జోడీ వర్సస్ మోడీ…!!

narendramodi-vs-akhilesh-yadav-mayavathi

ఎట్టకేలకు బీజేపీ అగ్రనాయక ద్వయం మోడీ,అమిత్ షా గుండెల్లో రైళ్లు పరుగు పెట్టించే పరిణామానికి పునాది రాయి పడింది. ఎనభై లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో కచ్చితంగా 40 నుంచి 45 స్థానాలు కోల్పోకతప్పనిపరిస్థితి అనివార్యంగా మారింది. సమాజ్ వాదీ, బహుజనసమాజ్ ల కలయిక యూపీకి మాత్రమే కాదు, కేంద్రంలోనూ కీలక ఘట్టమే. 282 స్థానాలతో సొంతంగా మెజార్టీ సాధించిన బీజేపీ సీట్లలో అగ్రభాగాన నిలిపిన ప్రాంతం ఈ రాష్ట్రమే. బీజేపీకి 71, మిత్రపక్షానికి రెండు కలిపి 73 సీట్లు ఇక్కడ్నుంచే లభించాయి. ఇప్పుడు 25 నుంచి 30 సీట్లకే కమలం బలం పరిమితమవుతుందనేది వివిధ సర్వేల అంచనా. గడచిన ఏడాదికాలంగా యూపీపై నిశితంగా పరిశీలన చేస్తున్న మీడియా సంస్థలదీ అదే అంచనా. యూపీలోనే ప్రస్తుత బలంలో 45 సీట్లు కోల్పోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర , ఢిల్లీ , గుజరాత్, కర్ణాటక వంటి చోట్ల కోల్పోయే స్థానాలూ పదుల సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపితే దేశవ్యాప్తంగా బీజేపీ బలం 160 లోపునకు కుదించుకుపోతుందనే భయం పార్టీని ఆవరించింది. అఖిలేష్, మాయావతిల ప్రభావం దేశరాజకీయాల్లో అంతగా ఉండటానికి కారణమేమిటనేది ఆసక్తిదాయకమే.

ఆనాటి చేదు అనుభవాలు…

1993లో ములాయం సింగ్ యాదవ్, కాన్షీరామ్ చేతులు కలిపారు. యూపీలో బీజేపీని నిలువరించారు. బాబ్రీ మసీదు సంఘటన అనంతరం జైశ్రీామ్ నినాదం ఆ రాష్ట్రాన్ని ఊపేస్తూ ప్రభంజనం సృష్టిస్తున్న తరుణంలో సైతం సమాజ్ వాదీ, బహుజనసమాజ్ ఆ గాలిని తట్టుకునేందుకు సంకీర్ణాన్ని అడ్డుగోడగా నిలిపాయి. ముస్లిం,ఎస్సీ, వెనకబడినవర్గాల బలంతో అప్పట్లోఎస్సీ,బీఎస్పీలు 109, 67 స్థానాలు తెచ్చుకున్నాయి. బీజేపీ 177 సీట్లు గెలుచుకుంది. సింగిల్ మెజార్టీ పార్టీ అయినప్పటికీ కాంగ్రెసు 28, జనతాదళ్ 27 సీట్లు బీజేపీకి సహకరించలేదు. దాంతో ఎస్పీ,బీఎస్పీల ప్రభుత్వం ఏర్పాటైంది. రెండేళ్లు గడవకుండానే విచ్ఛినమైంది. కాన్షీరామ్ పెద్దన్నపాత్ర పోషించాలని చూస్తూ నిరంతరం ములాయం సర్కారును చికాకు పరుస్తుండేవారు. పార్టీలో అంతర్గత సంఘర్షణకు మాయావతి కారణమయ్యారు. సొంత పార్టీలోని ఎమ్మెల్యేలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా చిన్నచూపు చూస్తుండేవారు. దాంతో పార్టీలోనే అసంతృప్త సెగలు ఎగసిపడ్డాయి. దీనికి కారణం ములాయం సింగ్ యాదవ్ అంటూ వేలెత్తి చూపేందుకు ప్రయత్నించారు. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న బీజేపీ నాయకులు మాయావతిని రెచ్చగొట్టారు. ములాయం ప్రభుత్వాన్ని కుప్పకూల్చి మాయావతిని సీఎం చేసేశారు. ఎస్పీ,బీఎస్పీల మధ్య విశ్వాసరాహిత్యం, అంత:కుట్రల ఫలితంగా ఈ రెండు పార్టీల మధ్య బద్ధశత్రుత్వం ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో ఇది మరింత పెరిగింది.

