చిత్రం….చైనాలో…విచిత్రం….!

చైనా ఆసియాలో అగ్రరాజ్యం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ హోదా కోసం పరితపిస్తున్న దేశమిది. అమెరికాను సవాల్ చేస్తున్న ప్రపంచంలోని ఏకైక దేశం చైనా. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం కూడా చైనానే కావడం విశేషం. 130 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో ముందంజలో ఉంది. దాని తర్వాత స్థానం భారత్ దే. సాధారణంగా ఎక్కువ మంది జనాభా ఉన్న నేటి రోజుల్లో పెద్ద సమస్య కాదు. అధిక జనాభాను మానవ వనరులుగా మలచుకుని ఉత్పాదకత వైపు మళ్లిస్తే మంచి ఫలితాలు సమకూరుతాయి. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న సరళీకృత పారిశ్రామిక, ఆర్థిక విధానాల ఫలితంగా ఏదో ఒక స్థాయిలో ఉపాధి దొరకడం కష్టమేమీ కాదు. నైపుణ్యాలు ఉంటే ఇక తిరుగేలేదు.

చిత్రమైన సమస్యతో……

కానీ చైనా పరిస్థితి ఇందుకు భిన్నం. అది చిత్రమైన సమస్యతో సతమతమవుతోంది. ఆర్థికంగా, సైనికంగా బలోపేతమవుతున్న బీజింగ్ స్వదేశంలో నానాటికీ పెరుగుతున్న వృద్ధుల సమస్యతో అల్లాడిపోతోంది. జననాల రేటు తగ్గడం, ఆధునికవైద్య సౌకర్యాల ఫలితంగా ప్రజల ఆయుర్దాయం పెరిగడం, జీవన ప్రమాణాలు పెరగడంతో దేశంలో వృద్ధుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజా అధ్యయనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల మంది వృద్ధులు ఉన్నట్లు అంచనా. వీరిలో నాలుగో వంతు మంది అంటే 26 కోట్ల మంది ఒక్క చైనా దేశంలోనే ఉండటం గమనార్హం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 60 సంవత్సరాలు దాటిన వారిని వృద్ధులుగా పరిగణిస్తారు. ఏదైనా ఒక దేశంలో వృద్ధుల సంఖ్య ఆ దేశ జనాభాలో పది శాతం వరకూ ఉంటే ఆ దేశంలో ‘‘వృద్ధ సమాజం’’ పెరుగుతున్నట్లు భావిస్తారు. చైనాలో వృద్ధుల సంఖ్య 24.1 కోట్లు. ఆదేశ పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు వృద్ధుల జనాభా 17.3 శాతం. ఏటా పెరుగుతున్న వృద్ధుల శాతం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది.

ఇదో వింత సమస్య……

వృద్ధుల జనాభా పెరుగుదల రెండు సరికొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఏటా వృద్ధులు పెరుగుతున్నందున శ్రామికుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపుతోంది. మరోపక్క వృద్ధులందరికీ పింఛన్లు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించడం కూడా ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఇందుకోసం ఏటా లక్షల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఆదాయానికి, ఖర్చకూ విపరీతమైన అంతరం ఏర్పడుతోంది. దీనిని ఎలా భర్తీ చేయాలన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. 2050 నాటికి చైనాలో వృద్ధుల సంఖ్య 48.7 కోట్లకే చేరుకుంటుందని అంచనా. ఇది జనాభాలో 34.9 శాతానికి సమానం.

రెండో బిడ్డను కన్నా……

వృద్ధుల జనాభా పెరగడంతో పాటు జననాల రేటు తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికిప్పుడు దేశం తన జనాభా, విధానాన్ని మార్చుకుని జననాల రేటును ప్రోత్సహించినా పెద్దగాఫలితం ఉండదని ‘‘రెన్మిన్’’ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా అధ్యయన విభాగం ఛైర్మన్ జహై జన్యూ వివరించారు. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం దేశంలో1979లో సగటు ఆయుర్దాయం 66 సంవత్సరాలు. 2016 నాటికి ఇది 76 సంవత్సరాలకు పెరగడం గమనార్హం. మున్ముందు ఇది మరింత పెరగవచ్చని అంచనా. వృద్ధుల సంఖ్య పెరగడం, జననాల సంఖ్య తగ్గడంతో 2016 నుంచి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. 2016 నుంచి ‘‘వన్ ఛైల్డ్’’ విధానాన్ని సడలించింది. అయితే జీవన వ్యయం పెరగడంతో రెండో బిడ్డను కనేందుకు దంపతులు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు పభుత్వం సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. రెండో బిడ్డను కనని 40 సంవత్సరాల లోపు వయస్సుగల ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఆ మొత్తంతో వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దంపతులు రెండో బిడ్డ కనేవరకూ జీతాల్లో కోత విధిస్తూనే ఉండాలని, రెండో బిడ్డను కన్న తర్వాత రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. మరోపక్క రెండో బిడ్డకు జన్మనిచ్చిన దంపతుల నుంచి సోషల్ మెయింటెనెన్స్ పేరుతో పన్నులు వసూలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా రూ. 25 వేల కోట్ల రూపాయల మేరకు పన్నులు వసూలు చేసినట్లు అంచనా. ఇలా ప్రభుత్వ ద్వంద విధానాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్నారు.

లక్షల కోట్లు పెట్టలేక….

వృద్ధులకు పింఛన్లు, ఇతర ఆర్థిక, వైద్య సౌకర్యాలను కల్పించడం ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం పింఛన్ ఇతర ఖర్చుల కోసం 2016లో దేశ వ్యాప్తంగా 28.5 లక్షల కోట్లు (2.58 ట్రిలియన్ యువాన్లు) ఖర్చు చేసింది. ఈలోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం 4.36 లక్షల కోట్లను సమకూర్చింది. చైనా కరెన్సీలో చెప్పాలంటే 429.1 ట్రిలియన్ యువాన్లు. 2020 నాటికి ఈ మొత్తం 9 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిని చైనా ఎదుర్కొంటోంది. జనాభాను పెంచడమా? తగ్గించడమా? అన్నది తేల్చుకోలేక పోతోంది. జనాభాను పెంచినా వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టమవుతుంది. తగ్గిస్తే నవతరం తగ్గి వృద్థతరం పెరుగుతుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం, సమతుల్యం సాధించలేక ప్రస్తుతం చైనా నాయకత్వం సతమతమవుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*