‘‘ఉత్తర’’లో గజమాల ఎవరికో…?

ఏపీ వాణిజ్య రాజ‌ధాని.. విశాఖ‌లో రాజ‌కీయం వేడెక్కింది. ముఖ్యంగా ఇక్క‌డి ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కోసం పోటా పోటీ రాజ‌కీయం న‌డుస్తోంది. ఈ టికెట్‌ను ఒడిసి ప‌ట్టేందుకు రెండు ప్ర‌ధాన పార్టీల్లోనూ నేత‌లు నువ్వా-నేనా అనే రేంజ్‌లో పోటీ ప‌డుతున్నారు. ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గం మారుతార‌నే ప్ర‌చారం సాగుతోంది. పోనీ.. ఆయ‌న అక్క‌డి నుంచే పోటీ చేసినా.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న చూపించిన ధీటైన పోటీ మాత్రం ఇవ్వ‌లేర‌నేది వాస్త‌వం. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టీడీపీ, జ‌న‌సేనల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ల‌భించింది. అయితే, ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదా విష‌యంలో విభేదించ‌డంతో ఈ మూడు పార్టీలూ వేటిక‌వే వాటి దారులు చూసుకున్నాయి. చివ‌రి క్ష‌ణంలో ఆయ‌న పార్టీ మారినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

ఇక్కడ అభ్యర్థి ఎవరు?

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి నాలుగు పార్టీలూ కాంగ్రెస్ కూడా క‌లిస్తే.. ఐదు పార్టీలు వేటిక‌వే అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టేందుకు రెడీ అవుతున్నాయి. అయితే, ప్ర‌ధానంగా టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన నేత‌ల మ‌ధ్యే పోటీ తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు ఇక్క‌డి విశ్లేష‌కులు. అది కూడా వైసీపీ, టీడీపీల మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని చెబుతున్నా రు. నిజానికి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. స్థానికంగా ఉన్న నాయకులు కూడా అంతో ఇంతో బలమున్నవారే! బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఉత్తర నియోజవ ర్గానికి టీడీపీ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న తలెత్తింది.

చంద్రబాబును మేనేజ్ చేసి…..

ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన విష్ణుకుమార్ రాజు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మేనేజ్ చేసి ఈ నియోజ‌క‌వ‌ర్గానికి టీడీపీ క‌న్వీన‌ర్‌గా ఎవ‌రిని నియ‌మించ‌కుండా చ‌క్రం తిప్పార‌న్న టాక్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ టిక్కెట్‌పై టీడీపీకి చెందిన నలుగురు నేతలు ఆశపెట్టుకున్నారు. ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు, యల మంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో రమేష్‌బాబు విశాఖ ఉత్తర స్థానం టిక్కెట్‌నే కావాలని అడిగారు. అయితే అప్ప‌ట్లో ఈ టికెట్‌ను విష్ణుకుమార్ రాజుకు కేటాయించ‌డంతో.. ఆయ‌న‌ను య‌ల‌మంచిలికి పంపారు.

యలమంచలి ఎమ్మెల్యే……

ఇప్పుడు గతంలో మాదిరిగా రాజకీయ ఆబ్లిగేషన్లు లేవు కాబట్టి.. తనకే ఉత్తరం సీటు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఇదే స్థానం నుంచి మాజీ ఎంపీ ఇంకా టీడీపీలో చేర‌ని సబ్బం హరి కూడా పోటీచేసేందుకు సిద్ధమవుతున్న ట్లు స‌మాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. మ‌రోప‌క్క‌, ఎప్పటినుంచో టీడీపీలో కొనసాగుతున్న స్వాతి ప్రమోటర్స్ అధినేత కృష్ణారెడ్డి కూడా విశాఖ ఉత్తరం సీటుపై కన్నేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ కూడా మొదలుపెట్టారు. అంతేకాదు- ఈ మధ్యనే రైల్వేజోన్ కోసం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి ఉత్తర నియోజకవర్గం అంతా పాదయాత్ర చేశారు.

అనేక మంది క్యూలో….

ఇక మాజీ కార్పొరేటర్, సీనియర్‌ నేత పైలా ముత్యాలనాయుడు సైతం ఈ సీటుని టార్గెట్‌ చేసుకున్నారట. ఇటీవల జరిగిన ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీలో ఆయన తన మనసులో మాట చెప్పారు. తనకు ఈ సీటు ఇచ్చే పక్షంలో ఎంత ఖర్చుచేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ సీటు తనకే కావాలని గట్టిగా కోరారు కూడా. ఇక అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి టీడీపీలో చేరితే ఆయ‌న ఇక్క‌డ లేదా మాడుగుల నుంచి పోటీ చేయ‌వ‌చ్చ‌ని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీలో గట్టి పోటీయే మొదలైంది.

బలమైన సామాజిక వర్గాలివే…..

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రధానంగా కాపు, వెలమ, రెడ్డి, రాజు సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. దీంతో అవసరమైన మద్దతు కూడగట్టడం కోసం ఇప్పటినుంచే ఎవరికి వారు ప్రయత్నాలు షురూ చేశారు. పైలా ముత్యాలనాయుడు అయ్యన్న వర్గీయుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఉత్తర టిక్కెట్‌ని ఆశిస్తున్నా అవకాశాలు అంతంత మాత్రమే అని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ టికెట్‌.. ఒక రాధా.. న‌లుగురు కృష్ణులు చందంగా మారిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*