అనూరాధకు ఆశా భంగం త‌ప్ప‌దా…?

no ticket to panchumarthi anuradha

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నిన్న ఉన్న ప‌రిస్థితి నేడు, నేడు ఉన్న ప‌రిస్థితి రేప‌టికి కూడా మారిపోయే రాజ‌కీయాలు నేడు ఏపీలో క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల్లోబ‌ల‌మైన శ‌క్తిగా ఉన్న‌నాయ‌కుల‌కే కాదు.. ఆర్థికంగా బలంగా ఉన్నామ‌ని చెప్పుకొంటున్న నాయ‌కులకు కూడా బీ ఫారం చేతికి అందేదాకా.. ఎన్నిక‌ల్లో టికెట్ గ్యారెంటీ అనే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అది అధికార టీడీపీకావొచ్చు, విప‌క్షం వైసీపీ కావొచ్చు. ఏదైనా కూడా అప్ప‌టికి ఉన్న ప‌రిస్థితులు, గెలుపు గుర్రాల‌కు మాత్రమే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఎప్పుడు ఎవ‌రు ఎక్క‌డ హీరో అవుతారో.. ఎవ‌రు జీరో అవుతారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఎమ్మెల్సీ ఇస్తామన్నా…..

తాజాగా విజ‌య‌వాడ కు చెందిన, బీసీ సామాజిక వ‌ర్గానికి చెంది న మ‌హిళా నాయ‌కురాలు.. విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ గా గ‌తంలో సేవ‌లు అందించిన టీడీపీ నాయ‌కురాలు పంచుమ‌ర్తి అనురాధ ప‌రిస్థితి కూడా ఇలానే త‌యారైంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఆమె చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే బీసీ కోటాలో త‌న‌కుఎమ్మెల్యే టికెట్ ల‌భిస్తుంద‌ని ఆమె అనుకున్నారు. అయితే, ఆమె చేసిన ప్ర‌య‌త్నాలు చివ‌రినిముషంలో ఫ‌లించ‌లేదు. దీంతో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ప్ర‌ధాన కార్య‌దర్శి, అధికార ప్ర‌తినిధి ప‌ద‌వుల‌తో చంద్ర‌బాబు ఆమెను బుజ్జ‌గించారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ ఇస్తామ‌న్నా ఆమె తిర‌స్క‌రించారు. కాగా, ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఆశ పెట్టుకున్న పంచుమ‌ర్తి.. త‌ర‌చుగా ప్ర‌తిప‌క్షంపై నిప్పులు చెరుగుతున్నారు.

మంగళగిరిపై ఆశలు….

మీడియా చ‌ర్చ‌ల్లోనూ ఆమె త‌న గ‌ళాన్ని బ‌లంగానే వినిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై ఆమె ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గానికి చెందిన వారు ఎక్కువ‌గా ఉన్నార‌ని, క‌నుక త‌న గెలుపు ఖాయ‌మ‌ని ఆమె భావిస్తూ వ‌చ్చారు. అయితే, తాజాగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కాండ్రు క‌మ‌ల‌.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇప్పుడు అనూరాధ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టే అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా చూసుకున్నా.. ఆర్థికంగా చూసుకున్నా.. కుటుంబ బలాన్ని బేరీజు వేసుకున్నా కూడా అనూరాధ క‌న్నా కూడా కాండ్రు క‌మ‌లే రెండు మెట్లు పైస్థాయిలో ఉన్నార‌ని అంటున్నారు.

అందుకే ఆమెకు సీటు….

అంతే కాకుండా ఆమె గ‌తంలో మంగ‌ళ‌గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. స్థానికంగా ఉన్న ఆమె వియ్యంకుడు మ‌రుగుడు హ‌నుమంత‌రావు గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వీరికి బంధుత్వాలు ఎక్కువ‌. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ క‌మ‌ల‌కే సీటు ఇవ్వాల‌ని బాబు సైతం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే తెలుస్తోంది. అదే జ‌రిగితే ఇక్క‌డ సీటు రేసులో ఉన్న అనూరాధ‌కు షాక్ త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం విన‌ప‌డుతోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం పంచుమ‌ర్తికి మ‌రోసారి ఆశాభంగం త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*