ఇక అంతా ఇప్పుడు ఏసీబీ చేతిలోనేనా?

ఓటుకు నోటు కేసు వ్యవహారం ప్రస్తుతం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశం రావడంతోనే… ఓటుకు నోటు కేసు పై ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. అంతే మరోసారి హాట్ టాపిక్ అయింది. కేసు పురోగతి పైన ఆరాతీసారు సీఎం. దోషులు విషయంలో కఠినంగా విచారించాల్సి దేనని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు కేసీఆర్. ఇంకా ఇదిలా ఉంటే కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రం ప్రధాని మోడీ తో కలిసి కేసిఆర్ ఆడుతున్న డ్రామాగా పేర్కొన్నారు.

అన్నీ పకడ్బందీగా ఉన్నాయంటూ….

ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ తిరగదోడుతున్నారా?… సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు పురోగతిని సుప్రీంకోర్టుకు నివేదించేందుకు సమీక్షించారా?… ప్రధాని మోదీతో లోలోపల చేతులు కలిపి కేసును తెరపైకి తెచ్చారా? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో … ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ… 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఈ కేసులో రేవంత్ రెడ్డి 16 రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. తర్వాత కాలంలో కేసు అటకెక్కిందనే వాదనలు వినవచ్చాయి. పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

అకస్మాత్తుగా రివ్యూ చేయడంపై….

అకస్మాత్తుగా ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో ఓటుకు నోటు కేసు పై ఆరా తీయడం… కేసు పురోగతిని పరిశీలించడం సంచలనంగా మారింది. కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విషయంలో పోలీస్ అధికారులు తమ పని తాము చేసుకోవాలని సూచన చేశారు సీఎం. దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సాక్ష్యాలను కోర్టుకు చేర్చాలని, ఎంతటి వారున్నా భయపడాల్సిన పనిలేదు అంటూ పోలీస్ అధికారులను ఆదేశించారు.

కుట్రకోణం ఉందా?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుకు నోటు కేసు ను మరోసారి తెరపైకి తీసుకురావడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో రహస్యంగా చేతులు కలిపి… ఇప్పుడు ఈ కేసును తెరపైకి తెచ్చారని రేవంత్ చెబుతున్నారు. అయితే ఇతర కేసుల విషయంలో ఇదే విధంగా వివరించకుండా… టిఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు రేవంత్ రెడ్డి. ఆయన బంధువులు తప్పులు చేసిన కేసులను రద్దు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్. ఇక మరోవైపు జెరుసలేము మత్తయ్య కూడా కేసులోని వారందరిపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది అని అన్నారు. కేటిఆర్ డ్రైవర్ తనను అప్రూవర్ గా మారాలని కోరారని ఆరోపించారు మత్తయ్య. దీంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చినట్టయింది.మొత్తానికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఓటుకు నోటు కేసు రాజకీయ వర్గాల్లో మరోసారి ప్రకంపనలను సృష్టిస్తోంది. కేసులో అనేకమంది ప్రమేయం ఉన్నట్లుగా ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఉన్న పేర్లు కాకుండా కొత్త పేర్లు ఏమన్నా బయటకు వస్తాయా? … గతంలో ఉన్న దోషులతోనే కేసు కొనసాగుతుందా?.. కేసు ఏవిధంగా మలుపు తిరగబోతోందని ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. రెండు మూడు రోజుల్లోనే ఏసీబీ  అధికారులు ఈ కేసు విష‍యంలో కీలక నిర్ణ‍యం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*