మళ్ళీ తెరపైకి గరుడ పురాణం ..!!

అప్పుడెప్పుడో ఆపరేషన్ గరుడా అంటూ సినీ నటుడు శివాజీ నానాగగ్గోలు పెట్టారు. అందులో జగన్, పవన్ ఉండవల్లి వంటివారంతా పాత్రధారులంటూ నా నా యాగీ చేశారు. వీరికి కేంద్రం వేలకోట్ల రూపాయలు స్పాన్సర్ చేస్తుందంటూ ఆరోపించారు. ఇదంతా చంద్రబాబు పై కేంద్రం కుట్ర కోణం అని గందరగోళం చేసేసారు. బాబు పై కేసులు జైలు అంటూ జోస్యం చెప్పారు. అదిగో అవిశ్వాసం ఫలానా రోజు కేంద్రం అంగీకరిస్తుందని నోటికొచ్చింది అంతా గ్రాఫ్ లు గీసి మరి ప్రజలను తప్పుదోవ పట్టించారు. యాధావిధిగా ఆయన గోలకు టిడిపి మీడియా విస్తృత ప్రచారం అనుకున్నట్లే కల్పించింది. కానీ నటుడు శివాజీ చెప్పినవన్నీ బోగస్ గా తరువాత రోజుల్లో తేలిపోయింది . ఇదంతా టిడిపి నుంచి జనసేన విడిపోవడం ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చాకా జరిగిన తతంగం. ఇప్పుడు మళ్ళీ అదే గోల మొదలైంది.

అటు శివాజీ ఇటు టిడిపి …

ఏపీలో తిరిగి అయోమయం రాజకీయాలకు తెరలేచింది. దీనికి శివాజీ తెరతీశారు. దాన్ని సమర్ధిస్తూ టిడిపి నేతలు యనమల రామకృష్ణుడు నుంచి వర్ల రామయ్య వరకు అంతా గొంతు చించుకుని తమ ఆందోళన మొదలు పెట్టేశారు. అదిగో ఆపరేషన్ గరుడ. చంద్రబాబుకు సోమవారం నోటీసులు అందనున్నాయి. ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది అంటూ అంతా ఆరోపించారు. రొటీన్ గా టిడిపి మీడియా తెలంగాణ ఎన్నికల వేడి తో సమానం గా ఈ ఆరోణలను ప్రముఖంగా ప్రచారం కల్పించింది.

పోలవరం ఫైల్ ఓపెన్ చేశారా …?

ఎపి లో ఇసుక నుంచి పోలవరం, అమరావతి వ్యవహారాలు వరకు అనేక అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారాయి. దీనిపై విపక్షాలు, ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసినా ఎన్డీయే లో బాబు భాగస్వామిగా ఉండటంతో ఆయనపై ఈగ వాలలేదు. ఆయన బిజెపి తో తెగతెంపులు చేసుకుని రాజకీయంగా లబ్ది పొందే ప్రక్రియలో భాగంగా కేంద్రంపై యుద్ధం ప్రారంభించారు. అప్పటినుంచి బిజెపి గతంలో విపక్షాలు చేసిన అన్ని ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తుతూ వస్తుంది. వారు చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణలు జరగకపోవడంతో ప్రజలు ఇదంతా బిజెపి, టిడిపి రాజకీయ క్రీడగానే భావిస్తూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో ఇటీవలే పోలవరం అధారిటీ అక్కడి పనులపై తనిఖీ చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తేల్చింది. దాంతో ఒక్కసారిగా టిడిపి అలెర్ట్ అయ్యింది. తమపై కేంద్రం కక్ష సాధింపు మొదలు పెట్టేసిందనే అనుమానం వారిలో మొదలయ్యింది. ఫలితం ఆపరేషన్ గరుడ మరోసారి తెరపైకి తెచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎపి లో ఏమి జరగబోతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*