పవన్ ఛాలెంజ్ టిడిపి స్వీకరిస్తుందా …?

ఎపి రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిపోతున్నాయి. టిడిపి ఒక పక్క వైసిపి అధినేత జగన్ ను మరోపక్క జనసేన అధినేత పవన్ ఇంకోపక్క బిజెపిని టార్గెట్ చేస్తూ పొలిటికల్ గేమ్ స్పీడ్ పెంచింది. ప్రత్యర్థులపై శర పరంపరగా ప్రశ్నలు సంధించడం సవాళ్ళు విసరడం ప్రతి సవాళ్ళు చేయడం రొటీన్ గా చేసే ఆరోపణలు, విమర్శలు కంటిన్యూ చేయడం పసుపుదళం ఎజెండా గా పెట్టుకుని కార్యాచరణ మొదలు పెట్టింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు నుంచి కింది స్థాయి వరకు అందరు ఇదే పనిలో ఇప్పుడు చాలా బిజీగా వున్నారు. అధికారపక్షానికి ఎడా పెడా డ్యామేజ్ చేస్తున్న విపక్షాలను టిడిపి నేతలు ఏమాత్రం ఉపేక్షించకుండా మైండ్ గేమ్ ఒక రేంజ్ లో స్టార్ట్ చేసేశారు. వీరి ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు విపక్షాలు అదే స్థాయిలో తిరిగి ఎదురుదాడి మొదలు పెట్టేశాయి.

ఇలా చేయండి కలిసొస్తా అంటున్న పవన్…

పవన్ కళ్యాణ్ విశాఖ రైల్వే జోన్ కోసం తమతో చేతులు కలపాలంటూ టిడిపి ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు జనసేనాని. దీక్షలపై చిత్తశుద్ధి లేకుండా బరువు తగ్గడానికంటూ అపహాస్యం చేసిన వారు తన మద్దత్తు కావాలనడం పై ఆయన శివాలెత్తారు. 19 మంది ఎంపీలు రాజీనామా చేసి పోరాటానికి దిగితే తన మద్దత్తు ఉంటుందని వారికి ప్రతి సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. దీక్షలను ఎంపీ మురళి మోహన్, అవంతి శ్రీనివాస్ తదితరులు ఎంత అవహేళన చేశారో ప్రజలు చూశారని పవన్ పేర్కొన్నారు. చిత్తశుద్ధిలేనివారు చేసే పోరాటాలకు ప్రజల్లో విలువ లేదని స్పష్టం చేశారు.

దీక్షల ఉద్యమం ఆగేనా …?

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసిన సిఎం రమేష్ ఉద్యమం పక్కకు పోయి ఢిల్లీ లో ఎంపీల వ్యాఖ్యలే ప్రధాన పక్షాలకు అస్త్రాలుగా మారిపోయాయి. దాంతో సమైక్యాంధ్ర ఉద్యమం లాగే ప్రస్తుత దీక్షలు ఆందోళన కార్యక్రమాలు మిగిలిపోయే అవకాశాలు స్పష్టం అవుతున్నాయి. ఢిల్లీ వేదికగా పార్లమెంట్ లోను గళం ఎత్తాలిసిన అంశాలు రాజకీయ ప్రచార అస్త్రాలుగా టిడిపి ఏపీలో చెప్పుకోవడం వృధా ప్రయాసే అంటున్నారు మేధావులు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సరైన రీతిలో వినియోగించుకుంటే అదే రాష్ట్రానికి మేలు చేస్తుందని చెబుతున్నారు వారు. కానీ టిడిపి మాత్రం కోట్లాది రూపాయల ఖర్చుతో ధర్మపోరాటం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని వారంటున్నారు. హోదా ఇవ్వాలి, విభజన హామీలు నెరవేర్చాలన్న అంశంపై ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల్లో ఒకే అభిప్రాయం వున్నప్పుడు ధర్మపోరాటం దేనికోసం ఎవరికోసం అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారిపోయింది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*