గులాబీలో క‌విత క‌ల్లోలం..

ఇందూరు గులాబీలో ఎంపీ క‌విత తీరు క‌ల్లోలం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు కావడంతో ఆమె ముందు ఎవ‌రూ నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితి. జిల్లా ఎమ్మెల్యేలు క‌నీసం త‌మ అభిప్రాయం కూడా చెప్పుకునేందుకు అవ‌కాశం లేద‌నే గుస‌గుస‌లు. పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు డీఎస్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు లేఖ రాయ‌డంతో మొద‌లైన స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన‌, ఉమ్మ‌డి రాష్ట్ర ఏపీ పీసీసీ హోదాలో త‌న చేతుల‌మీదుగా 294మందికి టికెట్లు కేటాయించిన డీఎస్‌పైనే క‌విత ఆరోప‌ణ‌లు చేయ‌డం పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజానికి టీఆర్ఎస్ పార్టీలో త‌న‌కు ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌ని డీ శ్రీ‌నివాస్ ఊహించి ఉండ‌ర‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

జగిత్యాల నుంచే పోటీ చేస్తారా….

అయితే.. నిజామాబాద్ పార్ల‌మెంటు స్థానానికి ప్రాథినిత్యం వ‌హిస్తున్న క‌విత డీఎస్ విష‌యంలో ఎందుకిలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం డీఎస్ చిన్న‌కుమారుడు అర‌వింద్ బీజేపీలో కొన‌సాగుతున్నారు. క‌విత్ టార్గెట్‌గా ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కొడుకును కంట్రోల్ చేయ‌డంలో డీఎస్ విఫ‌లం చెందార‌న్న ఆగ్ర‌హంలో క‌విత ఉన్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. అంతేగాకుండా.. పార్టీలో త‌న‌కు, త‌న అనుచ‌ర వ‌ర్గానికి స‌ముచిత స్థానం ద‌క్క‌డం లేద‌ని డీఎస్ చాలా రోజులుగా గుర్రుగా ఉంటున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌విత‌, డీఎస్‌ల మ‌ధ్య విభేదాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇది కాకుండా.. క‌విత మ‌రో ప్లాన్ వేస్తున్నార‌నే టాక్ కూడా పార్టీ వ‌ర్గాల్లో వినిపిప్తోంది. అదేమిటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌విత జ‌గిత్యాల నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇది ఎప్ప‌టి నుంచో ఉంది.

ముందస్తే ప్లాన్ తోనే డీఎస్ కి చెక్…

ఇదే స‌మ‌యంలో నిజామాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి త‌న భ‌ర్తకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కోరుతున్నార‌ట‌. ఇందులో భాగంగానే.. ముంద‌స్తుగా డీఎస్ వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు క‌విత పావులు క‌దిపిన‌ట్లు తెలుస్తోంది. ఇక డీఎస్‌, కూతురు క‌విత‌ మ‌ధ్య సీఎం కేసీఆర్ న‌లిగిపోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి క‌విత లేఖ రాయ‌డానికి ఒక‌రోజు ముందే డీఎస్ కు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే, కేసీఆర్‌తో డీఎస్ భేటీ కాక‌ముందే… క‌విత అప్ప‌టిక‌ప్పుడు పార్టీ జిల్లా ఇన్‌చార్జి తుల ఉమ‌ను నిజామాబాద్‌కు పిలిపించుకుని విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి, డీఎస్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ముఖ్య‌మంత్రికి లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికీ ఈ విష‌యంలో స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. డీఎస్‌కు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు..అటు చ‌ర్యలు తీసుకోవ‌డం లేదు.

డీఎస్ ను కదిలిస్తే పార్టీకి నష్టమేనా..?

డీఎస్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి క‌వితే కార‌ణ‌మ‌ని కూడా పార్టీవ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి మ‌రోకార‌ణం కూడా ఉంది. డీఎస్‌పై ఎలాంటి చ‌ర్యలు తీసుకున్నా.. అది ఎన్నిక‌ల ముందు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న కార‌ణంతో కేసీఆర్ సైలెంట్‌గా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన డీఎస్‌ను క‌దిలిస్తే పార్టీకి న‌ష్ట‌మేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే క‌విత లేఖ రాయ‌డంతో పార్టీ ఇబ్బందుల్లో ప‌డింద‌ని కూడా పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*