విద్యార్థి నేత‌ల‌కు మొండి ‘చెయ్యి’ ..?

తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి పోరాడింది ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం విద్యార్థులు. విద్యార్థి సంఘాల‌న్నీ క‌లిసి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీగా ఏర్ప‌డి ఉద్య‌మాన్ని న‌డిపించారు. తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల్లో ఉద్యమం ప‌ట్ల చైత‌న్యం నింపారు. దీంతో తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉస్మానియా విద్యార్థుల‌కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క‌పాత్ర పోషించిన విద్యార్థి నేత‌లు ప్ర‌జా జీవితంలోకి రావాల‌ని ఆశ ప‌డుతున్నారు. అయితే, తెలంగాణ ఏర్ప‌డే నాటికి విద్యార్థి నేత‌లు కొంద‌రు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోగా కొంద‌రు కాంగ్రెస్ గూటికి చేరారు. గ‌త ఎన్నిక‌ల్లోనే విద్యార్థి నేత‌లు ఆయా పార్టీల‌ను టిక్కెట్లు అడిగారు. దీంతో టీఆర్ఎస్ 2014లోనే టీఆర్ఎస్వీ అధ్య‌క్షుడిగా అప్ప‌టివ‌ర‌కు ప‌నిచేసిన బాల్క సుమ‌న్ ను పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంటు స్థానానికి పోటీచేయించింది. ఇక మ‌రో నేత గాదారి కిషోర్ కు న‌ల్గొండ జిల్లాలోని తుంగ‌తుర్తి స్థానాన్ని కేటాయించింది. వీరిద్ద‌రూ విజ‌యం సాధించారు. ఇక మ‌రో నేత పిడ‌మ‌ర్తి ర‌వికి ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి స్థానాన్ని కేటాయించినా జిల్లాలో టీఆర్ఎస్ ప్ర‌భావం జిల్లాలో త‌క్కువగా ఉండ‌టంతో ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు.

టీఆర్ఎస్ లో కొంద‌రికి గుర్తింపు…

ఇక ఈ ఎన్నిక‌ల్లో ప‌లువురు విద్యార్థి నేత‌లు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే, టీఎర్ఎస్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గాదారి కిషోర్ కి మ‌ళ్లీ టిక్కెట్ కేటాయించింది. ఇక బాల్క సుమ‌న్ ను చెన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తుంది. పిడ‌మ‌ర్తి ర‌వికి మ‌ళ్లీ స‌త్తుప‌ల్లి టిక్కెట్ ఇచ్చారు. ఈ స్థానాల్లో పోటీ తీవ్రంగానే ఉన్నా టీఆర్ఎస్ వీరికి టిక్కెట్లు ఇచ్చింది. ఇక మ‌రో విద్యార్థి నేత‌, మొద‌టి నుంచి టీఆర్ఎస్ లో న‌మ్మ‌కంగా ప‌నిచేస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ కి మాత్రం గ‌త ఎన్నిక‌ల్లో తీవ్రంగా ప్ర‌య‌త్నించినా టిక్కెట్ ద‌క్క‌లేదు. ఈ ఎన్నిక‌ల్లోనూ జ‌హిరాబాద్ స్థానాన్ని ఆయ‌న ఆశించినా ఇవ్వ‌లేదు. ఆయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వి మాత్రం ద‌క్కింది. మొత్తానికి టీఆర్ఎస్ విద్యార్థి నేత‌ల‌కు కొంత గుర్తింపు ఇచ్చింది.

గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చి తీసుకున్న కాంగ్రెస్‌

విద్యార్థి నేత‌లు టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలోకి కూడా చాలా మంది చేరారు. 2014లో కొంద‌రు చేర‌గా ఇటీవ‌ల రేవంత్ రెడ్డితో క‌లిసి మ‌రికొంద‌రు ఓయూ నేత‌లు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. వీరు పార్టీ టిక్కెట్లపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో పార్టీ అధినేత రాహుల్ గాంధీని వీరు ప్ర‌త్యేకంగా క‌లిశారు. ఉద్య‌మంలో కీల‌కంగా ప‌నిచేసిన విద్యార్థి నేత‌ల‌ను గుర్తించి టిక్కెట్లు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, ఆయ‌న వీరికి హామీ ఇచ్చార‌ని తెలుస్తోంది. త‌మ పోరాటాన్ని, త్యాగాల‌ను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ త‌మ‌కు క‌చ్చితంగా టిక్కెట్లు ఇస్తుంద‌ని కాంగ్రెస్ లోని విద్యార్థులంతా న‌మ్మ‌కంగా ఉన్నారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లోనే విద్యార్థి నేత‌ల‌కు మొద‌ట రెండు టిక్కెట్లు ప్ర‌క‌టించిన పార్టీ త‌ర్వాత వెన‌క్కు తీసుకుంది. ఈసారి అలా జ‌ర‌గ‌కుండా తమ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు.

ఒక్క స్థాన‌మే అంటున్న పెద్ద‌లు..?

ఓయూ జేఏసీలో కీల‌కంగా ప‌నిచేసిన ద‌రువు ఎల్ల‌న్న ధ‌ర్మ‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే అక్క‌డ మ‌రో నేత ల‌క్ష్మ‌ణ్ కుమార్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. కంటోన్మెంట్ నుంచి క్రిషాంక్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చాలా రోజులుగా ప‌నిచేసుకుంటున్నారు. అయితే, స్వ‌యంగా ఆయ‌న మామ స‌ర్వే స‌త్యానారాయ‌ణే ఇక్క‌డి నుంచి పోటీ చేస్తార‌ని అంటున్నారు. మ‌రికొంద‌రు నేత‌లు కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. క్రిషాంక్ కి గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్ ప్ర‌క‌టించి మ‌ళ్లీ వెన‌క్కుతీసుకుంది కాంగ్రెస్‌. రేవంత్ రెడ్డి వ‌ర్గానికి చెందిన రాజారాం యాద‌వ్ బాల్కొండ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇదే స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే ఇరావ‌త్రి అనీల్ కూడా కోరుతున్నారు. ఇక మొద‌టినుంచి ఎన్.ఎస్.యూ.ఐ నేత‌గా ఉన్న మాన‌వ‌తారాయ్ ఖ‌మ్మం జిల్లాలో టిక్కెట్ ఆశిస్తున్నారు. జ‌న‌గామ బాల‌ల‌క్ష్మీ టిక్కెట్ ఆశించినా అక్క‌డ సీనియ‌ర్ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య ఉన్నారు. వీరితో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా టిక్కెట్ల రేసులో ఉన్నారు. త‌మ‌కు క‌నీసం 3 టిక్కెట్లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే, అన్ని ఇవ్వ‌లేమ‌ని ఒక్క టిక్కెట్ ఇస్తామ‌ని పార్టీ నేత‌లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఎవ‌రికి ఇవ్వాలో అంద‌రు క‌లిసి తేల్చుకోవాల‌ని విద్యార్థి నేత‌ల‌కు సూచిస్తున్నారు. మొత్తానికి విద్యార్థి నేత‌ల‌కు ఆశించిన స్థాయిలో టిక్కెట్లు అయితే ద‌క్కే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అయినా, చివ‌రి ప్ర‌య‌త్నంగా వారంతా ఢిల్లీ వెళ్లి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*