నవీన్…ఎత్తు వేశారంటే….?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి అధికారం చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలనూ ముమ్మరం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు నవీన్ పట్నాయక్ పిలుపు నిచ్చారు. ఒడిశాలో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ఈసారి అధికారాన్ని చేజార్చుకోకూడదన్న లక్ష్యంతో ప్రజాకర్షణ పథకాలతో ముందుకు వెళుతున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే లాభమన్న అంచనాకు నవీన్ పట్నాయక్ వచ్చారు. అయితే ఈసారి ఖచ్చితంగా 120 స్థానాలను సాధించాలన్న ఒక లక్ష్యాన్ని బిజూజనదాదళ్ నిర్దేశించుకుంటున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.

మిషన్ 1320……

ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 శాసనసభ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో బిజూ జనతాదళ్ కు 117 స్థానాలు దక్కి పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. మామూలుగా అయితే లోక్ సభ తో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎప్పుడు ఏం నిర్ణయం వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దూకేందుకు నవీన్ పట్నాయక్ సిద్ధమయ్యారు. 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. 1997లో బిజూ జనతాదళ్ పార్టీని నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేశారు. మిషన్ 120 లక్ష్యంగా ఆయన సిద్ధమవుతున్నారు.

బీజేపీతోనే యుద్ధం…..

అయితే ఈసారి ఎన్నికలు అంత సులువుకాదన్న సంగతి ఆయనకు తెలియంది కాదు. అందుకోసం ప్రజాకర్షక పథకాలను పెద్దయెత్తున ప్రవేశపెడుతున్నారు. నేరుగా ప్రజలను కలిసేందుకు ప్రజాదర్బార్ ను నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు నవీన్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. బిజు కల్యాణ, బిజూ ఆరోగ్య, ఖుషీ, బిజూ కార్మిక సంక్షేమం, ఆహార హామీ, సునేత్ర వంటి పథకాలను ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు నవీన్. ఆ పథకాలే తమకు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కారణమవుతాయని నవీన్ గట్టిగా విశ్వసిస్తున్నారు.

సగం మంది సిట్టింగ్ లకు….

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో పుంజుకుంటున్నాయి. ఇప్పటికే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ రెండో స్థానంలో నిలవడంతో పోటీ బీజేపీ, బిజూ జనతాదళ్ మధ్యనే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో ఈసారి టిక్కెట్ల విషయంలో కూడా నవీన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. చాలావరకు సిట్టింగ్ లను మారుస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా యువకులకు, మహిళలకు ఈసారి టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని, ఈ మేరకే తనకున్న సమాచారం ప్రకారం అభ్యర్థుల ఎంపికను ఆయన దాదాపుగా పూర్తి చేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో దాదాపు సగం మందికి సిట్టింగ్ లకు సీట్లు రావన్న ప్రచారం జరుగుతోంది. మరి నవీన్ అభ్యర్థులను మార్చడం, ప్రజాకర్షక పథకాలను వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*