నితీష్ కూడా ముందస్తేనా?

బీహార్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే సమయంలో బీజేపీ మిత్రపక్షాలు ఒక్కొక్కటీ దూరమవుతున్నాయి. నమ్మకమైన మిత్రుడని భావించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేశారు. తమ పార్టీకి 25 సీట్లు ఇస్తే ఒకే అని, అంతకంటే ఒక్క సీటు తగ్గినా తాము తమ దారి చూసుకోక తప్పదని కమలనాధులకు హెచ్చరికలు పంపారు.

ఒంటరిపోరుకు…..

బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 లోక్ సభ స్థానాలుండగా జనతాదళ్ (యు) 25 సీట్లు అడుగుతుంది. 2014 లోక్ సభ ఎన్నికలకంటే ముందు జరిగిన ఎన్నికల్లో ఇదే రీతిలో బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. అదే పద్థతిన తమకు ఈసారి సీట్లు కేటాయించాలని జేడీయూ కోరుతుండగా బీజేపీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. బీజేపీ మాత్రం జేడీయూకు కేవలం 12 సీట్లను మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఇది కుదిరే పని కాదని నితీష్ కుమార్ ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం…?

ప్రస్తుతం బీహార్ లో బీజేపీ మద్దతుతోనే నితీష్ కుమార్ ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ బీజేపీతో జత కట్టింది. లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకానికి ఒప్పుకోకుంటే బీజేపీ మద్దతు ఉపసంహరించుకునే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. నితీష్ కూడా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అదే జరిగితే లోక్ సభ ఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతుంది.

ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ మహాకూటమిగా ఏర్పడి బీజేపీని మట్టి కరిపించాయి. ఈసారి ఆర్జేడీ నితీష్ కుమార్ ను తమతో కలుపుకునేందుకు సిద్ధంగా లేదు. కాంగ్రెస్ ఒకింత నితీష్ కుమార్ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ బలంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ మాత్రం నితీష్ తో పొత్తుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో బీహార్ లో చతుర్ముఖ పోటీ ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. అదే జరిగితే ఎవరికి లాభం? అన్న లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తం మీద బీహార్ లో నితీష్ విడిపోతే బీజేపీకి కొంత ఇబ్బందేనన్నది విశ్లేషకుల అంచనా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*