నవీన్ కు మరో దారిలేదా….??

naveen-patnaik-bijujanathadal-grand-alliance

ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి రూపుదిద్దుకోనుందా? ఈ నెల 11వ తేదీ తర్వాత దానికి తుదిరూపు రానుందా? ఇప్పటికే 18 పార్టీలు మహాకూటమిలో చేరేందుకు సంసిిద్ధత వ్యక్తం చేశాయా? అవును. మోదీకి వ్యతిరేకంగా గ్రాండ్ అలయన్స్ ఇప్పటికే తుదిరూపు దాల్చింది. వచ్చే నెల 11 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. అదే రోజున ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల సరళి తమను మరింత దగ్గరకు చేరుస్తుందని విపక్షాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత…..

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో మహాకూటమి రూపుదిద్దుకుంది. అలాగే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో మాత్రం కూటమి ఏర్పాటు కాలేదు. మాయావతి మాత్రం లోక్ సభ ఎన్నికల్లో మహాకూటమి దిశగా అడుగులు వేస్తామని స్పష్టమైన సంకేతాలు పంపారు. అలాగే అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలోనే ఉన్నారు. మొత్తం 18 పార్టీలు ఇప్పటికే గ్రాండ్ అలయన్స్ లో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు సయితం బహిరంగంగానే చెబుతున్నారు.

బీజేపీయే ప్రధాన శత్రువా?

ప్రధానంగా ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ వైఖరి మాత్రం ఎటూ తేలకుండా ఉంది. ఆయన బీజేపీ, కాంగ్రెస్ లకు ఇప్పటివరకూ సమాన దూరం పాటిస్తూ వస్తున్నారు. కొన్ని అంశాల్లో పార్లమెంటులో బీజేపీకి మద్దతిచ్చారు. అయితే నవీన్ పట్నాయక్ ను మహాకూటమిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఇప్పటికే నవీన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మహాకూటమిలో చేరేందుకు నవీన్ అంగీకరించినట్లు చెబుతున్నారు.

ర్యాలీలోనే సత్తా చూపుతారా?

ఒడిశాలో ఇప్పుడు నవీన్ కు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీనే అయింది. కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో క్రమక్రమంగా బలహీన పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకే నవీన్ మొగ్గు చూపుతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. జనవరిలో కోల్ కత్తాలో మమత బెనర్జీ ఆధ్వర్యంలో జరగనున్న భారీ ర్యాలీకి విపక్ష నేతలందరినీ ఆహ్వానించాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ ర్యాలీ ద్వారానే మోదీ వ్యతిరేక కూటమి బలమేంటో చూపించాలన్నది వారి వ్యూహంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు అనుకూలత ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మరింత తొందరగానే గ్రాండ్ అలయన్స్ రూపుదిద్దుకునే అవకాశముంది. ఇప్పటికే మహాకూటమిలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, డీఎంకే, జేడీఎస్, తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ వంటి పార్టీలున్నాయి. వామపక్ష పార్టీలు మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నాయి. మరి గ్రాండ్ అలయన్స్ కు తొలి అడుగు ఈ నెల 11న పడే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*