దయచూపండి బాబులూ….!!!

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు రెండు జాతీయ పార్టీలకూ పెద్దగా పట్టులేదనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలు రెండు దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడే పరిస్థితికి వచ్చాయి. ఒకప్పుడు దక్షిణాదిన కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ రాను రాను అది చేజేతులా ప్రాంతీయ పార్టీలకు అప్పగించేసిందనే చెప్పాలి. తమిళనాడు నుంచి తెలంగాణ వరకూ ఇప్పుడు ఏ జాతీయ పార్టీకి కాలుమోపే పరిస్థితి లేదు. దీంతో అక్కడ వేళ్లూనుకుపోయి ఉన్న ప్రాంతీయ పార్టీలవైపు ఆశగా చూడటం తప్ప బీజేపీ, కాంగ్రెస్ లకు మరో దారి లేదు. కర్ణాటకను మినహాయిస్తే జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్ దక్షిణాదిన ఏ రాష్ట్రంలోనూ మ్యాజిక్ చేసే పరిస్థితి కన్పించడం లేదు.

డీఎంకేతో సఖ్యతగా ఉన్నా….

తమిళనాడులో చూసుకుంటే యాభై ఏళ్ల నుంచి అక్కడ జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అక్కడ డీఎంకే పైనే ఆశలు పెట్టుకుంది. డీఎంకే అధినేత స్టాలిన్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో పొత్తులు ఇక్కడ దాదాపుగా ఖాయమయినట్లే చెప్పాలి. ఈసారి తమిళనాడు లో డీఎంకే హవాసాగుతుందన్న సర్వేల నేపథ్యంలో కాంగ్రెస్ తమిళనాడుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ ఏ పార్టీ దానిని నమ్మే పరిస్థితి లేదు. నాయకత్వం లేని అన్నాడీఎంకేను అది ఇన్నాళ్లూ నమ్ముకుంది. కానీ లోక్ సభలో ఎన్ని సీట్లు అన్నాడీఎంకే సాధిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అన్నాడీఎంకేకు నాయకత్వ లేమి….

ఎందుకంటే అక్కడ కొత్త పార్టీలు పుట్టుకురావడంతో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారన్నది ఎవరికీ తెలియని పరిస్థితి. డీఎంకే బలంగాఉందనికన్పిస్తున్నప్పటికీ ఎన్నికల సమయానికి ప్రజలు దానిని ఆదరిస్తారన్న నమ్మకమూ లేదు. కరుణానిధి మరణం తర్వాత ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టే పరిస్థితి ఉందా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సొంతంగా ఈ రాష్ట్రంలో ఎదగడానికి కృషి చేస్తుంది. అది ఇప్పట్లో సాధ్యం కాదని తెలిసినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో పాగా వేద్దామని ప్లాన్ చేసుకుంటుంది. కానీ కాంగ్రెస్ ఆ పాటి ప్రయత్నమూ చేయకపోవడం విశేషం. కమల్ హాసన్,రజనీకాంత్ పార్టీలు జనాన్ని ప్రభావితం చేసే దాన్ని బట్టి ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్పకతప్పదు.

ఏపీ, తెలంగాణాల్లో…..

ఇక తెలంగాణాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రెండూ చతికలపడ్డాయి. పార్లమెంటు ఎన్నికల్లోనూ జాతీయ పార్టీలకు ఇదే పరిస్థితి ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలూ కాలుమోపే వీలులేదు. ఎన్నికల అనంతరం వైసీపీ, టీడీపీలతో ఈ రెండు పార్టీలు జతకట్టే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత కాంగ్రెస్ కు చేరువయ్యారు. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎవరికి మద్దతిస్తారన్న దానిపై స్పష్టత లేదు. కానీ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మద్దతిస్తామని జగన్ ఇప్పటికే చెప్పారు. ఇక కర్ణాటకలో మాత్రం రెండు జాతీయ పార్టీలూ బలంగానే ఉన్నాయి. మొత్తం మీద దక్షిణాదిన వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి జాతీయ పార్టీలు బలపడటానికి చోటే లేదన్న విషయం స్పష్టమైంది. ప్రాంతీయ పార్టీలు దయతలిస్తేనే ఇక్కడ వీరికి మనుగడ ఉంటుందన్నది సుస్పష్టం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*