మోదీ వీకయ్యారు.. రాహుల్ బలపడలేదే…!!!

narendramodi-rahulgandhi-parlament-elections

కొత్త ఏడాది రాజకీయ నామ సంవత్సరంగా దేశ ప్రజానీకానికి దిశానిర్దేశం చేయబోతోంది. 1996 తర్వాత ఒక సందిగ్ధ ముఖచిత్రంతో ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పట్లో బీజేపీ, కాంగ్రెసు ల తోపాటు మధ్యేమార్గంలో చిన్నచితక ప్రాంతీయపార్టీలతో కూడిన జట్టుకూ ప్రాధాన్యం లభించింది. వాజపేయి బలనిరూపణ చేసుకోలేకపోవడంతో యునైటెడ్ ఫ్రంట్ పేరిట ఆ కూటమే కాంగ్రెసు మద్దతుతో రాజ్యం చేసింది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు అదే వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఏప్రిల్ మొదటివారం నుంచే ఎన్నికలు మొదలై ఏడెనిమిది దశల్లో మే రెండో వారం వరకూ సాగేందుకు ఆస్కారం ఉంది. ఫిబ్రవరి చివరి నాటికి షెడ్యూల్ విడుదల అవుతుందని పార్టీలు భావిస్తున్నాయి. ఇక పై ప్రతిరోజూ పార్టీలకు పరుగు పందెమే. ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం కోసం తాపత్రయపడుతున్నాయి. సమీకరణలు, పొత్తులు, వ్యూహాలు ఇక భారతయుద్ధాన్ని కనులముందు నిలిపే ఘట్టాలే.

కదలికల్లో జోష్…

కాంగ్రెసు కదలికల్లో జోష్ మొదలైంది. 2014 తర్వాత పార్టీ పూర్తిగా నిర్వీర్యమై పోయింది. ఎక్కడ ఎన్నిక జరిగినా దాదాపు పరాజయాన్ని మూట గట్టుకుంది. నాలుగేళ్ల తర్వాత తిరిగి పునరుజ్జీవం మొదలైంది. కర్ణాటక ఎన్నిక కొంత కుదుటపడేలా చేస్తే తాజా గా జరిగిన రాష్ట్రాల ఎన్నికలు జవసత్తువలను కల్పించాయి. ఇది తొలి అడుగుగానే చెప్పుకోవాలి. ఓటరు చాలా జాగ్రత్తగా తీర్పునిచ్చారు. ఏకపక్ష విజయం కాదు. ఛత్తీస్ గఢ్ ను మినహాయిస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ పోరాటమే. స్పష్టమైన ఆధిక్యం లేని స్థితిలో పాలనను నెట్టుకుని రావాల్సి ఉంటుంది. వర్గ విభేదాలకు పెట్టింది పేరైన కాంగ్రెసుకు ఇది ఏమంత శ్రేయస్కరం కాదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎదురుతిరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా కాంగ్రెసుకు నైతికస్థైర్యం చిక్కింది. రాఫెల్ డీల్, జీఎస్టీ ఇబ్బందులు, రైతుల కష్టాలు, నిరుద్యోగం అంశాలను ప్రాతిపదికగా చేసుకుంటూ ఎన్నికల సమరాన్ని ఈదాలని యత్నిస్తోంది. రాహుల్ సైతం రాటు దేలారనే చెప్పాలి. పొత్తులు పెట్టుకోవడంలో చాలా చొరవ తీసుకుంటున్నారు. సాహసం కూడా చేస్తున్నారు. తెలుగుదేశంతో పొత్తునే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. బిజూ జనతాదళ్ వంటి పార్టీలనూ మచ్చిక చేసుకోవాలని యత్నిస్తున్నారు.

కాసింత అప్రమత్తం…

‘అనువుగాని చోట అధికులమనరాదు.’ అన్న సూత్రాన్ని ఇప్పుడిప్పుడే వంట బట్టించుకొంటోంది బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం. మోడీ, షాలు ఆచితూచి అడుగులేస్తున్నారు. బిహార్ లో లోక్ జనశక్తి చిన్నపార్టీయే అయినా చాలా తగ్గి సీట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ ఒక్కపార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. పార్టీలు వీడిపోతే ఎన్నికల్లో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నైతికంగా ప్రతిపక్షాలు పుంజుకుంటాయి. అందువల్లనే మోడీ, షాలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజా ఎన్నికలపై సీరియస్ గా సమీక్ష జరిగితే తమ తలకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో రివ్యూ అంశాన్ని పైస్థాయిలో పెండింగులో పెట్టగలిగారు. అక్కడక్కడ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నప్పటికీ అణచివేసే చర్యలు తీసుకోవడం లేదు. బుజ్జగించేందుకు యత్నిస్తున్నారు. మరిన్ని స్వరాలు వినిపించే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి రాజీకి పావులు కదుపుతున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని యత్నిస్తున్నారు. నాలుగైదు లక్షల కోట్లరూపాయల స్కీములను వెంటనే ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈవిషయంలో మొత్తమ్మీద బీజేపీ సైతం కాంగ్రెసు, ప్రాంతీయపార్టీల బాటలోనే నడవాలని నిర్ణయించుకుంది.

కొత్త ఉత్సాహం…

మూడో ప్రత్యామ్నాయం సెక్యూలర్ ఫ్రంట్ అన్న భావన చాలా కాలంగా ఉన్నప్పటికీ కార్యాచరణ లేదు. ఎవరో ఒకరు పూర్తిసమయం కేటాయించి వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాంతీయపార్టీల నాయకులకు తమ రాష్ట్రాలను చూసుకోవడంతోనే సరిపోతోంది. అందరినీ సమన్వయం చేసే వ్యక్తులు కావాలి. చంద్రబాబు నాయుడికి అటువంటి లక్షణాలు ఉన్నాయి. కానీ ఆయన కాంగ్రెసు నాయకత్వంలోని ఫ్రంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. మమత, మాయా, అఖిలేష్, స్టాలిన్, నవీన్ పట్నాయక్ వంటివారికి అంత ఓపిక లేదు. తిరిగినా వారిని సొంతంగా విశ్వసించేవారి సంఖ్య తక్కువ. అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారు. లోక్ సభ ఎన్నికలతో కలిపి పెట్టుకుంటే ఆయన కూడా తెలంగాణకే పరిమితం కావాల్సి ఉండేది. రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడం ప్రథమప్రాధాన్యం . ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని కేసీఆర్ స్థిరపరుచుకున్నారు. అందువల్లనే దేశంపై దృష్టి పెట్టారు. మమత వంటి అనుభవజ్ణులైన వారి సంగతి పక్కనపెట్టినా వైసీపీ వంటి పార్టీలు ఆకర్షితమయ్యే అవకాశాలున్నాయి. ఇంకా దేశ రాజకీయ చిత్రం డోలాయమానంగా ఉంది. బీజేపీ బలహీనపడుతోంది. కాంగ్రెసు పూర్తిగా పుంజుకోలేదు. అందుకే ప్రాంతీయ లౌకిక సమాఖ్య కూటమికి కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది.

 

 

– ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*