మోడీ మొదలుపెట్టేశారు…!

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు క‌మ‌ల‌ద‌ళం జ‌మ్ముక‌శ్మీర్ అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. కొద్దికాలంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాని మోడీ ప్ర‌భ మ‌స‌క‌బారుతున్న‌వేళ‌.. బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న సంద‌ర్భంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క‌మ‌ల‌నాథులు అనూహ్యంగా జ‌మ్ముక‌శ్మీర్ అంశాన్ని తెర‌పైకి తేవ‌డం వ్యూహాత్మ‌క‌మేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లో పీడీపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుని త‌మ మ‌ద్ద‌తుదారులు, కార్య‌క‌ర్త‌ల్లో ర‌గులుతున్న అసంతృప్తిని చ‌ల్లార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది.

మూడేళ్ల పాటు కలిసి నడిచి…..

అంతేగాకుండా.. దేశంలోని రాజ‌కీయ‌వ‌ర్గాలు, ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే మెహ‌బూబా ముఫ్తీ ప్ర‌భుత్వంతో బీజేపీ తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. అనేక అంశాల్లో పీడీపీ, బీజేపీల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డం కూడా మ‌రో కార‌ణని అంటున్నారు. మూడేళ్ల‌పాటు పీడీపీతో క‌లిసి న‌డిచిన బీజేపీ ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డానికి సార్వ‌త్రిక ఎన్నిక‌లే కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిజానికి ఎప్పుడు ఉప్పు, నిప్పులా ఉండే పీడీపీ, బీజేపీలు క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్పుడే ఇది ఎంతో కాలం కొన‌సాగ‌ద‌ని చెప్పారు. ఇప్పుడే అదే నిజ‌మైంది. అనేక విష‌యాల్లోనూ పీడీపీ, బీజేపీల వాద‌న‌లు విరుద్ధంగా ఉన్నాయి.

అనేక అంశాలు…..

మ‌రోవైపు కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై స్థానికులు అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత విభేదాలు మరింత పెరిగాయి. నిందితులకు రాష్ట్ర బీజేపీ మంత్రులు, నేతలు మద్దతిచ్చారు. రంజాన్ రోజునే రైజింగ్ క‌శ్మీర్ ప‌త్రిక సంపాద‌కుడు సుజాత్‌ బుఖారిని దుండ‌గ‌లు కాల్చి చంపడం, రాష్ట్రీయ రైఫిల్స్‌ జవాన్‌ ఔరంగజేబ్‌ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడం త‌దిత‌ర అంశాలతో వాటి మధ్య మరింత దూరం పెరిగింది. నిజానికి.. జ‌మ్ముక‌శ్మీర్ అంటేనే జాతీయ‌వాదం.. ఇక్క‌డ అంశాలు దేశ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేస్తాయి. ముఖ్యంగా, పాకిస్తాన్‌, ఉగ్ర‌వాద అంశాలు యువ‌త‌ను, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తాయి.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం….

పాకిస్తాన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డంలో, ఉగ్ర‌వాదుల‌ను ఏరిపారేసే క్రెడిట్‌ను ఎవ‌రి సొంతం చేసుకుంటే.. వారికి దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు పెరిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని బీజేపీ అమ‌లు చేస్తోంది. రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పాల‌న విధించి, అన్ని అంశాల‌ను కేంద్రం ప‌రిధిలోకి తీసుకుని పాకిస్తాన్‌, ఉగ్ర‌వాదులప‌ట్ల తాము క‌ఠినంగా ఉంటున్నామ‌నే సంకేతాల్ని ఇచ్చి దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో బీజేపీ పెద్ద‌లు ఉన్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ పాల‌న‌పై సాగుతున్న చ‌ర్చ‌ను క‌శ్మీర్‌వైపు తిప్ప‌డం కూడా వారి వ్యూహంగా క‌నిపిస్తోంది.

గవర్నర్ పాలనలో…..

జ‌మ్ముక‌శ్మీర్‌లో మొత్తం 87 అసెంబ్లీ స్థానాలు, ఆరు లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పీడీపీ 28స్థానాలు, బీజేపీ 25స్థానాలు, కాంగ్రెస్ 12, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ 15, ఇత‌రులు ఏడు స్థానాల్లో విజ‌యం సాధించారు. ఇప్పుడు పీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కాంగ్రెస్‌, ఎన్‌సీలు ముందుకు రావ‌డం లేదు. దీంతో గ‌వ‌ర్న‌ర్ పాల‌న ఖాయం అయిపోయింది. మ‌రో విష‌యం ఏమిటంటే.. జ‌మ్ము ప్రాంతంలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలు, ల‌డ‌ఖ్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్క‌డి నుంచే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచింది.

రాజకీయ ప్రయోజనాల కోసమే…..

క‌శ్మీర్‌లో ఉన్న 46 స్థానాల్లో బీజేపీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. అయితే జ‌మ్ము, ల‌డ‌ఖ్ ప్రాంతాల అభివృద్ది విష‌యంలో పీడీపీ వివ‌క్ష చూపింద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండ‌గా.. రెండు పార్టీలు ఎంత‌సేపూ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే ఆలోచించాయి త‌ప్ప జ‌మ్ముక‌శ్మీర్‌లో శాంతిని నెల‌కొల్పి అభివృద్ధి ఫ‌లాల‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించేంద‌కు ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని కాంగ్రెస్‌, శివ‌సేన‌, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఏదేమైనా సాధార‌ణ ఎన్నిక‌ల వేళ ఇక్క‌డ రాజ‌కీయాలు విచిత్రంగా హీటెక్కాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*