అవిశ్వాసం చరిత్ర ఇదే….!

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు కీలకం. మంత్రి అయినా…ప్రధానమంత్రి అయినా పార్లమెంటు విశ్వాసాన్ని పొందాలి. చట్టసభకు జవాబుదారీగా ఉండాలి. ఈ ప్రక్రియలో పార్లమెంటు విశ్వాసాన్ని పొందలేకపోతే మరుక్షణం పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం పార్లమెంటు లో విశ్వాసం పొందిందా? లేదా? అన్న ప్రశ్నకు అది సభలో తగిన సంఖ్యాబలం కలిగి ఉండటమే మూలం. సాధారణంగా ప్రభుత్వం తనకు సభ్యుల మద్దతు ఉందని తెలియజేసేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. సంకీర్ణ ప్రభుత్వాలు ఈ ప్రక్రియను అనుసరిస్తాయి. కేంద్రంలో రాష్ట్రపతి నిర్దేశించిన సమయంలో ప్రధాని, రాష్ట్రాల్లో గవర్నర్ నిర్దేశించిన సమయంలో ముఖ్యమంత్రి సభలో బల నిరూపణ చేసుకోవాలి. దీన్ని విశ్వాస తీర్మానం అని పిలుస్తారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో తన బలం నిరూపించుకోలేక బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఓటింగ్ కు ముందుగానే వైదొలిగారు. విశ్వాస తీర్మానం సందర్భంగా బలం లేదని గ్రహించి రాజీనామా చేశారు. రెండోది అవిశ్వాస తీర్మానం. దీనిని విపక్షాలు ప్రవేశపెడతాయి. ఈ తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం సభలోని పదో వంతు మంది సభ్యుల మద్దతు అవసరం. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. తీర్మానం ప్రవేశపెట్టేందుకు టీడీపీకి తగిన బలం లేకపోవడంతో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల మద్దతు తీసుకుంది. చివరకు అవిశ్వాసం వీగిపోయింది.

ఎన్ని సార్లు పెట్టారంటే….?

భారత రాజకీయ చరిత్రలో అవిశ్వాస తీర్మానాలు అనేకం. ఇవి ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్దేశిస్తాయి. అవిశ్వాస తీర్మానాల చరిత్ర ఆసక్తికరం. నిజానికి రాజ్యాంగంలో విశ్వాస, అవిశ్వాస తీర్మానాల ప్రస్తావనే లేదు. కేంద్ర మంత్రి మండలి పార్లమెంటుకు, రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీకి బాధ్యత వహించాలని మాత్రమే 75వ అధికరణం పేర్కొంటోంది. లోక్ సభ రూల్ బుక్ లోని 198వ నిబంధనలో మాత్రం అవిశ్వాస తీర్మానం ప్రస్తావన ఉంది. ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పుడు ప్రతిపాదించిన అవిశ్వాసం 27వది. 1963లో తొలిసారి కేంద్రంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఆచార్య జేబీ కృపలానీ దీనిని ప్రతిపాదించారు. రెండుసార్లు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన, ఎదుర్కొన్న ఏకైక ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి. 1967లో ఆయన ఇందిరాగాంధీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంపై కూడా అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు అటల్ జీ. అవిశ్వాసం కారణంగా వాజ్ పేయి రెండు సార్లు పదవిని కోల్పోయారు. 1998లో, 1999లో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 1999లో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడం సంచలనం కలిగించింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగ్ ఉండేవారు. ఆయన అప్పటికి రెండు పదవుల్లో ఉన్నారు. అయినప్పటికీ లోక్ సభలో ఓటింగ్ లో ఆయనను అప్పటి స్పీకర్ జీఎంసీ బాలయోగి అనుమతించడంతో వాజ్ పేయి ప్రభుత్వం పడిపోయింది. 1979లో కూడా అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో అపజయం పాలైంది. అత్యధిక అవిశ్వాసాలను (15) ఎదుర్కొన్న ప్రధాని ఇందిరా గాంధీ. 1966 ఆగస్టు నుంచి 1975 మే వరకూ 12, 1981 మే నుంచి 1982 ఆగస్టు వరకూ మూడు అవిశ్వాసాలను ఎదుర్కొని ఆమె విజయం సాధించారు.

విశ్వాస తీర్మానంతో పదవిని కోల్పోయి……

పీవీ నరసింహారావు తన అయిదేళ్ల పదవీకాలంలో మూడు అవిశ్వాసాలను ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం 1993 జులైలో విపక్షాలు ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇందులో అతికష్టం మీద ఆయన గెలిచారు. 265-251 తేడాతో కనాకష్టంగా నెగ్గారు. అప్పట్లో ఆయన ఎంపీలను కొనుగోలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇది జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కుంభకోణానికి దారితీసింది. ఇంతకు ముందు 1989లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వీపీ సింగ్ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి పదవిని కోల్పోయారు. విశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధాని ఆయనే. పదేళ్ల పాటు పదవిలో ఉన్నప్పటికీ ఒకే ఒకసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని విజయం సాధించిన ప్రధాని మన్మోహన్ సింగ్. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం 27వది. ఒక ప్రాంతీయ పార్టీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. 325-126 ఓట్ల తేడాతో ఎన్డీఏ ప్రభుత్వం ఇందులో విజయం సాధించింది. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు ఈ అంశాన్ని వాడుకుంది. అవిశ్వాసం ఫలితం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టామన్న సంతృప్తి టీడీపీలో కనపడుతోంది. టీడీపీ ప్రచార హోరుకు అడ్డుకట్ట వేశామన్న భావనలో భారతీయ జనతా పార్టీ ఉంది. మొత్తానికి పదిహేనేళ్ల తర్వాత వచ్చిన అవిశ్వాసానికి ఒక్కరోజులోనే ముగింపు పలికింది మోదీ ప్రభుత్వం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్