ్రహ్మగిరి, సత్యబంది, పిపిలి, చిలిక, నయాఘర్, రణ‌్ ఘర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇటీవల కాలంలో మోదీ రాష్ట్రాన్ని రెండు సార్లు సందర్శించడం, కోట్లాది రూపాయల అభివృద్ది పథకాలను ప్రారంభించడంతో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారానికి బలం చేకూరింది. గత నెల 24 భువనేశ్వర్, ఖుర్బాల్లో పర్యటించిన మోదీ తాజాగా ఈనెల 5న రెండోసారి పర్యటించారు. దీంతో మోదీ ఇక్కడి నుంచి పోటీ చేసే దిశగా అనేక అడుగులు వేశారని విశ్లేషకుల అంచనా. గట్టి ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. మరి ఒడిశా నుంచి మోదీ పోటీ చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*