పళనికి పండగే పండగ…!

పళనిస్వామి బలోపేతం అవ్వాలనుకుంటున్నారా? జయలలిత తర్వాత పార్టీలో తానే బలమైన నేత అని చాటి చెప్పదలచుకున్నారా? అవును. ఇదినిజం. పళనిస్వామి పాలన పట్ల పార్టీ క్యాడర్ మాత్రమే కాదు ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించడం ఆయనలో నూతనోత్తేజాన్ని నింపింది. అనుకోని పరిస్థితుల్లో, అనూహ్యంగా తెరమీదకు వచ్చారు పళనిస్వామి. అప్పటి వరకూ జయలలిత భక్తుడిగానే తెలిసిన పళనిస్వామిని నమ్మినబంటుగా భావించి శశికళ ముఖ్మమంత్రిని చేశారు. సీఎం సీటులో తాను ఉన్నా, పళనిస్వామి ఉన్నా ఒక్కటేనని భావించి వారం రోజులు రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను దాచిపెట్టి మరీ పళనిస్వామిని చిన్నమ్మ ముఖ్యమంత్రిని చేయగలిగారు.

ఉప ఎన్నికలు వచ్చినా….

అయితే ఆ తర్వాతనే పళనిస్వామికి తెలిసి వచ్చింది. ముఖ్యమంత్రిగా తాను ఉన్నా….శశికళ జైలులో ఉన్నా మన్నార్ గుడి మాఫియాదే పైచేయిగా ఉంటుందని ఆయన కొద్దిరోజులకే అర్థమయింది. దీంతో శశికళ కుటుంబాన్ని పక్కనపెట్టి, మన్నార్ గుడి మాఫియాను ఎదిరించిన పన్నీర్ సెల్వానికి దగ్గరయ్యారు.ఇందులో బీజేపీ హస్తం కూడా ఉందన్న ప్రచారం ఉన్నా…గత కొద్ది రోజులుగా పళనిస్వామి పాలన సాఫీగా సాగుతోంది. అయితే దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం, వారు కోర్టును ఆశ్రయించడం కొంత ఇబ్బందిగా మారింది. ఉప ఎన్నికలు వస్తే ఎలా అన్న సందిగ్దంలో పళనిస్వామి ఉన్నారు. వారిని పార్టీలోకి ఒకవైపు ఆహ్వానిస్తూనే మరోవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

సర్వేలో సానుకూలత…..

అందుకోసమే ఉప ఎన్నికలు జరిగితే ఆ 18 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న అంచనాకు రావాలని సర్వేలు చేయించారని తెలిసింది. ఈ సర్వేల్లో దాదాపు అన్ని నియజకవర్గాల్లో సానుకూలత వ్యక్తమయినట్లు తేలడంతో పళనిస్వామి ఉప ఎన్నికలు వచ్చినా సై అంటున్నారట. తనకు అత్యంత సన్నిహితులైన మంత్రివర్గ సభ్యులతో ఈ విషయం చెప్పేశారట. ఉప ఎన్నికలు వచ్చినా ఇబ్బందేమీ ఉండదని, గెలిచి తీరతామని పళనిస్వామి చెప్పారని సమాచారం. ఇటీవల జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా ఓటమి పాలయింది. దీంతో అన్నాడీఎంకే క్యాడర్ కూడా ఆందోళన వ్యక్తమయింది. అమ్మ వారసత్వం అక్కడ గెలిచిన దినకరన్ కే దక్కుతుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

దినకరన్ వర్గానికి చెక్ పెట్టే యత్నం….

శశికళ కుటుంబం జయాటీవీ, నమదు ఎంజీఆర్ పత్రికలో పళనిస్వామి సర్కార్ ను రోజూ ఏకిపారేస్తున్నారు. దీంతో అన్నాడీఎంకేను, పార్టీ గుర్తును కాపాడుకునేందుకు పళనిస్వామి ప్రత్యేకంగా పార్టీ నమదు పురుచ్చతలైవి అమ్మ పత్రికను స్థాపించారు. ఇది ఇప్పుడు అన్నాడీఎంకే అధికార పత్రిక అయింది. ఈ పత్రికలో రజనీ, కమల్ హాసన్ ను మాత్రమే కాకుండా దినకరన్ పై నిత్యం విమర్శలు చేస్తోంది. శశికళ జైలు నుంచి బయటకు వచ్చే లోపు పార్టీ పైనా, ప్రభుత్వంపైనా తాను పూర్తి స్థాయి పట్టుసాధించాలన్న లక్ష్యంతో పళనిస్వామి ఉన్నారు. అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తాను చాటి తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు పళనిస్వామి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*