నవీన్ మైండెసెట్ మారిందెందుకు?

ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ కూడా ముందస్తుకు మొగ్గు చూపుతున్నారా? అవును…. ఆయన ముందస్తుకే మొగ్గుచూపుతున్నారు. వివిధ రాజకీయ కారణాలతో నవీన్ పట్నాయక్ కూడా ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారంటున్నారు. లోక్ సభ ఎన్నికలు ముందస్తుగా జరిగితే తమ రాష్ట్రానికి కూడా వాటితో పాటే ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరడానికి కారణాలేంటి? ఒడిశాలో ఉన్న రాజకీయ పరిస్థితులే కారణమా? కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనే అభిప్రాయమా? అన్న విశ్లేషణలు బయటకు వస్తున్నాయి.

రెండు దశాబ్దాలుగా…..

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ ను తన తండ్రి నుంచి అందిపుచ్చుకుని రెండు దశాబ్దాలుగా నడుపుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు నవీన్ పట్నాయక్ ఒడిశాలో విజయం సాధించారు. నాలుగోసారి విజయం కోసం ఆయన తహతహలాడుతున్నారు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ కొంత పుంజుకుంటున్నట్లు కనపడుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరు నెలలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొంత విజయావకాశాలు కన్పిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

బీజేపీ పుంజుకోవడం….

అదే జరిగితే ఒడిశాలో కూడా ఆ ఫలితాల ప్రభావం పడే అవకాశముంది. దీంతో కాంగ్రెస్ ఓట్లు ఎక్కువగా చీల్చుకుంటే అధికారంలోకి రాకపోయినా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ బలపడకూడదని, బీజేపీ మరింత పుంజుకోకూడదనే నవీన్ పట్నాయక్ లోక్ సభ ఎన్నికలతో పాటు ముందస్తుగా జరిగితే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు పినాకి మిశ్రా ఎన్నికల కమిషన్ ముందు తాము ముందస్తుకు సిద్ధమేనని, లోక్ సభ కు ముందుగా ఎన్నికలు జరిగితే తమ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరపాలని కోరారన్న వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్ ను తక్కువగా అంచనా వేయలేమని…..

ప్రస్తుతం ఒడిశాలో బిజూ జనతాదళ్ బలంగానే ఉంది. అలాగని బీజేపీని, కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయలేమంటున్నారు. ముఖ్యంగా బీజేపీ స్థానికసంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించడంతో తనకు బలమైన ప్రత్యర్థి బీజేపీయేనని నవీన్ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొన్నటి వరకూ దెబ్బతినింది. అయితే కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతతో ఆ పార్టీ కూడా పుంజుకునే అవకాశముందని తెలియడంతోనే ముందస్తుకు వెళ్లి నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నవీన్ భావిస్తన్నారని తెలుస్తోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటితో పాటే వెళ్లాలన్నది నవీన్ అభిప్రాయంగా తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*