పదవీ ప్రాప్తకాలజ్ణత…

2017లో బీజేపీ ప్రభుత్వం మూడింట రెండువంతుల మెజార్టీతో యూపీలో అధికారంలోకి వచ్చేవరకూ ఎస్పీ, బీఎస్పీలే ప్రధాన ప్రత్యర్థులు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 20 శాతం ఓట్లు తెచ్చుకున్నప్పటికీ లోక్సభలో ఒక్కస్థానాన్ని తెచ్చుకోలేకపోయింది బహుజనసమాజ్ పార్టీ. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ 22 శాతం ఓట్లతో కేవలం అయిదు స్థానాలు మాత్రం గెలుచుకుంది. ఈరెండు పార్టీల మొత్తం ఓట్ల కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. 42.3 శాతం వరకూ కమలానికి ఓట్లు దక్కాయి. అది మోడీ హవా. అయినప్పటికీ ఈ రెండు పార్టీలు వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరించాయి. 2017లో విడివిడిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరపరాజయం చవిచూశాయి. బీజేపీ కి దాదాపు మూడు శాతం ఓట్లు తగ్గినా స్వీపింగ్ విజయాన్ని సాధించింది. ఎస్పీ,బీఎస్పీలకు మాత్రం దాదాపు లోక్ సభ ఎన్నికల నాటి ఓటింగు శాతమే లభించింది. కలిసి కట్టుగా నడిస్తే తప్ప బీజేపీని అడ్డుకోవడం సాధ్యం కాదని మాయావతి, అఖిలేష్ గ్రహించారు. లేకపోతే తమ రెండు పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టమవుతుందని వారు తాజాగా పొత్తుతో ప్రాప్తకాలజ్ణత ప్రదర్శించారు. ఇదే జరగకపోతే ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో మరింత కష్టాల్లో పడతాయి. బీసీలు, ముస్లింల మద్దతుతో సమాజ్ వాదీ పార్టీ చాలాబలంగా ఉండేది. ఇందులో ఎంబీసీ వర్గాన్ని కులాల వారీగా విడదీసి బీజేపీ మద్దతు పొందుతోంది. అలాగే దళిత వర్గాలకు ఐకాన్ గా ఉన్న మాయావతికి పశ్చిమ యూపీలో భీమ్ ఆర్మీ సవాల్ విసురుతోంది. ఎస్సీలలో మాయావతి జాతవ వర్గానికి చెందిన వారు. జాతవేతర దళితులను బీజేపీ వ్యూహాత్మకంగా ఆమెకు దూరం చేసింది. ఈ పరిణామాలన్నీ కలిసి ఎస్పీ,బీఎస్పీలు పాతకక్షలు పక్కనపెట్టక తప్పని అనివార్యతను కలిపించాయి.

అత్త ..అల్లుడు…

1993లో ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపినప్పుడు ‘ మిలే ములాయం, కాన్షీరామ్, హవా మే ఉడ్ గయే జైశ్రీరామ్ ’ అంటూ నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. తాజాగా ‘బహన్ జీ, అఖిలేష్ జుడే, మోడీ, యోగీ కే హోశ్ హుడే’ అంటే కొత్త నినాదం ఎత్తుకున్నారు. నినాదం సంగతి ఎలా ఉన్నప్పటికీ అనేక సర్దుబాట్లతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గతంలో ఉన్న ఆధిపత్య ధోరణి నుంచి మాయావతి బయటపడాలి. బీఎస్పీ కంటే పెద్ద పార్టీ అయినప్పటికీ సమాజ్ వాదీ తనను తాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అఖిలేష్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు. అందుకే మాయావతి కి అధికప్రాధాన్యం ఇస్తూ ఆమెనే ముందు వరసలో నిలుచోబెడుతున్నారు. స్వాతిశయాన్ని స్వాభిమానంగా భావించే మాయావతికి ఈ పరిణామం ఇగోను సంత్రుప్తి పరుస్తోంది. పైపెచ్చు అఖిలేష్ చాలా తెలివైన ఎత్తుగడ వేశారు. మాయావతికి ప్రధానమంత్రి పదవి మీద చాలా ఆసక్తి ఉంది. దళిత ఐకాన్ ముద్రతో ఆమెను కేంద్రానికి పంపించేందుకు తన వంతు సహకారం అందిస్తాననే భరోసా నిచ్చారు. బీజేపీ, కాంగ్రెసు కూటములు ఆధిక్యత సాధించలేకపోతే ఏదో ఒక ఫ్రంట్ మద్దతుతో ఆమె అందలమెక్కే అవకాశమూ ఉంటుంది. ఇదే అంశాన్ని నొక్కి చెప్పడం ద్వారా రాజకీయంగా మాయావతి స్థాయిని పెంచి భవిష్యత్తులో తన సీఎం పీఠానికి అడ్డు లేకుండా చేసుకోగలిగారన్నమాట.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*