బాబు..భలే ప్లాన్…. జగన్ కు సీన్ సితారేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యూహాలన్నింటినీ అమలు పరుస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని, గత మూడు నెలల నుంచి ఉన్న ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు అన్ని దారులూ అన్వేషిస్తున్నారు. అందుకే తన పుట్టినరోజు నాడు పన్నెండు గంటల పాటు నిరాహారదీక్ష చేసిన చంద్రబాబు నిన్న తిరుపతిలో ధర్మపోరాట దీక్షకు దిగారు. ఇది అంతంకాదు ఆరంభంమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను తమపైన పడకుండా ఉండేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఎంపీ నియోజకవర్గానికి పదివేల మంది…..

ఇందుకోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పదివేల మంది ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేశారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఎంపిక చేసిన కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ శిక్షణ అంతా గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా బీజేపీ రాష్ట్రానికి చేసిన మోసాన్ని కూడా కార్యకర్తలకు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో వారికి దీనిపై పూర్తి అవగాహన కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో ఏ ఏ అంశాలను పొందుపర్చారు? ఏఏ హామీలు ఇచ్చారు? వాటిలో ఏవి అమలుపర్చారు? ఎందుకు ఇవ్వలేదన్న దానిపై కార్యకర్తలకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారు.

ప్రతి గ్రామంలో సమావేశాలు….

వీరు శిక్షణ పూర్తయిన తర్వాత గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి గ్రామానికి ఇద్దరు కార్యకర్తలు వెళ్లి అక్కడ గ్రామస్థులతో సమావేశమై అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు మోడీ చేసిన అన్యాయాన్ని కూడా వివరించాల్సి ఉంటుంది. రాజధాని నిర్మాణంపై జరుగుతున్న జాప్యాన్ని కూడా గ్రామాల్లో వీరు వివరించనున్నారు. ప్రధానంగా వైసీపీ, బీజేపీ లోపాయికారీ ఒప్పందాలను కూడా కార్యకర్తలు ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి జగన్ బీజేపీకి ఎలా దగ్గరయిందీ వీరు ప్రజలకు చెప్పనున్నారు.

మోడీ, జగన్ లు టార్గెట్…..

ఇలా కేవలం తాను సభల్లో చెప్పడమే కాకుండా గ్రామస్థాయిలో సమావేశాల ద్వారా అక్కడి స్థానిక నాయకత్వం చేతనే చెప్పించాలన్నది చంద్రబాబు వ్యూహం. రాష్ట్రం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు పర్చడం, పింఛన్లు సకాలంలో చెల్లించడం వంటివి కూడా వీరు ప్రజల వద్ద ప్రస్తావించనున్నారు. దీంతో పాటు జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని, రాజధానిని కూడా మార్చే అవకాశం ఉందని కూడా ప్రజలకు చెప్పనున్నారు. ఇలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ప్రజల్లోకి బలంగా ఈ అంశాలను తీసుకెళ్లడానికి సుశిక్షితులైన కార్యకర్తలను ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరికి త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*