సిద్ధూ పొలిటికల్ గా క్లీన్ బౌల్డ్ తప్పదా..???

navajyoth-singh-sidhu-controversy

పంజాబ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆయన వ్యవహారశైలి, మాటలు, చేతలు వివాదాలను కొని తెచ్చుకునే విధంగా ఉంటున్నాయి. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన సిద్ధూ దశాబ్దం దాటినా రాజకీయ నాయకుడి ప్రాతలో పూర్తిగా కుదురుకున్నట్లు లేదు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావడం, పాకిస్థాన్ సైనికాధిపతి జనరల్ బజ్వాతో ఆలింగనం, తాజాగా కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి అమరీందర్ అనుమతి లేకుండా హాజరుకావడం వంటివి సిద్ధూను చిక్కుల్లో పడవేస్తున్నాయి. 1963 అక్టోబర్ 20న జన్మించిన సిద్ధూ 19వ ఏటనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ప్రవేశించి సంచలనం సృష్టించారు. ఆయన తండ్రి కూడా ప్రముఖ క్రికెటర్ కావడం విశేషం. 1987 ప్రపంచకప్ లో ఆడటం ద్వారా మంచి గుర్తింపు పొందారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా వ్యవహరించారు. మొత్తం 51 టెస్ట్ మ్యాచ్ లు, 136 వన్డే మ్యాచ్ లు ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్ నుంచి విరమించుకున్న అనంతరం టిలివిజన్ వ్యాఖ్యాతగా, హాస్య సన్నివేశాల నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

బీజీపీలో చేరి… ఆ తర్వాత…..

అనంతరం 2004లో క్రియాశీల రాజకీయాల్లో చేరారు. భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కూడా మళ్లీ అదే నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయాల్సి ఉంది. అయితే పార్టీ అగ్రనేత, ప్రస్తుత కేంద్ర ఆర్థిక హోంమంత్రి అరుణ్ జైట్లీ పోటీ చేసేందుకు వీలుగా సిద్ధూ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. కానీ నాటి ఎన్నికల్లో జైట్లీ ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి పాటియాలా మహారాజుగా పేరొందిన కెప్టెన్ అమరీందర్ సింగ్ భారీ మెజారిటీతో జైట్లీని ఓడించారు.అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో అమృత్ సర్ స్థానాన్ని కమలం పార్టీ కాపాడుకోలేకపోయింది. అమృత్ సర్ స్థానాన్ని త్యాగం చేసినందుకు బీజేపీ సిద్ధూను 2016 ఏప్రిల్ 28న రాజ్యసభకు నామినేట్ చేసింది. వాస్తవానికి అప్పట్లో పార్టీ అధిష్టానం ఆయనకు సానుకూలంగా లేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా బీజేపీ ఆయనను పెద్దల సభకు పంపింది. పట్టుమని మూడు నెలలు తిరక్కుండానే అదే ఏడాది జులై 18న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం “అవాజ్ -ఈ-పంజాబ్” పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. పంజాబ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటం, హక్కుల కోసం పార్టీని ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. తర్వాత 2017 జనవరిలో కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్ సర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన అమృత్ సర్ నుంచి తప్ప తాను ఎక్కడా పోటీ చేయనని తరచూ ప్రకటించేవారు. ప్రస్తుతం అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, పురావస్తు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.

అన్నీ వివాదాలే…..

ఇంతవరకూ సిద్ధూ రాజకీయ జీవితం ప్రశాంతంగానే కొనసాగింది. తన క్రికెట్ స్నేహితుడు, పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుతో వివాదాలు ప్రారంభమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకారానికి ఇస్లామాబాద్ వెళ్లారు. అమృత్ సర్ కు 32 కిలోమీటర్ల దూరంలోని ” వాఘా” సరిహద్దు దాటి పాక్ లో ప్రవేశించిన సిద్ధూకు ఘన స్వాగతం లభించింది. అయితే ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాక్ సైన్యాధిపతి జనరల్ బజ్వా పక్కన కూర్చోవడం, ఆయనను ఆలింగనం చేసుకోవడం వివాదానికి దారి తీసింది. కశ్మీర్ సరిహద్దుల్లో భారత్ సైనికులను హతమారుస్తునన పాక్ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తితో ఎలా చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్నారన్న విమర్శలు విన్పించాయి. దీనికి సిద్ధూ వివరణ ఇచ్చినప్పటికీ ప్రజలు విశ్వసించలేకపోయారు.

కారిడార్ నిర్మాణం విషయంలో…..

ఆ తర్వాత కర్తార్ పూర్ లో సాహిబ్ గురుద్వారాకు భారత్ వైపు క్యారిడార్ నిర్మాణం విషయంలో కూడా సిద్ధూ అత్యుత్సాహం ప్రదర్శించాడన్న విమర్శలు విన్పించాయి. పాకిస్థాన్ లోని ఈ గురుద్వారాకు వెళ్లడానికి ప్రస్తుతం దారి లేదు. భారత్ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఈ గురుద్వారాను సిక్కు భక్తులు బైనాక్యులర్స్ ద్వారా చూస్తుంటారు. సిక్కుల తొలి గురువైన గురునానక్ కర్తార్ పూర్ లోనే తుది శ్వాస విడిచారన్నది నమ్మకం. కారిడార్ నిర్మాణ కార్యక్రమానికి సిద్ధూ వ్యక్తిగత హోదాలో పాక్ వెళ్లారు. కేంద్ర మంత్రులు హర్ సిమ్రత్ కౌర్ బాదల్, హర్ దీప్ సింగ్ కి మాత్రమే అధికారికంగా అనుమతి ఉన్నప్పటికీ వ్యక్తి గత హోదాలో సిద్ధూ పాల్గొనడం పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అమరీందర్ సింగ్ మంత్రివర్గంలోని రాజేందర్ సింగ్…సిద్ధూ రాజీనామాకు డిమాండ్ చేశారు. అయితే పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశం మేరకు పాక్ కు వెళ్లానని సిద్ధూ తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్ కు వచ్చినప్పుడు ప్రకటించారు. తనకు సీఎం అమరీందర్ కెప్టెన్ అయితే, అందరికీ రాహుల్ కెప్టెన్ అని పరోక్షంగా ధిక్కరిస్తూ మాట్లాడారు. పాక్ పర్యటనతో ఖలిస్తాన్ వేర్పాటు వాద నేత తో సెల్ఫీ దిగడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. మొత్తానికి మున్ముందు ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం కనపడుతుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*